ప్రజలను దగా చేసేందుకే సదస్సులు
కడప కార్పొరేషన్ : ప్రజలను మభ్యపెట్టి దగా చేసేందుకే రెవెన్యూ సదస్సులు, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మీటింగులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నో అబద్ధాలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని అమలు చేయకుండా ఎందుకూ పనికిరాని సదస్సులు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెవెన్యూలో 110 ఏళ్ల తర్వాత భూములను రీ సర్వే చేయించి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర తిరగరాశారన్నారు. వ్యవస్థనంతా ప్రక్షాళన చేసి, రికార్డులను అప్‌డేట్ చేశారన్నారు. బ్రిటీషు కాలంలో కౌలు చెల్లించలేక చాలా మంది ఇది తమ భూమేనని నమోదు చేసుకోలేదని, అలాంటి భూములను చుక్కల భూములుగా గుర్తించారన్నారు. జగన్ ప్రభుత్వం వాటన్నింటినీ రెగ్యులర్ చేసిందన్నారు. దివంగత ఎన్‌టీఆర్ మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత విక్రయించుకునే వెసులుబాటు కల్పించారని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పేదలకు ఇచ్చిన డీకేటీ స్థలాలను విక్రయించే వీలు కల్పించి వారికి మేలు చేశారన్నారు. మీ సేవ కేంద్రంలో అడంగల్ ప్రింట్ తీస్తే చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటోలు వస్తాయని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కూడా ఇలాగే వచ్చాయన్నారు. పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో ముద్రిస్తున్నారని అప్పట్లో టీడీపీ దీనిపై నానా రాద్ధాంతం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లడమే లక్ష్యంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధిపై పులివెందులలోనైనా, కడపలోనైనా చర్చకు వస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత సవాల్ చేయడం హాస్యాస్పదమన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు వచ్చిన సీట్లు వద్దని చెప్పినందుకా... ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించినందుకా.. అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని సవిత మాట్లాడటం సరికాదని, అలా చూస్తే గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండున్నరేళ్లు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, శ్రీరంజన్‌రెడ్డి, అక్బర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment