సాగునీటి సంఘాల ఎన్నికల సందడి
●ఏకగ్రీవం కాని చోట రహస్య ఓటింగ్
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల సందడి మొదలైంది. అధికభాగం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రాదేశిక నియోజకవర్గాలు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించే వేదికను తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నోటీసులు అందించడంతోపాటు గ్రామాల్లో దండోరా వేస్తారు. ఈనెల 14న ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికై న వారితో అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించి సాగునీటి వినియోగదారుల సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికల తేదీ, సమయం, వేదిక గురించిన సమాచారాన్ని అదే రోజు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులకు నోటీసుల ద్వారా అందజేస్తారు. ఈ నెల 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలకు సంబంధించిన అసాధారణ సర్వసభ్య సమావేశాలను నిర్వహించి చైర్మన్లను ఎన్నుకుంటారు.
మొత్తం 205 సంఘాలు
జిల్లాలో 205 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉండగా, వాటి పరిధిలో 11 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, మూడు ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వీటి కింద 2,74,872 ఎకరాల ఆయకట్టు ఉండగా, 1,59,552 మంది ఓటర్లు ఉన్నారు. చిన్నతరహా నీటి పారుదల కింద 25 మండలాల్లో 112 సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిలో 30076 ఎకరాల ఆయకట్టు ఉంది. మధ్య తరహా నీటిపారుదలలో పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో అప్పర్ సగిలేరు ప్రాజెక్టు కింద ఐదు నీటి సంఘాలు, ఒక ప్రాజెక్టు కమిటీ పరిధిలో 12,869 ఎకరాల ఆయకట్టు ఉంది. బద్వేలు, బి.కోడూరు, బ్రహ్మంగారిమఠం మండలాల్లో లోయల్ సగిలేరు ప్రాజెక్టు కింద ఆరు నీటి సంఘాలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉండగా 6034 ఎకరాల ఆయకట్టు ఉంది. చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు కింద 5 నీటి సంఘాలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉండగా 6455 ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ నీటి పారుదల కింద కేసీ కెనాల్ పరిధిలోని 9 మండలాల్లో 32 సాగునీటి సంఘాలు, ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో 96,137 ఎకరాల ఆయకట్టు ఉంది. మైలవరం రిజర్వాయర్ కెనాల్ కింద ఏడు మండలాల్లో 28 నీటి సంఘాలు, మూడు డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో 69,772 ఎకరాల ఆయకట్టు ఉంది. పులివెందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని ఆరు మండలాల్లో 16 నీటి సంఘాలు, మూడు డిస్ట్రిబ్యూటరీ కమిటీల కింద 49,839 ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కింద పెద్దముడియం మండలంలో ఒక నీటి సంఘం ఉండగా, దాని పరిధిలో 3690 ఎకరాల ఆయకట్టు ఉంది.
సాగునీటి
ఎన్నికలు
నేడు నోటిఫికేషన్ జారీ
14న అధ్యక్ష,
ఉపాధ్యక్షుల ఎన్నిక
17న డిస్ట్రిబ్యూటరీ
కమిటీలకు ఎన్నిక
సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. ఇందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. కనుక చేతులెత్తే విధానం కాకుండా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ బెల్లన జగన్నాథం, చిరుమామిళ్ల శ్రీనివాసరావు హైకోర్టులో ఇటీవల రిట్ పిటీషన్లు దాఖలు చేశారు. 2020 నాటి లక్ష్మిసింగ్, ఇతరులు వర్సెస్ రేఖాసింగ్ ఇతరులు కేసులో రహస్య ఓటింగ్ అనేది రాజ్యాంగ పరమైన ప్రజాస్వామ్యంలో కీలకమైనదంటూ అపెక్స్ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయాన్ని కూడా పిటీషనర్లు పేర్కొన్నారు. ఈ పిటీషన్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్, రవి చీమలపాటి న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లింది. ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తహసీల్దార్లు, నీటిపారుదల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏకాభిప్రాయం కుదరని చోట విధిగా రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment