
నేడే పోలింగ్
● ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
● ఓటు హక్కు వినియోగించుకోనున్న ఉపాధ్యాయులు
విజయనగరం అర్బన్:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఓటర్ల సంఖ్య 2,166 ఉండడంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ప్రక్రియను వీడియా రికార్డింగ్ చేస్తారు. ఓటర్లు ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుకెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 175 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్), ఏపీఓ, ఇద్దరు అదనపు పోలింగ్ అధికారులు, ఒక సూక్ష్మ పరిశీలకులను నియమించారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, ఆర్డీఓ కార్యాలయాల వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. విజయనగరం డివిజన్లో 4 రూట్లు, చీపరుపల్లి, బొబ్బిలి డివిజన్లో రెండేసి రూట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రూట్ పర్యవేక్షణకు ఒక రూట్ ఆఫీసర్, ఒక సెక్టార్ ఆఫీసర్‌ను నియమించారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద పోలింగ్ సిబ్బందికి బుధవారం ఉదయమే ఎన్నికల సామగ్రిని అందజేశారు. మొత్తం 8 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏఆర్‌ఓగా వ్యవహరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు పర్యవేక్షించారు. జేసీ ఎస్.సేతుమాధవన్ చీపురుపల్లిలో పర్యటించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్డీఓ సత్యవాణితో మాట్లాడి ఏర్పాట్లను తెలుసుకున్నారు. పీఓలు, సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నిక ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన వివరాలు
మొత్తం ఓటర్ల సంఖ్య: 5,223
పోలింగ్ కేంద్రాలు: 29
పోలింగ్
సమయం:
విధులు నిర్వహిస్తున్న
సిబ్బంది:
ఉదయం 8 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు
175 మంది

నేడే పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment