
ఏం తెస్తారో చూడాలి!
బడ్జెట్‌లో..
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కూటమి ప్రజాప్రతినిధులు బడ్జెట్‌లో ఏం తెస్తారో చూడాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సూపర్ సిక్స్ సహా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క గ్యాస్ సిలెండర్ మినహా గత తొమ్మిది నెలల పాలనలో మరేదీ అమలుచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే స్వల్ప కాలంలోనే ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దాని ప్రభావం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. విజయనగరం ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలలో గట్టెక్కడానికి అమలు సాధ్యం కానీ హమీలు గుప్పించి... తీరా అధికారం దక్కించుకున్నాక కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమ పాలన గాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పాలన సాగిస్తోందని విమర్శించారు. పీపీపీ ముసుగులో చివరకు సాగునీటి కాల్వల సహా ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని, టోల్ గేట్లు పెట్టి సామాన్య ప్రజల నడ్డివిరిచేస్తారని చెప్పారు.
తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చుచేస్తున్నారు?
కేవలం 10 నెలల పాలనా కాలంలోనే లక్షా10 వేల కోట్ల రూపాయల అప్పుచేసిన కూటమి ప్రభుత్వం... ఆ మొత్తాన్ని ఒక్క సంక్షేమ కార్యక్రమానికీ కేటాయించని వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు స్థానిక పాలకులు ఎంతమేర సాధించుకొస్తారో చూస్తామన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కేంద్రం నుంచి అనుమతులు తెచ్చిందని, నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించిందని, ఎన్నికల సమయానికి 30 శాతం మేర పనులు పూర్తయ్యాయని జెడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. అంతా తామే చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతోందని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జల్‌జీవన్ మిషన్ పథకంలో ఎన్ని కుళాయిలు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, కొప్పులవెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, గంట్యాడ జెడ్పీటీసీ నరసింహమూర్తి పాల్గొన్నారు.
నిరుద్యోగులపై
లాఠీచార్జి
అమానుషం...
భోగాపురం ఘనత
వైఎస్సార్‌సీపీదే...
నిర్వీర్యం
చేసిన
ఘనత
కూటమిదే...
సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీతో యువతకు లక్షల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ హమీలు గుప్పించిన కూటమి నేతలు... గడిచిన పది నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రోస్టర్ విధానాన్ని సరి చేసిన తరువాతనే గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జీ చేయించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒకలా, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకలా, విద్యాశాఖ మంత్రి మరోలా ప్రకటనలిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు. వారిని నమ్మి పరీక్ష వాయిదా పడుతుందనుకున్నవారంతా తీవ్రంగా నష్టపోయారని, పరీక్షలకు హాజరుశాతం బాగా తగ్గిపోయిందని వెల్లడించారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గ్రామస్థాయిలో ప్రారంభించిన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను ఇప్పుడు నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా సేవలు రైతులకు దూరమయ్యాయని చెప్పారు. ఎరువులు, విత్తనాలకు ఇష్టానుసారం ధర పెంచేసి ప్రైవేటు వ్యాపారస్తులు వారిని గుల్ల చేస్తున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అటకెక్కించి రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఇక కొత్త పింఛన్లు కోసం అర్హులైన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయని చెప్పారు. వికలాంగుల పింఛన్లలో అనర్హుల ఏరివేత పేరుతో దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లి అవయవలోపాన్ని నిర్ధారించుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment