నేటి స్పెషల్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్: దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతినెల నాలుగో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పెషల్ గ్రీవెన్స్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె కోరారు.
వీల్‌చైర్ క్రికెట్‌లో
రాంజీ ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: ఒడిశాలోని భద్రక్‌లో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి వీల్‌చైర్ క్రికెట్ ఉత్కల్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వరంగల్‌కు చెందిన గుగులోత్ రాంజీనాయక్ ప్రతిభ కనబరిచాడు. తెలంగాణ దివ్యాంగ్ వీల్‌చైర్ క్రికెట్ టీం నుంచి జాతీయ స్థాయిలో పాల్గొన్న రాంజీనాయక్.. మూడు రోజుల పాటు జరిగిన టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లతో తలపడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూశాడు. తెలంగాణ జట్టు నుంచి పాల్గొన్న రాంజీనాయక్‌ను పలువురు అభినందించారు.
భద్రకాళి చెరువు
మట్టి విక్రయం
వరంగల్ అర్బన్: భద్రకాళి చెరువులో పూడికతీత మట్టిని ప్రభుత్వ ధర ప్రకారం విక్రయిస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ బి.సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఘనపు మీటరుకు రూ.144 చెల్లించి మట్టి కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం హనుమకొండ నక్కలగుట్ట బల్దియా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈనెల 30లోగా సంప్రదించాలని, ఇతర వివరాల కోసం 90001 72854 మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
గురుకులం ఆకస్మిక తనిఖీ
న్యూశాయంపేట: హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్డులో ఉన్న వరంగల్ (జీ–1) బాలికల గురుకులాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని కిచెన్‌లో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను ప్రిన్సిపాల్ కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, డీటీఈఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
నెక్కొండ: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గొల్లపల్లి శివారు మూడు తండాలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా కమలమ్మ–చందు పెద్ద కుమారుడు సుమన్ (21) ఇటీవల ఐటీఐ పూర్తి చేశాడు. పెళ్లికి సంబంధించిన విషయంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవతో సుమన్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈ నెల 21న రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
కేయూలో విజిలెన్స్ అధికారుల విచారణ
కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ హయాంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విజిలెన్స్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాకేశ్ బృందం శుక్రవారం యూనివర్సిటీలో విచారణ జరిపింది. వీసీ చాంబర్‌లో వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి సమక్షంలో విజిలెన్స్ అధికారులు పలు విషయాలపై సమాచారం తెలుసుకున్నారు. ప్రధానంగా 2021–22 పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది. పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవతకవలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించిన సీట్‌మాట్రిక్స్ గురించి అడిగినట్లు సమాచారం. పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించి వివిధ విభాగాల డీన్‌లను కూడా వీసీ, రిజిస్ట్రార్లు వీసీ చాంబర్‌కు పిలిపించారు. అందుబాటులో ఉన్న డీన్‌లు కూడా వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment