కడప అర్బన్ : నగర శివారులోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎంజే కళాశాల సమీపంలో మంగళవారం ఉదయం రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. నంద్యాల నుంచి కోడూరుకు లోడుతో వెళ్తున్న లారీ, రాజంపేట వైపు నుంచి కడప వైపు వస్తున్న లారీని రోడ్డుపై ఉన్న గుంత తప్పించబోయి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. రెండువైపులా రాకపోకలు స్తంభించాయి. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న కడప రిమ్స్ సీఐ సీతారాం రెడ్డి, జయరాముడు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీలను పక్కకు తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
తీగలు చోరీ
ముద్దనూరు : మండలంలోని కమ్మవారిపల్లె గ్రామంలో వ్యవసాయ పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని తీగలను ఎత్తుకెళ్లారు. గ్రామంలోని వీరమ్మ అనే మహిళ పొలంలో సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ చోరీ జరిగింది. ప్రస్తుతం పొలంలో వరి, ఉల్లి పంటలు సాగులో ఉన్నాయి. తన పంటలు ఎండిపోకుండా అధికారులు స్పందించి తనకు త్వరగా ట్రాన్స్‌ఫార్మర్ అందించాలని ఆమె కోరుతున్నారు.
కుందూనదిలో పడి
యువకుడి మృతి
చాపాడు : మండల కేంద్రమైన చాపాడుకు చెందిన పూజారి సురేష్ బాబు(32)అనే యువకుడు గ్రామ సమీపంలో కుందూనదిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూజారి సురేష్‌బాబు సోమవారం సాయంత్రం కాలకృత్యాల కోసం గ్రామ సమీపంలోని కుందూనది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడి గల్లంతయ్యాడు. అక్కడున్న కొందరు వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో సురేష్‌బాబు ఆచూకీ కోసం కుటుంబీకులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి అన్న లక్షుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితం
సాక్షిప్రతినిధి, కడప : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితం కావడంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం ఓల్డ్ క్యాంపస్‌లో జరిగిన ఈ ఘటనలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించినట్లు సమాచారం. కాగా నాలుగు రోజుల నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కూడా ఓల్డ్ క్యాంపస్‌లో ఆహారం, నీళ్లు పరీక్షించానన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం ఏమీ లేదని పేర్కొన్నారు. కాగా ఆసుపత్రి వైద్యుడు జిలాన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇలాంటి సమస్యతో విద్యార్థులు వస్తుంటారని, బయట తిన్న ఆహారం కారణంగా ఇలాంటి సమస్య వచ్చి ఉండవచ్చన్నారు. రోజూ కొన్ని వేల మంది తినే ఆహారం కలుషితమైతే ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment