
ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబాటు
● మార్కెట్ కమిటీల లక్ష్యం రూ.12.89 కోట్లు
● ఈనెల10 నాటికి సాధించింది రూ.7.41కోట్లు
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లు ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్య సాధనకు గడువు తక్కువ కాలమే ఉండడంతో మార్కెట్ కమిటీలు లక్ష్యాన్ని సాధించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సాధించగలిగితే వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతుబజార్లు, వ్యవసాయ చెక్‌పోస్ట్‌లు ఉంటాయి. వాటి నిర్వహణ, కార్యకలాపాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోనే జరుగుతాయి.
ఆదాయ లక్ష్యం రూ. 12.89 కోట్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యం రూ.12.89 కోట్లు. ఈ నెల 10 వతేదీ నాటికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు సాధించిన ఆదాయం రూ.7.41 కోట్లు ఇంకా రూ. 5.48 కోట్లు ఆదాయం సాధించాల్సి ఉంది. మార్చి నెలఖారు లోగా ఈ లక్ష్యాన్ని సాధించాలి. వ్యవసాయ చెక్‌పోస్టులు, గోదాములు, వ్యాపార లావాదేవీల ద్వారా ఆదాయం వస్తుంది. వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సామగ్రిని తరలించే వాహనాల నుంచి రుసుమును వ్యవసాయ చెక్ పోస్టుల వద్ద సిబ్బంది వసూలు చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న షాపుల నుంచి సెస్‌లు, మార్కెట్ కమిటీల్లో జరిగే వ్యాపారలావాదేవీల ద్వారా, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి గొదాముల అద్దెద్వారా మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది.
శతశాతం సాధించేందుకు కృషి
జిల్లాలో ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు రూ.7.41 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. ఇంకా రూ. 5.48 కోట్లు సాధించాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నందున శతశాతం ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తాం.
బి.రవికిరణ్, మార్కెటింగ్‌శాఖ ఎ.డి
జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు
జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, పూసపాటిరేగ, కొత్తవలస, చీపురుపల్లి , మెరకముడిదాంల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో 12 వ్యవసాయ చెక్‌పోస్టులు ఉన్నాయి.

ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబాటు
Comments
Please login to add a commentAdd a comment