సర్వం సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం!

Published Wed, Feb 26 2025 7:56 AM | Last Updated on Wed, Feb 26 2025 7:52 AM

సర్వం సిద్ధం!

సర్వం సిద్ధం!

విజయనగరం టౌన్‌: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రమైన మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలను డీఆర్వో శ్రీనివాసరావు, ఆర్డీఓ డి.కీర్తి, వన్‌టౌన్‌ సీఐ ఎస్‌.శ్రీనివాస్‌, డీటీ సంజీవ్‌ సోమవారం సందర్శించారు. పోలింగ్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఏర్పాట్లు

5,223 మంది ఓటర్లకు 29 పోలింగ్‌ కేంద్రాలు

ఎన్నికల నిర్వహణకు 150 మంది నియామకం

సాధారణ ఎన్నికల్లా సాగిన ప్రచారం

‘గాదె’కే గెలుపు అవకాశాలు

రెండో ఓటు అయినా వేయండని టీడీపీ నేతల ప్రలోభాలు

బ్యాలెట్‌ ఓటు రహస్యమే

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార హోరుకు తెరపడింది. గురువారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహించాల్సిన వివిధ కేడర్‌ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయ్యింది. విజయనగరం జిల్లాలో ఉన్న 5,223 మంది ఓటర్ల కోసం 29 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రొసీడింగ్‌ అధికారి, ఇద్దరు ఏపీవోలు, ఒక ఓపీవోతో పాటు ఒక మైక్రో అబ్జర్వర్‌ను కేటాయించారు. గత కొద్దిరోజులుగా పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించారు. దాదాపు 150 మంది సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించనున్నారు.

గతి తప్పిన ప్రచారం..

శాసన మండలిలో మేధావి సభ్యులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈసారి గతి తప్పింది. పోటీల్లో ఉన్న ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం చూసి ఉపాధ్యాయ వర్గం ముక్కున వేలేసుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా రాజకీయ పార్టీల ప్రచారం చేయడం శాసన మండలి చరిత్రలో చూడలేదని ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమని పలువురు టీచర్లే ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలు, ఎంపీతోపాటు ప్రత్యేకించి నియోజకవర్గానికి రాజకీయ నాయకులను ఒక ఇన్‌చార్జిగా వేశారు. ప్రతీ విద్యాలయానికి వెళ్లి ప్రతి ఓటరును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.

‘గాదె’కే గెలుపు అవకాశాలు!

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ గత కొద్దిరోజుల వరకు రసవత్తరంగా ఉండేది. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల ప్రచార శైలిని పరిశీలిస్తే... పోలింగ్‌ తేదీ దగ్గర పడిన కొద్ది పోటీ పీడీఎఫ్‌ అభ్యర్థి కె.విజయగౌరి, పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు మధ్య ద్విముఖంగా మారింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల ఓటింగ్‌ను పరిశీలిస్తే గెలుపు అభ్యర్ధులకు రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారింది. టీడీపీ ప్రకటించిన అభ్యర్ధి రఘువర్మపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్పష్టంగా కనిపించడంతో రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకు రావడం కష్టమే. గతంలో పోటీచేసినప్పుడు వచ్చినట్లే ఈసారి కూడా రెండో ప్రాధాన్యత ఓటు అధికంగా గాదె శ్రీనివాసుల నాయుడు తెచ్చుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండో ఓటు కోసం టీడీపీ నేతల ప్రలోభాలు...

టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రఘువర్మ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవలేమని ముందుగానే ఆ పార్టీ అధిష్టానం గ్రహించినట్లుంది. ఈ నేపఽథ్యంలో రెండో ఓటు అయినా వేయండని టీడీపీ నేతలు తమ ప్రచారాల్లో టీచర్లను ప్రలో భాలకు గురుచేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు నేరుగా వెళ్లి ప్రధానోపాధ్యాయుల చాంబరల్లోని సీటులో కూర్చొని స్థానిక ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసిన సంఘటనలు జిల్లాలో జరిగాయి. చివరికి వారి ఒత్తిడి తారస్థాయి చేరింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవులు స్థానిక మెనానిక్‌ టెంపుల్‌ సమావేశ మందిరంలో, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు స్థానిక క్షత్రియ కళాక్షేత్రంలో విందు భోజనాలు, అనంతరం తాయితాలు ఇచ్చి ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రలోభాలు పెట్టిన సంఘటనలు కనిపించాయి.

బ్యాలెట్‌ ఓటు రహస్యమే...

టీడీపీ నేతల ఒత్తిడి నేపథ్యంలో ఓటు స్వేచ్ఛపై ఉపాధ్యాయుల్లో పలు అనుమానాలు వస్తు న్నాయి. ఓటు ఎవరికి వేసిందీ తెలిసిపోతుందేమోనని ఉపాధ్యాయులు బయపడనవసరం లేదు. శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌ నిబంధనలు మేరకు బ్యాలెట్‌ ఓటు కౌంటింగ్‌ సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. అన్ని పోలింగ్‌ బూత్‌ల ఓట్లను కలిపేసి ఒక డబ్బాలో వేసి కౌంటింగ్‌ చేస్తారు. ఓటు ఎక్కడ వేసిందో, ఎవరు వేసిందో తెలియదు. టీడీపీ నేతల ఒత్తిడికి భయపడి ఓటు హక్కు స్వేచ్ఛను కోల్పోవద్దని మేథావులు సూచిస్తున్నారు.

పోలింగ్‌ గదుల పరిశీలన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement