నగరవనం.. ఆహ్లాదకరం
●
నగరవనం చాలా బాగుంది
బత్తులవారిగూడెం అటవీ ప్రాంతంలో ఉన్న నగరవనం ఎంతో బాగుంది. విజయవాడలో పార్కులున్నప్పటికీ వాటి కంటే ఇది చాలా బాగుంది. రోజువారీ ఒత్తిడిల నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఉండటంతో రీచార్జ్ కావడానికి దోహదపడుతుంది.
– షేక్ సుల్తానా, రాయనపాడు, విజయవాడ
పిల్లలు, పెద్దలకూ ఆహ్లాదం పంచేలా
నగరవనం పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం చాలా బాగుంది. పిల్లలు, పెద్దలు ఎన్నో రకాల ఆటలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. పెద్దలు ప్రకృతి ఒడిలో వాకింగ్ చేయడానికి కూడా ట్రాక్ ఉండటం బాగుంది. బాగుంది అంటే పిల్లలను తీసుకొని విజయవాడ నుంచి వచ్చాం.
– వీ శిరీష, విజయవాడ
నూజివీడు: ఎటు చూసినా పచ్చదనం... పక్షుల కిలకిలారావాలు... రణగొణ ధ్వనులకు దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలోని నగరవనం అందరినీ ఆకర్షిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నగర వనం... నేటి ఆధునిక యుగంలో ఉరుకులు పరుగులు పెట్టే పట్టణ వాసికి వరం... ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే నూజివీడుతో పాటు చుట్టుపక్కల ప్రాంత వాసులు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఏలూరు జిల్లాలో తొలిసారిగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం అటవీ ప్లాంటేషన్‌లో నగర వనాన్ని దిద్దారు. ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. వినోదం, విజ్ఞానం, ఆహ్లాదం మేళవించి దీనిని ప్రజల సౌకర్యార్ధం తీర్చిదిద్దారు. 125 ఎకరాల్లో తొలి విడత రూ.1.50 కోట్లతో నగరవనం తీర్చిదిద్దారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తయి ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది.
రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరవనం సందర్శించవచ్చు. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 టిక్కెట్. ప్రజలు రోజంతా ప్రకృతి ఒడిలో, పచ్చదనం తోడుగా ఉల్లాసంగా...ఉత్సాహంగా గడపవచ్చు. నగరవనంలో పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు ఉయ్యాలలు, రంగులరాట్నం, జారుడుబల్లలు ఏర్పాటు చేశారు. పచ్చదనం ఒడిలో వాకింగ్ ట్రాక్‌లు, వన్యప్రాణుల విశిష్టతను వివరించే విజ్ఞాన కేంద్రాలు, ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కలు, చెట్లు, ఎన్నో రకాల పక్షుల బొమ్మలు, వన్యప్రాణుల చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. అలసిపోతే పుట్టగొడుగుల ఆకారంలో ఉండే పగోడాలు, స్నాక్స్, టిఫిన్, భోజనం చేసేందుకు క్యాంటీన్ ఏర్పాటు, పిల్లల కోసం అనేక ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. నూజివీడు పట్టణం నుంచి మైలవరం రోడ్డులో కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఈ నగరవనం ఉంది.
విద్యార్థులతో కోలాహలం
కార్తీకమాసం ప్రారంభమైన నాటి నుంచి నూజివీడుతో పాటు మైలవరం, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ నగరవనంకు పిక్నిక్ నిమిత్తం విచ్చేస్తున్నారు. రోజువారీ పనులకు దూరంగా పగలు ప్రకృతి ఒడిలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.
బత్తులవారిగూడెం వద్ద
అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment