
వణికిస్తున్న జ్వరాలు
శృంగవరపుకోట: ధారపర్తి పంచాయతీ పరిధిలో 11 గిరిజన గూడలు ఉన్నాయి. అన్నీ ఇంచుమించుగా కొండలపై ఉన్న గ్రామాలే. సరైన రహదారి సదుపాయం లేదు. రాళ్లదారిలోనే రాకపోకలు. అత్యవసర వేళ డోలీయే దిక్కు. ఆరోగ్య సేవలకు ఆశ కార్యకర్తే ఆధారం. ఇప్పుడు రాయిపాలెం, కురిడి గ్రామాల్లోని చిన్నారులను జ్వరాలు వణికిస్తున్నాయి. ఇదే పంచాయతీలో గతంలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇప్పుడు జ్వరాల వ్యాప్తితో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పిల్లలను భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగుతీస్తున్నారు. ఇప్పటికే రాయిపాలెం, కురిడి గ్రామాలకు చెందిన 12 మంది పిల్లలు ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ విషయం పత్రికల్లో బుధవారం ప్రచురితం కావడంతో కొట్టాం పీహెచ్‌సీ సిబ్బంది స్పందించారు. డాక్టర్ మానస ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. మరో ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. జ్వరాలతో ఆస్పత్రిలో చేరి పత్రికల్లో వార్తలు వస్తే తప్ప గ్రామాలవైపు కన్నెత్తి చూసేవారే ఉండరని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కనీసం ప్రాథమిక వైద్యసేవలు కూడా అందని ద్రాక్షగా మారాయని చెబుతున్నారు.
చిన్నారులను పరామర్శించిన డీఎంహెచ్‌ఓ
ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న 12 మంది గిరిజన చిన్నారులను డీఎంహెచ్‌ఓ జీవనరాణి బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చిన్నారుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు. సాధారణ వైరల్ జ్వరాలే అని, ఆందోళన అవసరం లేదన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలే జ్వరాల వ్యాప్తికి కారణమని వైద్యురాలు మానస తెలిపారు. బ్లడ్ శాంపిల్స్‌ను వైద్యపరీక్షలకు పంపించామన్నారు. అయితే, ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి వచ్చిన వైద్యాధికారులు ఆయా గ్రామాలను సందర్శించకుండానే వెనుదిరగడం గమనార్హం.
మంచంపడుతున్న చిన్నారులు
ఆస్పత్రికి వస్తే తప్ప అటువైపు చూడని వైద్యులు
జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని వైనం
అన్నింటికీ ఆశ కార్యకర్తే దిక్కు
Comments
Please login to add a commentAdd a comment