కోర్టు కాంప్లెక్స్ త్వరగా పూర్తి చేయాలి
భీమవరం: భీమవరంలో నూతనంగా చేపట్టిన కోర్టు కాంప్లెక్స్, న్యాయమూర్తుల క్వార్టర్స్ నిర్మాణం, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మూడో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎంఎ సోమశేఖర్‌తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ. 85.60 కోట్లతో కోర్టు కాంప్లెక్స్, భీమవరం, తణుకు పట్టణాల్లోని న్యాయమూర్తుల నివాస క్వార్టర్స్ మరమత్తులు, తణుకు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నివాస క్వార్టర్స్ వంటి పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జడ్జి సోమశేఖర్ మాట్లాడుతూ చిట్ ఫండ్స్ వంటి ఫైనాన్స్ సంస్థలకు సంబంధించి జిల్లాలో 83 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ కేసులను డిసెంబర్ 14న నిర్వహించే లోక్ అదాలత్‌లో త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఇఇ ఎ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు భీమవరంలో ఆర్చరీ పోటీలు
భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం పట్టణం వంశీనగర్‌లోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో జిల్లా స్థాయి సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎల్.జయరాజు శనివారం విలేకర్లకు తెలిపారు. పోటీల్లో పాల్గొనే సీనియర్ ఆర్చరీ క్రీడాకారులు రెండు ఆధార్ జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆదివారం ఉదయం 8 గంటలకు అకాడమీ వద్దకు హాజరుకావాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులు విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు.
కాడి మోసిన కూతుళ్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కంటే కూతుర్నే కనాలి అంటారు. ఆ కూతుళ్లు తండ్రి మరణించడంతో తల్లడిల్లిపోయారు. తండ్రి పాడెను శ్మశానం వరకూ మోసి తమ ప్రేమను చాటుకున్నారు. నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన సామాజికవేత్త వెన్నెల కోట శ్రీనివాస్ శనివారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను శనివారం స్థానిక శ్మశాన వాటికలో నిర్వహించారు. తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమతో కుమార్తెలు ఉష, దివ్య తండ్రి కాడిమోసి తమ రుణాన్ని తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment