లండన్ పత్రికల్లో బ్రౌన్‌పై వార్తలు
కడప కల్చరల్ : తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్ధంతిని గురువారం నిర్వహించుకోనున్న నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికరమైన చిన్న విశేషం వెలుగులోకి వచ్చింది. ఆయన మరణం అంశాన్ని ఆనాటి లండన్ పత్రికల్లో ప్రచురించారని జిల్లాకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేపర్ క్లిప్పింగ్‌తో సహా తెలిపారు. మన దేశం నుంచి సీపీ బ్రౌన్ తిరిగి లండన్‌కు వెళ్లాక అక్కడ తెలుగుభాష అధ్యాపకులుగా సేవలు అందించారు. అలాంటి మహనీయుడు మరణించిన సమయంలో అక్కడి పత్రికలు ఈ వార్తను ఎలా ప్రచురించాయో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న యువకుడు తవ్వా విజయభాస్కర్‌రెడ్డి అప్పటి వార్త క్లిప్పింగ్‌ను సేకరించారు. కొన్నాళ్లపాటు ఆయన చైన్నెలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు. స్థానిక చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి అన్న కుమారుడు అయిన ఆయన స్వతహాగా బ్రౌన్ గురించిన అంశాలపై ఆసక్తి చూపేవారు. బ్రౌన్ గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు లండన్‌లోని బ్రిటీషు లైబ్రరీలో 1884 డిసెంబరు పత్రికలను పరిశీలించారు. అందులోని ఓ పత్రికలో సీపీ బ్రౌన్ మరణవార్తలు వెలుగు చూశాయి. 1798 నవంబరు 10న జన్మించిన బ్రౌన్ మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కడపలో తెలుగుభాష, సాహిత్యాల వికాసానికి ఎంతో కృషి చేశారు. 1854లో తిరిగి లండన్ వెళ్లిన ఆయన అక్కడి యూనివర్సిటీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. 1884 డిసెంబరు 12న ఆయన తన 86వ యేట లండన్‌లోని కిల్డేర్ గార్డెన్స్ ప్రాంతంలోని తన నివాస గృహంలో కన్నుమూశారు. నాలుగు రోజుల అనంతరం (డిసెంబరు 16, 1884) ఆయన మరణ వార్తను లండన్‌కు చెందిన ది టైమ్స్ వారపత్రిక ప్రచురించింది. అదే పత్రిక డిసెంబరు 27న బ్రౌన్‌కు నివాళిగా వివరణాత్మకంగా చిన్న వ్యాసాన్ని ప్రచురించింది. ఇలస్ట్రేటెడ్ పోలీసు న్యూస్ వారపత్రిక 1885 జనవరి 3న బ్రౌన్ మరణ వార్తను సంక్షిప్తంగా ప్రచురించింది. గురువారం బ్రౌన్ వర్ధంతిని నిర్వహించుకోనున్న తరుణంలో ఈ అంశం వెలుగు చూడడంతో ఈ అంశం సంతోషాన్ని కలగజేస్తోంది.
వెలుగులోకి తెచ్చిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment