మరో మూడు రోజులే గడువు..! | - | Sakshi
Sakshi News home page

మరో మూడు రోజులే గడువు..!

Mar 28 2025 1:47 AM | Updated on Mar 28 2025 1:43 AM

రేషన్‌ లబ్ధిదారుల్లో ఆందోళన

ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించాలి

జిల్లాలో 2,77, 153 రేషన్‌కార్డులు

కార్డుల్లో సభ్యులు 8,23,638 మంది

7లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తి

పార్వతీపురం: రేషన్‌ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుల్లోని సభ్యలంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 2,77,153 రేషన్‌ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు లక్షమంది వరకు ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉండగా త్వరితగతిన ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు.

వలస దారుల ఆవేదన

బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్‌, విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్‌ కార్డులో పేర్లను తొలగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు.

మొరాయిస్తున్న సర్వర్లు

ఈకేవైసీ చేయించుకునేందుకు సర్వర్లు కూడా తరచూ మొరాయిస్తున్నాయి. అందరూ ఒకేసారి ఈకేవైసీ చేయించుకునేందుకు తరలివస్తున్న కారణంగా సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయ, రాత్రి సమయాల్లో సర్వర్‌ సమస్య లేనప్పటికీ మిగిలిన సమయాల్లో రేషన్‌ షాపులు, ఆధార్‌, మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో ఎక్కువమంది ఈకేవైసీకి రావడంతో సర్వర్లకు లోడ్‌ ఎక్కువై మొరాయిస్తున్నట్లు సాంకేతిక విభాగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది రేషన్‌ కార్డు లబ్ధిదారులు కేవలం చౌక దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని భావించడం వల్ల కూడా సమస్య తలెత్తుతోందని పలువురు అంటున్నారు.

ఈకేవైసీ చేయించుకోవాలి

రేషన్‌ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. మిగిలిన మూడు రోజుల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి. లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి.

ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌, పార్వతీపురం మన్యం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement