సేద్య పరికరాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
వైవీయూ : జిల్లాలో బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ సూక్ష్మనీటి సాగుపథకం (ఏపీఎంఐపీ) ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఏపీఎంఐపీ కార్యాలయంలో కంపెనీ డీలర్లు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 29,300 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 21,746 మంది రైతులు 27,768 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం చేసేందుకు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఇప్పటికే 4072 మంది రైతులు 4780 హెక్టార్లలో సేద్యం చేసేందుకు పరిపాలనా ఉత్తర్వులు పొందారన్నారు. గ్రామాలలో బిందు/తుంపర సేద్యపరికరాలు అవసరమున్న రైతులను గుర్తించి వీఏఏఎస్/వీహెచ్‌ఏఎస్/వీఎస్‌ఏఎస్, ఎంఐఏఓల ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేలా డీలర్లు అవగాహన కల్పించాలన్నారు. కంపెనీ ప్రతినిధులు త్వరగా ప్రాథమిక సర్వే పూర్తి చేయాలన్నారు. తమ వాటాను రైతులు నేరుగా పీడీ అకౌంట్‌కి జమ చేయాలని, ఎవరికీ నగదు రూపంలో ఇవ్వకూడదని సూచించారు. రైతువాటా అందిన వెంటనే పరికరాలను అందించాలని పేర్కొన్నారు. కంపెనీ డీలర్లు తమ బాధ్యతగా పరికరాల అమరికను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ ఎస్.మురళీమోహన్‌రెడ్డి, ఎంఐ ఇంజినీర్లు, ఎంఐడీసీ, వివిధ కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment