న్యాయవాదుల రక్షణకు చట్టం అవసరం
భువనగిరి క్రైం : దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడులనుంచి కాపాడేందుకు రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ఐలు సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఎక్కడో ఓ చోట న్యాయవాదులపై దాడులు, హత్యల వంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అలాంటి ఘటనలను నియంత్రించాలంటే న్యాయవాదుల పరిరక్షణ చట్టం అవసరం అని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఈ–కోర్టు యాప్ ఏర్పాటు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ నెలకు రూ.5వేలు చెల్లించాలని, 2019 తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న న్యాయవాదులు అందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా సహాయ కార్యదర్శి బోల్లెపల్లికుమార్, సీనియర్ న్యాయవాది బొమ్మ వెంకటేష్, కోశాధికారి బొడ్డు కిషన్, సభ్యులు యాదాసు యాదయ్య, ముద్దసాని చంద్రశేఖర్‌రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఐలు జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment