బీమా డ్రామా..!
● వివరాలు సరిగా లేవని కంపెనీ
నుంచి రైతులకు మేసేజ్‌లు
● పంటల బీమా ఎగ్గొట్టే ప్రయత్నం
● రబీలో రెండు నెలల క్రితం ప్రీమియం చెల్లించిన రైతులు
● జిల్లాలో 12, 633 హెక్టార్లలో
పంటలకు బీమా చెల్లింపు
● ప్రీమియం చెల్లించిన రైతులు 1,23,771 మంది
విజయనగరం ఫోర్ట్: ‘‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సిరిపురపు తాతబాబు అనే రైతు పెసర పంటకు సంబంధించి 2024 డిసెంబర్ నెలలో బీమా ప్రీమియం చెల్లించాడు. తాజాగా భూమి వివరాలు, బ్యాంకు వివరాలకు వ్యత్యాసం ఉందని ఆ రైతుకు సోమవారం మెసేజ్ వచ్చింది. దీంతో రైతు ఉలిక్కి పడ్డాడు. బీమా ప్రీమియం చెల్లించిన రెండు నెలల తర్వాత పత్రాల్లో వ్యత్యాసం ఉందని మెసేజ్ రావడం ఏమిటని ఆందోళన చెందుతున్నాడు.
అలాగే గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన లోకవరపు ఆదినారాయణ కూడా డిసెంబర్ 2024లో పెసర, మినుము పంటలకు బీమా ప్రీమియం చెల్లించాడు. ఆ రైతుకు కూడా రెండు రోజుల క్రితం భూమి వివరాలు, బ్యాంకు వివరాల్లో వ్యత్యాసం ఉందని మెసేజ్ వచ్చింది. ’’ ఇలా ఈ ఇద్దరు రైతులకే కాదు. వేలాది మంది రైతులకు ఈ విధంగా బీమా కంపెనీ నుంచి మెసేజ్‌లు రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడింది. దీంతో రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించారు. అయితే ఇప్పడు ఆ పంటల బీమాను కూడ ఎగ్గొట్టే ప్రయత్నం బీమా కంపెనీ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీల నుంచి రైతులకు వస్తున్న మెసేజేలే ఈ ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పంటల బీమా ప్రీమియం చెల్లిస్తే ఇప్పడు భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకుకు సంబంధించిన పత్రాల వ్యత్యాసం కారణంగా ఽబీమా దరఖాస్తును తిప్పి పంపనున్నట్లు మెసేజ్ రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
గంట్యాడ మండలం పెదవేమలిలో సాగులో ఉన్న పెసర పంట
రబీలో దెబ్బతిన్న అపరాల పంటలు
2024– 25 రబీసీజన్‌లో సాగు చేసిన అపరాల (పెసర, మినుము) పంటలు అప్పటల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు, బీమా కంపెనీ వారు బీమా చెల్లించాల్సి ఉంది. అయితే అధిక మొత్తంలో బీమా చెల్లించాల్సి వస్తుందనే నెపంతో కంపెనీ వారు బీమా చెల్లించే మొత్తం తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మెసేజ్‌లు పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బీమా ప్రీమియం దరఖాస్తులో వ్యత్యాసం ఉందని మెసేజ్‌లు పంపిస్తున్నారు. చాలా మంది రైతులు ఆ మెసేజ్‌లు చూసుకోరు. దీంతో పంటల బీమాకు వారు అర్హులు అయినప్పటికీ బీమా పొందలేరు. డబ్బులు కట్టాం..బీమా వస్తుందనే ధీమాలో రైతులు ఉంటారు. కానీ మెసేజ్‌కు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మీరు బీమాకు అనర్హులని కంపెనీవారు చెప్పే అవకాశం ఉందనే వాదనలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. మెసేజ్‌లు చూసుకోలేని వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది.
బీమా ఎగ్గొటే ప్రయత్నమే
రైతులు అపరాలకు బీమా ప్రీమియం చెల్లించి రెండు నెలలు అవుతోంది. ఇప్పడు భూమి వివరాలకు, బ్యాంకు వివరాలకు వ్యత్యాసం ఉందని మెసేజ్‌లు పెడుతున్నారు. చాలామంది రైతులు మెసేజ్‌లు చూడరు. అటువంటి వారిని అనర్హులుగా గుర్తించి బీమా ఎగ్గొంటేందుకు బీమా కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాం.
– బుద్ధరాజు రాంబాబు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు
మెసేజ్‌ల విషయం తెలియదు
పంటల బీమా పథకానికి సంబంధించి బీమా కంపెనీ నుంచి రైతులకు మెసేజ్‌లు వచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
– వి. తారాకరామారావు, జిల్లా వ్యవసాయాధికారి
బీమా డ్రామా..!
బీమా డ్రామా..!
Comments
Please login to add a commentAdd a comment