
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత
దామెర: మండలంలోని పసరగొండలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్ని శనివారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురు రైతులకు సంబంధించిన పొలాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వెళ్తోందని కాంట్రాక్టర్ మార్కింగ్ చేస్తూ.. సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా బాధిత రైతులు ఘటనా స్థలికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన పరిహారం ఇంకా తమకు రాలేదని, డబ్బులు రానిదే పనులు నిర్వహించరాదని ఆందోళనకు దిగారు. రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో తప్పులున్నాయని, అధికారులు వాటిని సరిచేసి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వెనుదిగారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.