‘కల్తీ నియంత్రణ’ గాలిలో దీపం.!
ఒక మనిషి జీవించడానికి ప్రధానంగా కూడు, గూడు, గుడ్డ అవసరం. ఈ మూడింటిలో మనం తినే ఆహారానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో చెప్పకనే చెబుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అతి కీలకమైన ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’ సమస్యలతో సతమతమవుతోంది.
కడప రూరల్ : మనం తీసుకొనే ఆహారానికి సంబంధించిన అంశాలన్నీ ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’ పరిధిలోకి వస్తాయి. అంటే మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈ శాఖ పాత్ర ఎంతో కీలకమైంది. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది.
సంస్థ లక్ష్యం ఇదీ..
మనం తినే ప్రతి ఆహారాన్ని పర్యవేక్షించే బాధ్యతలు ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. అంటే హోటళ్లు, బేకరీలు, పండ్ల వ్యాపారాలు, గోధుమ, పసుపు, నూనెలు తదితర ఆహార పదార్థాల విక్రయ, తయారీ కేంద్రాలను, కల్తీలను ఆ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్‌లు ఉన్నాయి. కడప డివిజన్–1లో కడప కార్పొరేషన్‌తో పాటు బద్వేల్, మైదుకూరు. ప్రొద్దుటూరు డివిజన్–2 పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కూడా వివిధ పదార్థాలు.. వస్తువుల నుంచి ఒక నెలకు ఆహార పదార్థాలకు సంబంధించి 12 శ్యాంపిల్స్ తీయాలి. అంటే ఒక శ్యాంపిల్‌తో పాటే అదనంగా రెండు శ్యాంపిల్స్ తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్‌ను తీస్తారు. ఒక్కో శ్యాంపిల్ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్ నాచారంలో గల ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కల్తీకి పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యకికి భారీగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా ఉంటుంది. అలాగే ఈ శాఖకు ప్రభుత్వ రంగ సంస్థలైన హాస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార సంబంధిత పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది.
సిబ్బందికి వాహనాల కొరత..
ఆహార నియంత్రణలో కొన్నేళ్ల నుంచి కీలకమైన జిల్లా ఆహార సహాయ భద్రతా అధికారి పోస్ట్ ఇన్‌చార్జిల పాలనలోనే నడుస్తోంది. అలాగే కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్, అటెండర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యమైన అసిస్టెంట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పాత్ర ఎంతో కీలకం. కడప డివిజన్–1, ప్రొద్దుటూరు డివిజన్–2కు ఒకరి చొప్పున ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు వాహనాలు లేకపోవడం దారుణం. ఆఖరికి ఆ శాఖ జిల్లా సహాయ అధికారికి కూడా వాహనం లేకపోవడం శోచనీయం. ఈ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నా..ఎవరైనా ఫిర్యాదు చేసినా బస్సులు లేదా తమ ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలి. కీలమైన మారుమూల ప్రాంతాల్లోకి ఉన్నఫళంగా వెళ్లాలన్నా, రోజు వారీ పనులను నిర్వహించాలన్నా, ఈ సంస్థ అధికారులకు పెద్ద పరీక్షలా మారింది. అలాగే ఈ కార్యాలయం కడప పాత రిమ్స్‌లోని పాడుబడిన భవనంలో కొనసాగుతోంది.
జిల్లాలో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌లు..?
జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలను, వస్తువులను తయారు చేసే కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. కాగా జిల్లా ఔషధ నియంత్రణ శాఖ పరిధిలోనే జిల్లా వ్యాప్తంగా అధికారికంగా లైసెన్స్ కలిగిన 1,800 మెడికల్ షాపులు ఉన్నాయి. అంతకంటే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఆహారానికి సంబంధించిన లైసెన్స్ కలిగిన సంస్థలు ఉండడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ.!
ఆహార పదార్థాలు కలుషితం అయితే మనిషి ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో అందరికీ తెలిసిందే. వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఆయన నుంచి ఎదురయ్యే ప్రశ్న ఒకటే.. ‘ఎక్కడ తిన్నారు..ఏం తిన్నారు’. అంటే మనం తీసుకొనే ఆహారంలో ఏమైనా నాణ్యతా లోపం ఉంటే ఆ ప్రభావం ఎంతలా ఉంటుందో దీన్ని బట్టే తెలుస్తోంది. అదేవిధంగా కలుషిత ఆహారం తీసుకొని పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలు ఎన్నో చూశాం. ఆహార నియంత్రణలో పర్యవేక్షణ కొరవడిందనేందుకు ఇలాంటి సంఘటనలే నిదర్శనం.
అన్నింటికీ కొరతే
భారంగా మారిన పర్యవేక్షణ
ఇదీ కీలకమైన ‘జిల్లా సహాయ
ఆహార నియంత్రణ శాఖ’ దీన స్థితి
అన్ని చర్యలు చేపడుతున్నాం
ప్రజా ఆరోగ్య పర్యవేక్షణలో చురుకై న పాత్రను పోషిస్తున్నాం. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం. కల్తీలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఆహార నియంత్రణపై ప్రజలు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తున్నాం. నాణ్యతా లోపానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే మాకు ఫిర్యాదు చేయవచ్చు.
– జి.ప్రభాకర్, జిల్లా ఆహార సహాయ భద్రతా అధికారి
Comments
Please login to add a commentAdd a comment