
ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర
పార్వతీపురంటౌన్: స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర అని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందనన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకు సీల్డ్ కవర్‌లో అందించాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. దీనికోసం నియమించిన పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షించవలసి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా చూడడమే కాకుండా, ఉల్లంఘన జరిగితే, ఆ సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రతి పరిశీలకుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను తు,చ తప్పక పాటించాలని, అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన చేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో సూక్ష్మ పరిశీలకుల విధులు, బాధ్యతలపై మెటీరియల్ ఇప్పటికే అందజేశామన్నారు. దాన్ని క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవా లని సూచించారు. ఎన్నికల ముందు రోజు నుంచే సమర్థవంతంగా విధులను నిర్వర్తిస్తూ, విజయవంతం చేయాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి హేమలత
Comments
Please login to add a commentAdd a comment