రైతన్న గుబులు
● నెల తిరక్కముందే కుళ్లిపోతున్న వరినాట్లు
● చీడపీడలు.. తెగుళ్లే కారణం
● జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు
దుగ్గొండి: వర్షాకాలం సన్నధాన్యానికి మంచి ధరతోపాటు ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో యాసంగిలో రైతులు ఉత్సాహంతో సన్న వరిధాన్యం రకాల ను సాగు చేశారు. కానీ ఆదిలోనే అన్నదాతలకు ది గులు మొదలైంది. నాటు వేసి నెల తిరక్కమందే పంటంతా ఎర్రబడి చనిపోతుంది. దీంతో రైతులు గుబులు చెందుతున్నారు. యాసంగిలో జిల్లా వ్యా ప్తంగా 58,600 ఎకరాల్లో వరి సాగుచేశారు. కొన్నిచోట్ల వరి పంట 15 నుంచి 70 రోజుల వయసులో ఉంది. అయితే నాటువేసిన 15వ రోజు నుంచి మొగిపురుగు, అగ్గితెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించి పంటంతా కుళ్లిపోతుంది. దీంతో పంటను కాపాడుకునేందుకు నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, శాస్త్రవేత్తలు రైతులకు సూచనలిస్తున్నారు.
కాండం తొలుచుపురుగు..
నారుమడిలో.. మొక్కలు పిలకదశలో ఉన్నపుడు ఈ పురుగు ఆశిస్తే మొక్కలు చనిపోతాయి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే తెల్లకంకులు అవుతాయి. ముదురు నారు నాటడం, నీటి తడులు సరిగా అందకపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, సూర్యరశ్మి అందకపోవడం, నత్రజని తక్కువగా వాడటం పురుగు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. పురుగు ఉధృతిని గుర్తించడానికి ఎకరాకు 8 లింగార్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పిలకలు, లేదా దుబ్బు దశలో ఎకరాకు 10 కిలోల 3జి గుళికలు వేయాలి. చిరుపొట్ట దశలో క్లోరంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
అగ్గి తెగులు..
వరిపైరు ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్ద మచ్చలుగా మారి ఒకదానికొకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. దూరం నుంచి చూస్తే పంట తగలబడినట్లు కనబడుతుంది. దీని నివారణకు యూరియాను తగ్గించి ధపాలుగా వాడాలి. చిరుపొట్ట దశ దాటిన తర్వాత ఎరువులను వాడకూడదు. లీటరు నీటికి 0.6 మిల్లీగ్రాముల ట్రైసైక్లజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
జింక్ లోపం..
వరిలో జింకుదాతు లోపం వల్ల మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్యన ఈనే పాలిపోతుంది. ఆకులపై ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. నత్రజని ఎరువులు వేసినా పైరు పచ్చబడదు. నివారణకు వరిపండించే భూముల్లో ప్రతి మూడు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింక్ సల్పేట్‌ను వేయాలి. లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్పేట్‌ను కలిపి వరి పైరుపై 5 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి. జింక్ సల్పేట్ పిచికారీ సమయంలో ఎలాంటి ఇతర మందులను కలపరాదు. ఇదిలా ఉండగా.. నేలలో సల్ఫైడ్(గంధకం) ఎక్కువ ఉండటం వల్ల వరి పంట ఈమధ్య కాలంలో బాగా పెరిగిన పంట గుంపులుగా మొత్తం పసుపు వర్ణంలోకి మారతుంది. నేల మెత్తగా మారుతుంది. నేలనుండి దుర్గందపు వాసన వస్తుంది. మొక్క వేర్లు కుళ్లిన కోడిగుడ్డు వాసన వస్తాయి. నీటి ముంపు, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవడం, నేలలో ఇనుము లభ్యం కాకపోవడం, బరువు నేలల్లో గతంలో గంధకం ఉన్న 20–20–0–15 ఎరువులు అధికంగా వాడటం వల్ల సల్‌పైడ్ నేలలో ఎక్కువై వేళ్లు కుళ్లిపోతాయి. మొక్కల వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి. పొలాన్ని సన్నని నెర్రెలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరు పారిస్తే ఈ సమస్యను నివారించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment