70వ వసంతంలోకి సాగర్ ప్రాజెక్టు
● నాడు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ
● 1967లో కుడి, ఎడమ కాలువలకు
నీటి విడుదల
● రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా విరాజిల్లుతున్న ఆధునిక దేవాలయం
నాగార్జునసాగర్: రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు 70వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1955 డిసెంబర్ 10న భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నందికొండ సమీపంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువను జవహర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ నిర్మాణ పనులను 1956 అక్టోబర్ 10న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11,74,874 ఎకరాల సాగుకు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. సాగర్ ప్రాజెక్టు ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువను లాల్‌బహదూర్ కాలువగా పిలుస్తారు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని 1959లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భీమ్‌సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10,37, 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 1967 ఆగస్టు 4న నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు.
నెరవేరని లక్ష్యం..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కుడి, ఎడమ కాల్వలు కాలక్రమేణా దెబ్బతిని చివరి భూములకు నీరందే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగర్ ప్రాజెక్టు కింద చివరి భూములకు కూడా నీరందించాలని సంకల్పించి ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు 2017లో పూర్తయ్యాయి. కానీ పనుల్లో నాణ్యత లేని కారణంగా గతేడాది రెండుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. నేటికీ చివరి భూములకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూడిక నిండటంతో రెండు పంటలకు చాలని నీరు..
నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు జలాశయంలోని నీటి విడుదల ప్రణాళికను తయారు చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఆదేశాల కోసం ఎదురుచూడడంతో నీటి విడుదల ఆలస్యమై ప్రాజెక్టులోకి వచ్చిన వృథాగాపోతోంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు పారుతుందనేది అధికారుల వద్ద నిక్కచ్చి సమాచారం లేదు. మెయిన్ కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. నారుమళ్ల సమయంలో తక్కువ నీరు, పొలం తడిపే సమయంలో, పొట్ట దశలో నీటిని సరిపోను వాడుకునేలా డిజైన్ చేసి తూములు ఏర్పాటు చేయాలి. ఆ తూములకు షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంటకాల్వల వరకు ఏ తూముకు ఏ నెల ఎంత నీటిని విడుదల చేయాలి, ఎంత భూమి పారుతుందనే బోర్డులు పెట్టి వాటిపై నమోదు చేయాలి. కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలుంటాయి.
ఈ ఏడాది రెండు పంటలకు నీరందిస్తాం
ఈ ఏడాది వచ్చిన వరదలకు సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరుంది. రెండు కార్లకు నీరు సరిపోతుంది. రైతులు నీటిని పొదుపుగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటాం. నీరు జలాశయంలో మిగిలి ఉంటే వచ్చే ఏడాది ముందస్తుగా పంట పొలాలకు నీటిని విడుదల చేసే వీలుంటుంది. – మల్లికార్జున్, సాగర్ డ్యాం ఈఈ
సాగర్ జలాశయం విస్తీర్ణం 110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం 590 అడుగులు
డెడ్ స్టోరేజీ లెవల్ 490 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం 408.24 టీఎంసీలు
(ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు )
డెడ్ స్టోరేజీ సామర్థ్యం 179.16 టీఎంసీలు
(ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు)
నీటి విడుదలకు ఉండాల్సిన
కనీస నీటిమట్టం 510 అడుగులు
Comments
Please login to add a commentAdd a comment