
ముగిసిన ఎస్‌ఏ–2 పరీక్షలు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఎస్‌ఏ–2 వార్షిక పరీక్షలు గురువారం ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 715 పాఠశాలల్లోని 35వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి, 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. అందజేయనున్నారు.
తాగునీటి సమస్య రావొద్దు
యాదగిరిగుట్ట రూరల్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జెడ్పీ సీఈఓ శోభారాణి ఆదేశించారు. యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తాగునీటి సరఫరాపై సమీక్షించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లోన్లు ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్‌కుమార్, ఏపీఎం సుధాకర్, ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తరింపజేయాలి
నల్లగొండ టౌన్: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవిప్రసాద్, మురళికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఆర్చరీ
స్పోర్ట్స్ మీట్‌కు ఎంపిక
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన కర్నాటి అక్షిత జాతీయ అర్చరీ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై ంది. హైదరాబాద్‌లో ఈనెల 15నుంచి 17వ తేదీ వరకు జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్–2025 ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో 70, 60, 50, 30 మీటర్ల విభాగాల్లో అక్షిత విజేతగా నిలవడంతో నేషనల్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపిక చేశారు. అక్షిత హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ కేంద్రీయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. గత ఏడాది కూడా జాతీయస్థాయిలో మెడల్ సాధించింది. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించడం తన లక్ష్యమన్నారు. జాతీయ స్థాయి పోటీల కోసం తన తండ్రి అప్పు చేసి 20 రోజుల పాటు శిక్షణ ఇప్పించారని, ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు.

ముగిసిన ఎస్‌ఏ–2 పరీక్షలు