ఆర్.కృష్ణయ్యకు అధికారమే పరమావధి
ప్రొద్దుటూరు కల్చరల్ : బీసీ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆర్.కృష్ణయ్యకు అధికారమే పరమావధిగా మారిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రమేష్ యాదవ్ విమర్శించారు. ఈమేరకు ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ నాయకుడిగా ఉన్న ఆర్.కృష్ణయ్యను చేరదీసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారన్నారు. పక్క రాష్ట్రం వాడైనా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయక రాజ్యసభలో బీసీ వాణిని బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో రాజ్యసభ సభ్యునిగా నియమించారన్నారు. ఆయన రాజ్యసభలో బీసీల గురించి మాట్లాడింది ఒకటి రెండు సందర్భాలే అని, బీసీల సమస్యలపై ఏనాడూ గొంతెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిందిలేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓటమి చెందగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సొంత పార్టీ పెడతానన్న ఆయన పార్టీని పక్కన పెట్టి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడం ఆయన అధికార దాహానికి నిదర్శనమన్నారు. కృష్ణయ్య అధికారం ఉన్న పార్టీల్లో ఉంటూ తన పబ్బం గడుపుకుంటున్నారే తప్ప బీసీల కోసం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment