
సీతారాముల కల్యాణం చూతము రారండి..
సాక్షి, నెట్‌వర్క్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు, బాసింగాలు, జీలకర బెల్లం సిద్ధం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయంలో సుమారు 10 వేల మంది భక్తులు వీక్షించేలా పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీల బాధ్యులు కోరుతున్నారు.