మహిళలపై దారుణాలను అరికట్టాలి
ప్రొద్దుటూరు క్రైం : మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలను అరికట్టాలని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. మానవ హక్కులదినం సందర్భంగా మహిళా సంఘాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మైదుకూరు రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఇటీవల అమ్మాయిలపై వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడన్నారు. మహిళలు హింసకు గురవుతున్నా అందుకు గల కారణాలను సమీక్షించకుండా నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని విమర్శించారు. మహిళలపై హింసకు ప్రేరేపిస్తున్న మద్యం, పోర్న్ వీడియోలు, డ్రగ్స్‌లను నిషేధించకుండా కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ వైస్ ప్రెసిడెంట్ ఉషారాణి, జెవీవీ సమతా మహిళా విభాగం సభ్యురాలు సునీత, రాయలసీమ విద్యార్థి శక్తి హరిత, విరసం వరలక్ష్మి, పద్మ, రాయలసీమ మహిళా శక్తి ప్రతినిధి లక్ష్మీదేవి, ఎంపీజే సభ్యుడు సలీం, జమాతే ఇస్లామీ హింద్ సభ్యుడు షఫీవుల్లా, మహిళా విభాగం సభ్యురాలు రెహనా పాల్గొన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన యువతిని
కాపాడిన పోలీసులు
ఒంటిమిట్ట : స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన యువతిని పోలీసులు రక్షించారు. సుండుపల్లె మండలం సాకినేనిబండకు చెందిన ఓ యువతి మంగళవారం సాయంత్రం రైలు పట్టాలపై అనుమానస్పదంగా ఉండటంతో స్థానికులు ఎస్‌ఐ శివప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై ఉన్నట్లు తెలుసుకుని తన సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించారు. యువతి ప్రేమ వ్యవహారంలో మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాను కడపలో ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ చదువుతున్నట్లు చెప్పడంతో తమ సిబ్బందిని కాలేజీకి పంపామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment