భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ప్రొద్దుటూరు/కమలాపురం : భూ సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె పంచాయతీలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అర్జీలలో పరిష్కరించదగినవి వెంటనే పరిష్కరిస్తామని, మిగతా వాటిని 45 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తామని.. నూత న టెక్స్‌టైల్స్ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. మైలవరంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలపై ఐదు శాతం మేర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోతున్నామన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాల కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ యువత ఉపాధి కల్పనకు 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నామన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సర్పంచ్ అరవ మునివర ఈశ్వరమ్మ, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, సీఎం సురేష్ నాయు డు, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమలాపురంలో...
కమలాపురం మండలం చిన్నచెప్పలి గ్రామ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో మంత్రి సవిత పాల్గొన్నారు. అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను ఆమె పరిశీలించారు. కలెక్టర్ చెరకూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకే ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారన్నారు. మండల స్పెషలాఫీసర్ సుబ్బారెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు, ల్యాండ్స్ సర్వే ఏడీ మురళీకృష్ణ, తహసీల్దార్ శివరామిరెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత
Comments
Please login to add a commentAdd a comment