రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలు
మద్దిరాల: ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మద్దిరాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. సూర్యాపేట నుంచి లింగయ్య అనే వ్యక్తి వరంగల్‌కు ఆటోలో వెళ్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌లోని కురవి వైపు వెళ్తున్న కారు మద్దిరాల మండల కేంద్రంలోని 365వ నంబర్ హైవేపై ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్యకు గాయాలయ్యాయి. పోలీసులు లింగయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వీరన్న తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
భూదాన్‌పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన బుర్రి కృష్ణారెడ్డి (74) పారామెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న తన పెద్దకుమారుడి వద్దకు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్ సమీపంలో రహదారిపై కిందపడటంతో కృష్ణారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి తలకు శస్త్రచికిత్స చేశారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కృష్ణారెడ్డి మృతిచెందాడు. మృతుడి భార్య చంద్రకళ పదిహేనేళ్ల క్రితం మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వలిగొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రాం స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన సందెల శివయ్య(42) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య ఆదివారం ఆటోలో వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు. రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment