కూటమి ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలం
కమలాపురం : రైతులకు సంబంధించిన ఒక్క సమస్య పరిష్కరించని కూటమి ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, మాయ మాటలతో ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. 7 నెలల పాలనలో ఎన్నికల్లో ప్రకటించిన ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఖరీఫ్ సీజన్ పోయి రబీ సీజన్ కూడా సగం అయిపోయిందని, ఇంత వరకు రైతులకు ‘అన్నదాతా సుఖీభవ’ పథకం అమలు చేయలేదని మండి పడ్డారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టపరిహారాన్ని అదే సీజన్ చివరిలో ఇచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకు రుణాలు పొందాలన్నా, వారి భూముల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా, అడంగల్, 1బీ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బీమా చెల్లించడానికి ఆన్‌లైన్‌లో సర్వే నెంబర్లు చూపించక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతుల ఒక్క సమస్య కూడా పరిష్కరించని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఆన్‌లైన్ పని చేయక మైనింగ్ అనుమతులు కూడా ఆఫ్‌లైన్‌లోనే ఇస్తున్నారని, కాంట్రాక్టర్లు అనధికారికంగా డబ్బులు వసూలు చేసుకుని పర్మిట్లు ఇచ్చే దారుణ పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందన్నారు. మా ప్రభుత్వం రైతులకు సాగు ఖర్చులకు బాసటగా నిలిచి రైతు భరోసా ఇచ్చేదని, ఈ ప్రభు త్వం రెండు సీజన్లు వచ్చినా ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. రంగు మారిన ధాన్యాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వరికి రూ.1740 మద్దతు ధర ప్రకటించిందేగాని ఒక్క గింజ కూడా కొనలేదన్నారు. ఆర్‌బీకేలకే రైతులను పిలిపించి మిల్లర్లతోనే రూ.1300 లతో ధాన్యం కొనుగోలు చేయిస్తోందని మండి పడ్డారు. రైతులు చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో లబోదిబో మంటున్నారని, ఈ చేతకాని ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
13న భారీ ర్యాలీ:
రైతులు పండించిన పంటను మద్దతు ధర చెల్లించి దిగుబడులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు రైతు సమస్యల గురించి వినతి పత్రం ఇస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, షేక్ ఇస్మాయిల్, చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, శరత్‌బాబు, మోనార్క్, జిలానీ బాషా, సురేష్, విశ్వం తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర చెల్లించి
ఒక్క గింజ కొనని ప్రభుత్వం
13న ఛలో కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్రనాథ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment