మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
జంగారెడ్డిగూడెం: డాక్టర్ అక్కరాయుడు కమిటీ నివేదిక ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.31,500 ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమల్ల సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ హాలులో యూనియన్ అధ్యక్షుడు కూనపాముల విఘ్నేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ మున్సిపల్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పేరిట కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగటం లేదని, వెంటనే వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు క్యాజువల్ లీవులు అమలు చేయాలని జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలన్నారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరాటాలకు ఏఐటీయుసి మద్దతుగా ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, యూనియన్ జంగారెడ్డిగూడెం గౌరవ అధ్యక్షుడు జంపన వెంకటరమణరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment