పెద్దగుట్టపైనే
వైద్య కళాశాల..
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణాలకు అధికారులు స్థలం ఖరారు చేశారు. ప్రస్తుతం భువనగిరి పాత కలెక్టరేట్ అద్దెభవనంలో మెడికల్ కశాశాల నిర్వహిస్తుండగా పక్కా భవనాల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.183 కోట్లు మంజూరు చేసింది. అయితే స్థలం ఎంపికలో జాప్యంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. తాజాగా పెద్దగుట్ట సమీపంలో కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణానికి 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
ముందుగా సైదాపురం వద్ద..
ముందుగా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఆస్పత్రి నిర్మాణానికిగాను అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 2023లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల కూడా మంజూరు కాగా, ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు కలిపి 20ఎకరాల స్థలం అవసరం ఉందని అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం శివారులో వైటీడీఏ స్థలంలో 20 ఎకరాల స్థలం గుర్తించారు. భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం 2023, సెప్టెంబర్ 16న రూ.183 కోట్లు మంజూరు చేసింది. అయితే ఇక్కడ స్థలం సేకరించే విషయంలో కొందరు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈలోపు ప్రభుత్వం మారింది. ఇటీవల దాతరుపల్లి శివారులో గతంలో ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదించిన స్థలంలో కూడా మెడికల్ కళాశాల, ఆస్పత్రిభవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. పలు కారణాలతో టెంపుల్ సిటీకి ప్రతిపాదించిన పెద్దగుట్ట వద్ద స్థలం గుర్తించారు. దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లు 144, 145, 146, 147, 151, 152, 157, 158లోని 20ఎకరాల స్థలంలో ఈ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం
మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తాం. స్థలం ఎంపిక ఖరారైంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్
ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణానికి స్థలం ఎంపిక
పెద్దగుట్ట వెనుకభాగంలో
20 ఎకరాల స్థలం గుర్తింపు
ఇప్పటికే రూ.180 కోట్లు
మంజూరు
త్వరలో టెండర్ల ప్రక్రియ
ప్రారంభించే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment