డిండి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరికి పాల్పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన డిండి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. డిండి మండల కేంద్రంలోని ప్రెస్ కాలనీకి చెందిన శ్రీరామదాసు మధుసూదనాచారి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజలు క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు మధుసూదనాచారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన మధుసూదనాచారి తాళం పగులగొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాజు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రెండు తులాల బంగారం, పది పట్టుచీరలు
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీనివాసనగర్‌లోని దశరథ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దశరథ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న జనార్దన్‌రెడ్డి మూడు రోజుల కిందట తన కుమార్తె వివాహం చేశాడు. ఆదివారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన అల్లుడి ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సోమవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉండడంతో జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చింది. ఆయన కోదాడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని రెండు తులాల బంగారం, రూ.5వేల నగదు, 10 పట్టుచీరలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.
మూడు తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
ద్విచక్ర వాహనంలో నుంచి రూ.3లక్షలు..
దేవరకొండ: ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ.3లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం దేవరకొండ పట్టణంలో జరిగింది. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామానికి చెందిన రైతు మారుపాకల నిరంజన్ తాను విక్రయించిన పత్తికి సంబంధించి రూ.3లక్షలు యూనియన్ బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. నగదును డ్రా చేసిన నిరంజన్ తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టుకొని బయల్దేరాడు. పట్టణంలోని కోర్టు సమీపంలో గల మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. మందులు కొనుగోలు చేసి తిరిగి తన వాహనం వద్దకు వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment