
శతశాతం ఉత్తీర్ణతకు కృషి
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామని.. ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను బట్టి ఏ, బీ, సీ, డీలుగా విభజించి, వారిలో విద్యానైపుణ్యాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ప్రధానంగా చదువులో సీ, డీ గ్రేడ్‌ల్లో ఉన్నవారిపై దృష్టి సారించి, ఉత్తీర్ణత మార్కులు సాధించేలా బోధన సాగిస్తున్నామన్నారు. ప్రత్యేక తరగతులను తనతో పాటు కలెక్టర్, ఇతర అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న పలు అంశాలపై ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
● గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎం జన్‌మన్ పథకం కింద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 1,450 గ్రామాలుంటే.. అందులో 416 పీవీటీజీ గ్రామాలున్నాయి. వీటిలో పీఎం జన్‌మన్ పథకం కింద తాగునీరు, గృహనిర్మాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు, పీఎం సూర్యఘర్ కింద సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నాం. డీఏ – జేజీవీఏ(ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్స్ అభియాన్) పథకం కింద ప్రతిపాదనలు పంపుతున్నాం. ఇందులో భాగంగా పక్కా ఇళ్లు, నీటి సరఫరా, కమ్యూనిటీ కుళాయిలు, విద్యుత్, మొబైల్ మెడికల్ యూనిట్లు, ఆయుష్మాన్ కార్డులు వంటి సౌకర్యాలు కలగనున్నాయి.
● ఆర్టికల్ 275(1) పనుల కింద షెడ్యూల్డ్ తెగల గ్రామాల్లో రక్షిత తాగునీరు, రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్తు, గృహ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధానమిస్తున్నాం. గోకులం షెడ్లు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలనూ త్వరితగతిన పూర్తి చేయాలని చెబుతున్నాం.
● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 54 వన్‌ధన్ వికాస కేంద్రాలు (వీడీవీకే) ఉన్నాయి. ఇందులో 300 మంది వరకు సభ్యులుగా ఉంటారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్, బ్రాండింగ్ కల్పించి అదనపు ఆదాయం వచ్చేలా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడీవీకేలను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాలకు రూ.4 కోట్ల వరకు నిధులు మంజూరుకాగా, ఇందులో సుమారు రూ.40 లక్షల వరకు వెచ్చించి ఎనిమిది చింతపండు కేకు మిషన్లు, రెండు మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్లు, రెండు పసుపు పిండి తయారు చేసే మిషన్లు కొనుగోలు చేశాం. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం.
● ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ఆదివాసీ మహోత్సవం జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో మన వీడీవీకేల తరఫున రెండు వెళ్లాయి. మిల్లెట్స్, బిస్కెట్స్, కొండ చీపుర్లు స్టాల్స్‌ను మనవాళ్లు ప్రదర్శనలో ఉంచారు.
● పార్వతీపురం ఏఎంసీలో జీడి ప్రాసెసింగ్ యూనిట్ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ మొదటి వారానికి సిద్ధం కానుంది.
టెన్త్‌లో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
గిరిజనుల అభివృద్ధికి చర్యలు
‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ
ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ
ఆశ్రమ, ఏకలవ్య పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు కలెక్టర్, పీవో ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఐటీడీఏ పరిధిలోని విద్యాలయాల్లో సన్నద్ధత తీరును ఆమె ‘సాక్షి’కి వివరించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 40 ఆశ్రమ పాఠశాలలు ఉండగా 1,518 మంది.. జోగింపేట, కురుపాం, భద్రగిరి, పి.కోనవలస, కొమరాడ, భద్రగిరి(బాలురు) తదితర ఆరు గురుకులాల్లో 415 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. వీరందరికీ మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా... ఈఎంఆర్‌ఎస్కు సంబంధించి 211 మంది సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయని వివరించారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. ఏపీఆర్‌జేసీ మొదటి సంవత్సరం 675 మంది, ద్వితీయ సంవత్సరం 660 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
సిలబస్ పూర్తి..
పదోతరగతి, ఇంటర్మీడియట్‌కు సంబంధించిన సిలబస్ మొత్తం పూర్తి అయ్యిందని ఆమె తెలిపారు. పదిలో రివిజన్ కూడా పూర్తి అయ్యిందని, ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా పెట్టి వారిలో పరీక్షలు అంటే భయం పోగొట్టేలా సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వారిపై మరింత శ్రద్ధ చూపి ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యంపైనా దృష్టి..
విద్యార్థుల ఆరోగ్యంపైనా పీవో ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రక్తహీనత ఉన్నవారికి ఐరన్ మాత్రలతో పాటు.. పాలు, గుడ్లు అదనంగా ఇస్తున్నామని చెప్పారు.

శతశాతం ఉత్తీర్ణతకు కృషి
Comments
Please login to add a commentAdd a comment