
ఏసీబీకి చిక్కిన కమిషనర్
పాలకొండ:
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగరపంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణం సీతంపేట రోడ్డులోని కోటదుర్గ నర్సింగ్‌హోమ్‌లో 2017లో పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలైన గర్భిణి ప్రసవించారు. ఆ బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆస్పత్రి నుంచి నగరపంచాయతీ కార్యాలయానికి దరఖాస్తు చేయగా జనన ధ్రువపత్రం మంజూరు చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రసవతేదీకి విరుద్ధంగా నర్సింగ్‌హోమ్ డాక్టర్ రౌతుభారతి నమోదుచేశారంటూ మరో ఉపాధ్యాయురాలు నగరపంచాయతీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన పంచాయతీ అధికారులు తప్పును నిర్ధారించి జననధ్రువీకరణ పత్రం రద్దుచేశారు. వైద్యురాలితో రూ.500 ఫైన్ కట్టించారు. సరిచేసి ఇవ్వాలంటూ ఉపాధ్యాయురాలితో మళ్లీ దరఖాస్తు చేయించారు. చర్యలు తీసుకోకుండా ఫైన్‌తో సరిపెట్టేశారంటూ ఫిర్యాదుదారు ఆర్టీఐ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిని అవకాశంగా మార్చుకున్న కమిషనర్... ఆర్టీఐ కమిషన్ వద్దకు వెళ్లాలంటే రూ.30 వేలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం చెల్లించాలని వైద్యురాలు భారతిని డిమాండ్ చేశారు. ఆమె రూ.20వేలు చెల్లించేందుకు అంగీకరించి, విషయం ఏసీబీ అధికారులకు చేరవేశారు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో నర్సింగ్ హోమ్‌కు కమిషనర్ తన డ్రైవర్ రాజును పంపించారు. అప్పటికే రూ.20వేల మొత్తానికి రంగుపూసిన 40 నోట్లును రాజుకు ఆమె అందజేశారు. అక్కడే మాటువేసి ఏసీబీ అధికారులు రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించడంతో కమిషనర్ తీసుకోమని చెప్పారని తెలిపాడు. ఆయనకు గట్టిగా హెచ్చరించి ఆ డబ్బుతో కమిషనర్ ఇంటి వద్దకు చేరుకుని రాజును లోపలకు పంపించారు. రాజు చేతిలో ఉన్న డబ్బులు కమిషనర్‌కు అందించగానే ఏసీబీ అధికారులు దాడిచేసి కమిషనర్‌ను అరెస్టు చేశారు. అక్కడ నుంచి కమిషనర్‌ను నగర పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి రెండు గంటల పాటు విచారణ జరిపారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు కె.భాస్కరరావు, ఎస్.వి.రమణ, ఎస్‌ఐలు డి.సత్యారావు, కె.వాసునారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
రూ 20వేలు లంచం
తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment