విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ట్యాంకర్ ద్వారా నీటి తడులు అందిస్తున్న రైతులు
ఆర్నెళ్లుగా అందని విద్యుత్ కనెక్షన్లు
డిపాజిట్ చెల్లించి ఎదురుచూస్తున్న రైతన్నలు
2083 మంది దరఖాస్తుదారులకు లభించని ఊరట
కొత్త దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్రాన్స్‌కో యంత్రాంగం
చిత్తూరు జిల్లాకు తరలివెళ్లిన ఎలక్ట్రికల్ సామగ్రి
సాక్షి ప్రతినిధి, కడప : ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతోంది. ఆయకట్టుతోపాటు, నాన్‌ఆయకట్టులో వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అప్రమత్తంగా ఉండాల్సిన ఎస్పీడీసీఎల్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అత్యవసరమైనా అంతే..
వర్షా కాలం సీజన్‌లో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవడంతో రైతులు బోరు బావుల ఆధారంగా విద్యుత్ మోటార్లతో వ్యవసాయం చేయాలని నూతన కనెక్షన్ల కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తులకు మోక్షం కలగకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గడిచిన ఆర్నెళ్లుగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడం లేదు. 2083 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కడప డివిజన్‌లో 173 దరఖాస్తులు, ప్రొద్దుటూరు 636, పులివెందుల 490, మైదుకూరు 794, జిల్లా మొత్తం 2,083 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా విద్యుత్ కనెక్షన్ ఎవరికై నా అత్యవసరమైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రిజక్టు లిస్టులో పడిపోతుండడం గమనార్హం.
జిల్లాలోని సామగ్రి తరలింపుతోనే..
జిల్లాలోని సబ్‌డివిజన్‌లలో ఆపరేషన్ డీఈల పరిధిలో ఉన్న ఎలక్ట్రికల్ సామగ్రి చిత్తూరు జిల్లాకు తరలించడంతోనే ఈ దుర్భర పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలో ఉన్న స్టాకు చిత్తూరు జిల్లాకు తరలించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు తరలించినట్లు సమాచారం. సింగిల్ ఫోల్ కావాలన్నా.. ఇవ్వలేని దుస్థితిలో ఉండిపోయారు. కాసారాలు కావాలన్నా రైతులు ప్రైవేటుగా తెచ్చుకొని బిగించుకోవడం మినహా గత్యంతరం లేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయమై ట్రాన్సుకో విభాగానికి చెందిన ఓ అధికారి సైతం జిల్లాలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పడూ చూడలేదని వాపోవడం గమనార్హం.
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు నరసయ్య. బి.కోడూరు మండలం మేకలవారిపల్లె గ్రామం. వ్యవసాయ కనెక్షన్ కోసం ఆరు నెలల క్రితం రూ.12,500 డీడీ తీసి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ స్తంభాలు, వైర్, ట్రాన్స్‌ఫార్మర్ ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. అవకాశం ఉన్నా పంట సాగు చేసుకునేందుకు వీలు లేక.. గొర్రెలను మేపుకొంటున్నాడు. అధికారులు అదిగో, ఇదిగో అంటూ కాలం సాగదీస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారక వచ్చిందని, ఇక ఇప్పట్లో కనెక్షన్ ఇవ్వరనే భావనకు వచ్చానని ఆయన వాపోతున్నారు.
ఇక్కడ కన్పిస్తున్న మహిళా రైతు పేరు గుదే సరస్వతి. చాపాడు మండలం టీఓపల్లె పంచాయతీ రేపల్లే గ్రామానికి చెందిన ఈ మహిళ రైతుకు 4 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో వ్యవసాయ సాగునీటి కోసం గతేడాది బోరు వేసుకుంది. ఫిబ్రవరిలో ట్రాన్స్‌ఫార్మర్ కోసం విద్యుత్ శాఖాధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో స్పందనలో ఫిర్యాదు చేయగా ట్రాన్స్‌ఫార్మర్ తమకు మంజూరు అయినట్లు అధికారులు చెప్పారు. మూడు నెలల నుంచి తమ పేరుతో సర్వీసు ఇచ్చినట్లు నెంబరు కూడా వచ్చింది. గత ఐదు నెలల నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం కరెంటు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తనతోపాటు తమ ఊరిలో ఐదుగురికి ట్రాన్స్‌ఫార్మర్లు రావాల్సి ఉందని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బాధిత మహిళ వాపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment