
ఆపరేషన్ ద్రోణగిరికి విజయనగరం ఎంపిక
విజయనగరం అర్బన్: ఆపరేషన్ ద్రోణగిరి పేరుతో జియో స్పేషియల్ డేటా ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ (జీడీపీడీసీ) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాజెక్టుకు విజయనగరం ఎంపికై ందని జేసీ సేతుమాధవన్ తెలిపారు. దేశంలోని 5 రాష్ట్రాల్లోని ఐదు జిల్లాలు ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయగా, అందు లో ఏపీ నుంచి విజయనగరం జిల్లా ఒకటని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జీడీపీడీసీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, రవాణా, అటవీ, డీఆర్‌డీఏ, డ్వామా, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జలవనరులు తదితర శాఖల వద్ద ఉన్న డేటాతో ఆయా శాఖల్లోని పలు అంశాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. జీడీపీడీసీ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి మాట్లాడుతూ ప్రాజెక్టు అమలు రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కీలక వాటాదారులను ఒకచోట చేర్చామన్నారు. వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాల కోసం భౌగోళిక డేటా పరిష్కారాలను పెంచడమే ఆపరేషన్ ద్రోణగిరి లక్ష్యమన్నారు. నిజ సమయ వ్యవసాయ పర్యవేక్షణ, సలహాలతో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, కృత్రిమ మేధా శక్తితో కూడిన ఆప్టిమైజేషన్ ప్లీట్ ట్రాకింగ్ ఉపయోగించి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణ ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి పరిష్కారాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ నోడల్ జియోస్పేషియల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ (జీఐఏ)గా ఐఐటీ తిరుపతి కీలక పాత్ర వహిస్తోందన్నారు. విజయనగరం జిల్లా భారతదేశంలో భౌగోళిక నాయకత్వ అభివృద్ధికి నమూనాగా మారుతుందన్నారు. జీవన భృతులు పెంపొందించేందుకు, ఆర్థిక, సాంకేతిక పరమైన అభివృద్ధికి ఈ అధ్యయనం ఉపకరిస్తుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో రైతులకు కచ్చితమైన సమాచారం లేకపోడం వల్ల నష్టపోతున్నారని, అలాంటి సమాచారాన్ని వాస్తవ సమయంలో ఇచ్చినట్లు చూడాలని కోరారు. సన్న, చిన్నకారు రైతులకు మార్కెట్‌లో జోక్యం, ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచాలన్నారు. అంతకుముందు కమిటీ ప్రతినిధులు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పలు ఐఐటీ సంస్థలు, కంపెనీల
ప్రతినిధులతో కలెక్టరేట్‌లో వర్క్‌షాప్
సాంకేతిక సమస్యలకు పరిష్కారం:
జేసీ సేతుమాధవన్
Comments
Please login to add a commentAdd a comment