తహసీల్దార్ సస్పెన్షన్
కడప సెవెన్‌రోడ్స్ : విధుల్లో చేరకుండా ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహసీల్దార్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా తహసీల్దార్ యు.దస్తగిరయ్యను తిరుపతి జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్‌ఆర్‌సీ తహసీల్దార్‌గా ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నిర్ణీత గడువులోగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి వుండగా నిర్లక్ష్యం చేయడంతో కలెక్టర్ మెమో ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతో తహసీల్దార్ యు.దస్తగిరయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
వర్గీకరణపై
వినతులకు అవకాశం
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఏవైనా అభిప్రాయాలు, వినతులు ఉంటే కమిషన్‌కు తెలిపే అవకాశం ఉందని డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యాలయం విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజాపురం, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో ఉందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి వినతులు ఉంటే రాత పూర్వకంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30లోపు తెలపవచ్చని సూచించారు. ఈ అవకాశం జనవరి 9వ తేదీ వరకు ఉంటుందని వివరించారు.
తాగునీటి ఎద్దడి
తలెత్తకుండా చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు. వేసవి నాటికి చెరువులు, కుంటలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపాలని అన్నారు. మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు యుద్ధ ప్రాతికపదిన చేయాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి పనులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఏవైనా చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రాంతాల వారీగా సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసులు, ఎస్‌ఈ వెంకటరామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, డీఈ చెన్నకేశవరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రమణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment