అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగా కలెక్టరేట్ సభా భవనంలో గ్రీవెన్స్ సెల్ జరిగింది. కలెక్టరేట్ సిబ్బంది సభా భవన ఆవరణలో అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇక్కడ ఇరుగ్గా ఉండడం, రద్దీ కూడా అధికంగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అర్జీదారులను క్యూలైన్‌లో ఉంచేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇంతకుమునుపు విశాలమైన రేకుల షెడ్డులో అర్జీలు నమోదు చేసేవారు కనుక అక్కడ అందరికీ సౌకర్యవంతంగా ఉండేది. వచ్చే గ్రీవెన్స్ సెల్ నుంచైనా రేకుల షెడ్డులో అర్జీలు నమోదు చేసి సభా భవనంలోకి పంపితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని అర్జీదారులు అభిప్రాయపడ్డారు. అర్జీలు నమోదు చేసుకున్న వారిని సభా భవనంలో కూర్చోబెట్టారు. క్రమపద్ధతిలో వారిని పిలిచి కలెక్టర్ అర్జీలను స్వీకరించి పరిశీలించారు. భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల సమస్యలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వ్యవసాయశాఖ జేడీ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ శ్రీనివాసులు, వెంకటపతి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment