తుంగతుర్తి అభివృద్ధి
రూ. 1,203 కోట్లతో
అన్ని వర్గాలకు అందుబాటులోకి ప్రజా ప్రభుత్వం
● నిత్యం నేను ప్రజల మధ్యనే ఉంటున్నా
● వారి సమస్యల పరిష్కారానికి
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా
● గతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది ●
● బిక్కేరు నుంచి దోసెడు ఇసుక కూడా
పోనీయడం లేదు
● అస్తవ్యస్తంగా ఉన్న నియోజకవర్గాన్ని
గాడిన పెడుతున్న
‘సాక్షి’ ఇంటర్వ్యూలో తుంగతుర్తి
ఎమ్మెల్యే మందుల సామేల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘పదేళ్ల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇక్కడి పుల్ల అక్కడ వేయలే. ఒక్క కొత్త రోడ్డు లేదు. కొత్త బిల్డింగ్ కట్టలేదు. కొత్త కాలువలు తవ్వలేదు. చెక్‌డ్యామ్‌లను ప్రారంభించి కమీషన్లు తీసుకొని మధ్యలోనే వదిలేశారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. నేనొచ్చాక పరిస్థితిలో మార్పు తెచ్చా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి రూ. 1,203 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నా..’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గత పరిస్థితులు, తాము తీసుకొచ్చిన మార్పులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనలో భూ దందా,
ఇసుక మాఫియా
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది. అంతటా భూదందా, ఇసుక మాఫియానే. అభివృద్ధిని పట్టించుకోలేదు. దీంతో నియోజకవర్గం పదేళ్లు వెనక్కిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో మార్పు తెచ్చాం. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నా. అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నా.
నా దగ్గర అంతా సమానమే
నియోజకవర్గ చరిత్రను ప్రజలు తిరగరాశారు. కనీవిని ఎరుగని మెజార్టీ ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటా. అభివృద్ధి మాత్రమే కాదు ప్రతి ఒక్క కార్యకర్త నా పక్కనే కూర్చుని చెప్పేంత స్వేచ్ఛను ఇస్తున్నా. గతంలో ఉన్న నాయకునికి ఎదురుగా వెళ్లే పరిస్థితి లేదు. నేనలా కాదు., అందరు నా పక్కనే కూర్చొని సమస్యలు చెప్పేలా చేశా. నేను ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నా. జాజిరెడ్డిగూడెంలో ఎస్సీల భూములన్నీ డ్రెయినేజీ వల్ల మునిగిపోతుంటే దానిని బాగు చేయించా. తద్వారా 30 ఎకరాల్లో వారు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో బిక్కేరులో ఇసుక లారీలు తాండవం ఆడుతుండేవి. హామీ మేరకు బిక్కేరు నుంచి దోసెడు ఇసుక కూడా పోనీయడం లేదు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చా
రూ. 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ల్‌ను తీసుకొచ్చా. రూ. 10 కోట్లు ఎస్‌డీఎఫ్ నిధులతో అభివృద్ధిపనులు చేపట్టా. కంచనపల్లి వద్ద కేజీబీవీకి ప్రహరీని రూ.77 లక్షలతో చేపట్టా. ఒక్కొక్కటి రూ. 32 లక్షలతో 9 గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేయించా. తుంగతుర్తికి ఐటీఐ మంజూరు చేయించా. తిరుమలగిరి మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు, జూనియర్ కాలేజీని, మోత్కూరుకు కాలేజీ హాస్టల్‌ను మంజూరు చేయించా. మోత్కూరులో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించా. తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రిని బాగు చేయించేందుకు చర్యలు చేపడతా.
సాగునీటిపై ప్రత్యేక దృష్టి
బునాదిగాని కాలువ కోసం రూ. 267 కోట్లు మంజూరు చేయించా. టెండర్ పూర్తయింది. శాలిగౌరారంలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆసిఫ్‌నహర్ కాలువ భూసేకరణకు పరిహారం ఇప్పించా. కాలువలను బాగు చేయించి 10 చెరువులు నింపించా. రైతులకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. నియోజకవర్గ యువత కోసం అడ్డగూడూరు మండలలో 180 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్‌పార్కు పెట్టించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాను. మోత్కూరులో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపడతాను.
అత్యధికంగా రోడ్లు, బ్రిడ్జీలు
నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రూ. 32 లక్షల చొప్పున కేటాయించి 9 మండలాల్లో అభివృద్ధి పనులను చేయిస్తున్నా. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు లింకు రోడ్లు అభివృద్ధి చేస్తున్నా. వారు వదిలేసిన చెక్ డ్యాంలను పూర్తి చేశా. బిక్కేరుపై మోత్కూరు – గుండాల బ్రిడ్జి కొత్తది నిర్మిస్తా. ధర్మారం నుంచి వర్ధమానుకోట మధ్యలో బ్రిడ్జి వేస్తా. నూతనకల్, గుండ్లసింగారం దగ్గర కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టా. రూ. 32 కోట్లతో తిమ్మాపురం, కోమటిపల్లి, కొమ్మాల, కో డూరు, తుంగతుర్తి నుంచి సంగెం ఎల్కపల్లి, చిల్పకుంట్ల, నూతన్‌కల్ వరకు 22 కిలోమీటర్లు డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశా. తుంగతుర్తి నుంచి రావులపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ. 16 కోట్లతో డబుల్‌రోడ్డు చేయించా. శాలిగౌరారం నుంచి రామగిరి వరకు రూ. 3.5 కోట్లతో రోడ్డు వేయించా. వల్లాల నుంచి జోలవారిగూడేనికి రోడ్డు మంజూరు చేయించా. గురజాల నుంచి చౌళ్లరామారం వరకు రూ. 25 కోట్లలో డబుల్‌రోడ్డు చేయించేందుకు చర్యలు చేపట్టా. మొత్తంగా నియోజకవర్గానికి రూ. 1203 కోట్ల పనులు తీసుకువచ్చా.
Comments
Please login to add a commentAdd a comment