ఆగని టీడీపీ వర్గీయుల ఆగడాలు
కడప టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో టీడీపీ వర్గీయుల ఆగడాలు పెచ్చుమీరి పోతున్నాయి. తమకు ఎవరైనా సహకరించకపోతే దౌర్జన్యాలకు దిగుతూ చంపుతామని బెదిరిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు భయపడి చక్రాయపేట మండలం కుప్పం గ్రామం చిన్నమోరయ్యగారిపల్లెకు చెందిన మాచిరెడ్డి పార్వతమ్మ అనే మహిళా రైతు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం గ్రామ పొలంలోని సర్వే నంబరు 786లో 3.5 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొందరు టీడీపీ వర్గీయులు తమ పొలాలకు దగ్గరగా ఉంటుందని భావించి దౌర్జన్యంగా పార్వతమ్మ పొలంలో రోడ్డు వేసేందుకు మట్టి తోలారు. దీంతో పార్వతమ్మ కుటుంబీకులు ఆ మట్టిని తొలగించి దున్నేశారు. అనంతరం చక్రాయపేట పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ రికార్డులు పరిశీలించి పార్వతమ్మ పొలంలో రస్తా ఉందా లేదా అన్న విషయం తేల్చాలని సర్వేయర్‌ను ఆదేశించారు. దీంతో సర్వేయర్ రికార్డులను పరిశీలించి ఆ భూమిలో ఎలాంటి రస్తా లేదని నివేదికను తహసీల్దారుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న సమర్పించారు. దీని ఆధారంగా తహసీల్దారు కూడా పార్వతమ్మ పొలంలో ఎలాంటి రస్తా లేదని పోలీసులకు మార్చి 18న లేఖ ద్వారా తెలిపారు. దీంతో పోలీసులు టీడీపీ వారు వేసిన దారిని మూసి వేయాలని సూచించారు. అనంతరం మిన్నకుండి పోయిన టీడీపీ వర్గీయులు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ దారి కోసం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈనెల 7న పొలం చుట్టూ వేసిన కంచెను తొలగించి మామిడి మొక్కలను తుంచేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా అడ్డు వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు.
వారితోనే మా ప్రాణాలకు ముప్పు
తమ గ్రామానికి చెందిన గొల్లపల్లె లోకేశ్వరరెడ్డి, ఎర్రనాగు రామాంజనేయరెడ్డి, కొప్పల పాపిరెడ్డి, ఎర్రనాగు రామలక్షుమ్మ, కోటం మల్లమ్మ, ఎర్రనాగు రామలక్షుమ్మలు కలిసి బసం రామచంద్రారెడ్డి, దుగ్గిరెడ్డి చిన్నసిద్దారెడ్డి, మూలి గంగిరెడ్డి, కొత్త కాంచాని శివారెడ్డిల ప్రోద్బలంతోనే తమ పొలాల్లో మామిడి మొక్కలను పీకేసి దౌర్జన్యం చేస్తున్నారని పార్వతమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఊర్లోకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని వీరి వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకొని తమను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పట్టా భూమిలో నుంచి దారి ఇవ్వలేదని మామిడి మొక్కల పెరికివేత
ముళ్ల కంచెకు వేసిన రాతి స్తంభాలనూ తొలగించారు
ఆపై చంపుతామని బెదిరింపులు
ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి మహిళా రైతు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment