సర్వం సిద్ధం..
వరంగల్:
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యా య నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నిర్వహణకు కావాల్సిన ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద బుధవారం సందర్శించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, భోజన వసతి, షామియానాలు ఇతర వసతులు కల్పించగా.. పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించడానికి పంపిణీ కేంద్రానికి వచ్చిన పీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పోలింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిబ్బందికి సామగ్రిని అందించాలని, చెక్ లిస్టు ప్రకారం సామగ్రిని సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 2,352 మంది ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగివారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
ఎన్నికల డిస్ట్రిబ్యూషన్
సెంటర్‌ను
సందర్శించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment