Opinion
-
స్త్రీ సాధికారతపై ఇంకా గొడ్డలి వేటా?
దేశంలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, స్త్రీ వ్యక్తిత్వం మీద, వారి సాధికారత మీద, వారి జీవన వ్యవస్థల మీద నిరంతర దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురుష ప్రపంచం, పితృస్వామిక పాలక వర్గం స్త్రీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మతోన్మాద భావజాలం, మూఢాచారాల కఠినత్వం భారత దేశంలో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాయి. ఇప్పటికీ స్త్రీకి విద్యా నిరాకరణ జరుగుతోంది. ఇంకా బాల్య వివాహాలతో తల్లిదండ్రులు బాలికల విద్యను హైస్కూల్ స్థాయిలోనే నిలువరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే! స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. స్త్రీ తన సాధికారత కోసం చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి నడవాలి.సొంత తల్లిదండ్రులే బాలుడిని ఒక రకంగా, బాలికను ఒక రకంగా చూసే పరిస్థితులు ఇంకా కొనసాగడం సిగ్గుచేటు. కొన్ని సామాజిక కులాలైతే మూడు దశాబ్దాల పాటు ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడ్డాయి. బాలికలను చదివించకుండా ఎదుగుతున్న మెదళ్లపై ఉక్కుపాదం మోపాయి.అక్షరాస్యతలో నుండి నిజమైన విద్యావంతులు ఆవిర్భ విస్తారు. విద్యావంతుల నుండి మేధావులుగా అభివృద్ధి చెంద డానికి ఎక్కువ అవకాశం ఉంది. స్త్రీలకు తమ శరీరాన్ని గురించిన అవగాహన, ఆరోగ్యం, తినవలసిన ఆహార పదార్థాలు, ఏ పదార్థం ఏ శక్తినిస్తుంది మొదలైన అంశాలు అక్షరాస్యత వల్ల తెలుస్తాయి. చేతివృత్తులు, వ్యాపార రంగాల్లో కూడా స్త్రీ వృద్ధి చెందడానికి అక్షరాస్యత ఉపయుక్తం అయ్యింది.స్త్రీ ఉద్యోగంలోకి ప్రవేశిస్తేనే!స్త్రీల ఆరోగ్యం సమాజ మూఢాచారాల వలన కుంటుబడి మర ణాల రేటు పెరిగింది. అయితే కేరళ, మిజోరం వంటి రాష్ట్రాల్లో స్త్రీలు విద్య, వైద్య రంగాల్లోకి చొరవగా అడుగుపెట్టిన తరువాత ఆ సమా జాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులైన స్త్రీలు సమాజంతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండటంతో వాళ్ళ ఆలోచన వల్ల సామాజిక స్ఫూర్తి, చైతన్యం పెరిగాయి. భర్తల వేధింపుల్ని, మానసిక హింసని మొదటిగా అడ్డుకుంది డాక్టర్లు, టీచర్లుగా ఉద్యో గాల్లో ప్రవేశించిన మహిళలే.అయితే, స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు కుటుంబ సభ్యులు, పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ (సవరణ) చట్టం–2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లలకు ఆస్తిహక్కులు దక్కాయి. విభిన్న మతాలు, సంస్కృతులున్న మన దేశంలో ఈ ఆస్తి హక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండటం వల్ల అటువంటి తేడాలు ఉన్నాయి. హక్కులు ఉన్నప్పటికీ...‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయసూత్రానికి విరుద్ధంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరా ధీనగా బతుకుతోంది. ఈ వివక్షను 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులని తొలగించింది. స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి, సాధికా రతకు సంపూర్ణ ఆస్తిహక్కు కలిగి ఉండాలని గుర్తించి, సవరణలు చేసిన సంస్కరణ చట్టం అని దీన్ని చెప్పవచ్చు. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, కేంద్ర ప్రభుత్వం చేత మొత్తం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన చట్టం.దీని ప్రకారం, మగవారితో సమానంగా ఆడవాళ్లకు పుట్టుకతోనే ‘కోపార్సినరీ’ హక్కు ఉంటుంది. ఏ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటా యని చెప్పింది. అలాగే వ్యవసాయ భూములలో కూడా హక్కులు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు అడపిల్లకి వచ్చాయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణమనీ, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి, లేక అమ్ముకోవడానికి గానీ ఆమెకి పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలో వచ్చిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు ఇవ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్ళకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మట్టుకే హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినరీ’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో (వీలునామా లేని ఎడల) సమాన వాటా పొందే హక్కు పొందింది. ఈ ఆస్తిహక్కు ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుంది. అయితే, ఆర్థికంగా ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారికోసం, వారు వాదించుకునే చట్టాలు తేవడం కోసం ఏ పార్టీ మహిళలకు సముచితమైన సీట్లు ఇవ్వడం లేదు.అందుకే అసెంబ్లీలు, పార్లమెంటు మహిళలు తక్కువగా వుండి వెలవెలబోతున్నాయి. అంతటా నిరాశే...ఇకపోతే ఇటీవల తెలంగాణ గురుకుల పాఠశాలల్లో బాలికల అస్వస్థత చూస్తే, నన్నయ విశ్వవిద్యాలయంలో ఆడపిల్లల అన్నంలో పురుగుల విషయం చూస్తే దేశంలో అన్ని బాలికల హాస్టళ్లలో అశుభ్రమైన, అరుచికరమైన, పౌష్టికాహార రహితమైన వాతావ రణం కనబడుతోందనిపిస్తోంది. పాలక వర్గాల పితృస్వామిక పరి పాలనను విద్యార్థినుల అవస్థలు కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.ఇక బాలికల మీద, యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు. పురుషులు, యువకులు, మద్యం,గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కామ వ్యామోహితులవు తున్నారు. ఉచ్చనీచాలు తెలియకుండా కళ్ళు కనిపించని స్థితిలో వయస్సు భేదము లేకుండా మీదికి ఉరుకుతున్నారు. ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన, ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అనేక ఘటనలు గుండెల్ని పిండుతున్నాయి. స్త్రీకి రక్షణ, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. రాత్రిపూట తాగి ఆ తిక్కతో ఇతర దేశాలకు భర్తలు వెళ్ళి భార్యలు ఒంటరిగా ఉన్న ఇళ్ళ మీద పడి తలుపులు పగులగొట్టి అత్యాచారాలు చేస్తున్నా, వస్తువులు తీసుకెళుతున్నా ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా ఉంటున్నాయి.ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ అధికరణ చెబుతోంది. 14 ఏళ్ల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పా లన్న సూత్రం గతంలో ఈ అధికరణంలో ఉన్నది. అయితే ఆ ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చబడింది. అయితే కేవలం పదాల గారడీ తప్ప పరిస్థితిలో మార్పు లేదు. ఈ అధికరణను రోజూ పాలక వర్గాలు చదువుకోవాలి. ఇక, మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికరణం 47 చెబుతోంది. ప్రజలను ఆరోగ్య వంతులను చేయటం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచటం ప్రభుత్వ బాధ్యత.అయినా పితృస్వామ్య పాలక వర్గం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. తమ అభ్యున్నతి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధి కారం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు కలిసి నడవాలి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఏపీలో విద్యారంగం నీరుగారిపోతోంది!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2 లక్షల 94 వేల 427 కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఇవి ఏమాత్రమూ సరిపోవు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి విద్యారంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.పాఠశాల విద్యకు చంద్రబాబు సర్కారు 2024–25 బడ్జెట్లో రూ. 29 వేల 909 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో ఇది కేవలం 9.84 శాతం మాత్రమే. ఈ కేటాయింపు పాఠశాల విద్యను ఎలా బలోపేతం చేస్తుంది? ‘నాడు–నేడు’ పథకం గురించి బడ్జెట్లో ఊసె త్తలేదు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఆరో తరగతీ, ఆపై చదువు తున్న విద్యార్థులకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసింది. 45 వేల స్మార్ట్ టీవీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పాఠ్య, నోట్ పుస్తకాలు; బ్యాగులు, బూట్లు, యూనిఫారాలు వంటి వాటిని పాఠశాలల ప్రారంభం రోజునే పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వం అందించింది. ‘విద్యా కానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాలకు వేలకోట్లు ఖర్చు చేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌లను జగన్ పటిష్టంగా అమలు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 73 వేల కోట్లు విద్యారంగానికి కేటాయించి ఖర్చు చేశారు. గొల్లప్రోలు జెడ్పీ పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్‌లను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఇవే బాగున్నాయని వ్యాఖ్యనించారు. జగన్ అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు పవన్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి.‘తల్లికి వందనం’ (జగన్ హయాంలో ‘అమ్మఒడి’) పథకానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్లో కేవలం రూ. 5,387.03 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన బాబు వాస్తవంగా 84 లక్షల మంది విద్యార్థులకు రూ. 12 వేల 600 కోట్లు ఇవ్వాలి. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి చంద్రబాబు సర్కారు తల్లుల్ని తీవ్రంగా దగా చేసింది. ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ, ఐబీ బోధనను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కూటమి నేతలు దూరం చేస్తున్నారు.చదవండి: ‘ఏపీ’ కోసం ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది?ఉన్నత విద్యకి బడ్జెట్లో రూ. 2,326.68 కోట్లు కేటాయించారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు గత ఆరు నెలల నుండి రూ. 3,500 కోట్లు రావాలి. ఒక్క పైసా కూడా చంద్ర బాబు సర్కారు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ. 2,542.95 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 75 శాతం. ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులకి రూ. 2,800 కోట్లు అవసరం. హాస్టల్ మెస్ చార్జీలకు రూ. 1,100 కోట్లు అవసరం.ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పోస్టు గత 5 నెలల నుండి ఖాళీగా ఉంది. జగన్ హయాంలో వున్న వైస్ ఛాన్స్లర్లను బలవంతంగా రాజీనామాలు చేయించింది చంద్రబాబు సర్కారు. 18 విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల్ని ఇంకా భర్తీ చేయలేదు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చంద్రబాబు మోసగిస్తున్నారు. విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.– ఎ. రవిచంద్రవైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
విజయాన్ని మించిన పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్‌సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్‌కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది. అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది. కాంగ్రెస్‌ది మహావైఫల్యంఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్‌సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు. హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్‌సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు. సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!పాత చింతకాయ పచ్చడిచంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి. వాస్తవిక బలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.దిద్దుబాటు చర్యలతో...లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది. 7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి. అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం) -
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్‌కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్‌గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్‌గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్‌కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం! అదే సమయంలో అతిథి తనకిష్టమొచ్చింది మాట్లాడేందుకు ఇంటర్వ్యూ చేయరన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీవీ సంభాషణలకైతే ఒక సమయ పరిమితి ఉంటుంది. ఆ సమయంలోనే కావాల్సింది రాబట్టుకోవాలి. అతిథి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నా, విషయాన్ని సాగదీస్తున్నా వారి మాటలను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్డు తగలడం సరైన సమయంలో జరగాలి. అడ్డుకోవడం అవసరమేనన్న భావన వీక్షకులకూ కల్పించాలి.ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను అవతలి వాళ్ల మాటలకు తరచూ అడ్డుపడుతూంటా ననీ, ఇది చాలామంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందనీ చాలామంది నాతో చెబుతుంటారు. నువ్వు తలదూర్చే ముందు నీ అతిథి ఏం చెబు తున్నాడో వినాలని అనుకుంటున్నామన్న వాళ్లూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న. అడ్డుకోవడాన్ని ఎప్పుడు తప్పించవచ్చు? అతిథిని అస్సలు అడ్డుకోరాదా? అతడు మాట్లాడటం ఆపేంతవరకూ ఓపికగా ఎదురు చూడాలా? దీనికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదా?వాస్తవానికి ఇదంతా అవతలి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు బదు లుగా ఏం చెబుతున్నాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే... అతిథి తనకిష్టమొచ్చింది చెప్పేందుకు కాదు ఇంటర్వ్యూ అన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు, జవాబుల ఆధారమైన చర్చ ఇంటర్వ్యూ అంటే! అడిగే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఉండాలి. కాబట్టి... అడిగిన ప్రశ్నతో సంబంధం లేని సమాధానం వచ్చి నప్పుడు అడ్డుకోవడం అన్నది అత్యవసరం. తప్పించలేనిది కూడా! తనేం చెబుతున్నాడో తనకే తెలియని స్థితిలో అతిథి ఉన్నా... లేదా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చెబుతున్నా, కాలయాపన చేస్తున్నా అడ్డుకోవాల్సిందే. ఈ ఇంటర్వ్యూలన్నీ నిర్దిష్ట సమయం లోపల జరగాల్సినవి. కాబట్టి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూంటారు. లేదా మరిన్ని ప్రశ్నలను నివారించేందుకూ ప్రశ్నతో సంబంధం లేని సమాధానాలు చెబుతూంటారు.అలాగే అడ్డుతగలడం అనేది స్పష్టత కోసం గందరగోళాన్ని తొలగించేందుకూ అవసరమే. అంతగా తెలియని సంక్షిప్తనామాలు ఉపయోగిస్తూంటే... మనం అడ్డుకుని వాటి అర్థమేమిటో వివరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా... అతిథి చెప్పాలనుకున్న విషయం మాటల్లో తప్పిపోతే అతడిని మళ్లీ చర్చిస్తున్న అంశానికి తీసుకురావడం కోసం కూడా అడ్డుకోవడం అవసరమవుతుంది. చెప్పే విషయం ఏమిటన్న దానిపై అతిథికి స్పష్టత ఉండవచ్చు కానీ... వీక్షకులకు స్పష్టత లేదని అనిపిస్తే అడ్డుకుని వివరణ తీసు కోవాల్సిందే. విషయం అర్థమైనప్పుడు వీక్షకులకు ఈ అడ్డుకోవడం అన్నది చికాకుగానే ఉంటుంది కానీ అర్థం కాని వాళ్లు కూడా ఉంటా రన్నది మనం గుర్తుంచుకోవాలి. వివరణ తీసుకునేందుకు, స్పష్టత కోసం సమయానుకులంగా అడ్డు తగలాల్సిందే! అయితే, అతిథి వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు అనుకోండి... అప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరముంటుంది. వీక్షకులకు అందే సమాచారం కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత ఇంటర్వ్యూ చేసే వ్యక్తిది. లేదంటే, మర్యాదగానైనా లేదా నిశ్చయంతోనైనా అతిథిని అడ్డుకోవాలి. అతిథి దురుసుగా లేదా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అడ్డుకోవడం అవసరం. ఒక్కో సారి, విచక్షణ మీద ఉద్వేగానిది పైచేయి అయినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అడ్డుకోవాల్సి ఉంటుంది.చివరగా... వాగ్వాదం జోరుగా సాగుతున్నప్పుడూ అడ్డుకోవడం జరుగుతూంటుంది. వివాదాస్పదమైన, శక్తిమంతమైన వాదన జరుగు తున్నప్పుడు ఒకరిపై ఒకరు కేకలు పెట్టుకోవడం సహజం. ఇది సాధారణంగా జరుగుతూంటుంది. అయితే ఇలాంటి స్థితిలో ఏదో అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోరాదు. ఉద్వేగపూరిత వాతావరణంలోనే చర్చలు జరుగు తాయన్నది తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిపై అతిథి సవాళ్లు గట్రా విసురుతూంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిగ్రహంతో ఉండాల్సింది కూడా ఇక్కడే! ఇంటర్వ్యూలు చేసే వారికి ప్రధానంగా మూడు హెచ్చరికలు చేయాలి. మొదటిది–అడ్డుకోవడం దూకు డుగా ఉండకూడదు. సంయమనం కోల్పోరాదు. మన్నించమంటూ అడ్డుకోవడం మేలైన పద్ధతి. మన్నించమనడం వేడిని కొంతవరకూ చల్లారుస్తుంది. రెండోది–అడ్డుకోవడం అన్నది విజయవంతంగా పూర్తి చేయాలి. సగం సగం ప్రయత్నాలు చేయరాదు. మరీ తరచుగా అడ్డుకోకపోవడం మంచి పద్ధతి. అడ్డుకోలేక పోతే దానికి సార్థకతే ఉండదు. పదే పదే అడ్డుకుంటూవుంటే, చికాకు కలగడం సహజం.చివరగా... అతి ముఖ్యమైన అంశం... అడ్డుకోవడం అన్నది సరైన సమయంలో జరగాలి. సమర్థుడైన ప్రెజెంటర్ వీక్షకుల కంటే చాలా ముందుగానే ఎప్పుడు అడ్డుకోవాలో నిర్ణయించుకోగలడు. అయితే అనుకున్న వెంటనే అడ్డుకున్నాడనుకోండి, అది కొంచెం తొందరపాటు అవుతుంది. వీక్షకులు హర్షించరు. చూసేవాళ్లు కూడా అతిథి మాటలింకా కొనసాగితే బాగోదు అనుకునేంత వరకూ వేచి చూసి అప్పుడు అడ్డుకోవాలి. వాస్తవానికి అడ్డు తగలడానికి ఇదే కీలకం. అడ్డుకోవడం అవస రమైందన్న ఫీలింగ్ వీక్షకులకూ కల్పించాలి. ఎందుకంటే... వాళ్లకు ఇంటర్వ్యూ అనేది ఒక ‘ప్రదర్శన’ లాంటిది. అతిథికీ, ఇంటర్వ్యూ చేసేవాళ్లకూ ఇద్దరికీ వీక్షకుల మెప్పు కావాలి. అదే జరగకపోతే ఇంటర్వ్యూకు అర్థమే లేదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్‌లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్‌లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్లు, సోఫాలు, ఆర్ట్ పీస్‌లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్‌ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని. ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు. ‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్‌జీ...’’ అన్నారు.ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే! ‘‘పోనీ ఇమ్రాన్‌జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది! ‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన. విజిటర్స్ రూమ్‌లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్‌కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్‌కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది. నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు! గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.‘‘తనెలా ఉన్నారు సఫ్దర్జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్‌జీ...’’ అన్నారు సఫ్దర్!! -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?
నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇంకా విచారణ ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలుసు. అన్ని ప్రజాస్వామిక దేశాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తయితే, అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా చూపే ప్రభావం మరొక ఎత్తు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుంది. 80 దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే పటిష్టమైన గూఢచార వ్యవస్థ ఉంది. రెండు దేశాల మధ్య ఎక్కడ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా జోక్యం ఉంటుంది. అలాంటి అమెరికాలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సహజం.2025 జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన మంత్రివర్గ కూర్పులో నిమగ్నమయ్యారు. అమెరికాలో మంత్రి అనకుండా సెక్రటరీ అంటారు. ఏ సెక్రటరీ ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడికి పాలనలో తోడుంటారు. అలాంటివారు సమర్థులుగా, మంచి నడవడి కలవారుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఎంపిక చేసుకున్న కొందరిపై సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు.పీట్ హేగ్సేత్: ఫాక్స్ న్యూస్ ఛానల్ హోస్టుగా కనిపిస్తారు. ట్రంప్ విధేయుడు. అమెరికా మిలిటరీలో మధ్య తరగతి అధికారి. ప్రపంచ పోలీసుగా పిలువబడే అమెరికాకు ఎంతో ప్రాధాన్యం ఉన్న రక్షణ శాఖను ఈయనకు ఇస్తున్నారు. ఈయన తన ఒంటిపై ‘దావూస్ ఉల్ట్’(లాటిన్లో ‘దేవుడి ఇచ్ఛ’ అని అర్థం) అని టాటూ వేయించుకున్నారు. మత యుద్ధాల్లో తెల్ల తీవ్రవాది తిరగబడాలనీ, అది దేవుని నిర్ణయమనీ భావన. ఈయన లైంగిక దాడి కేసును ఎదుర్కొన్నారు. ట్రంప్ ‘కాపిటల్ దాడి’ని సమర్థిస్తారు. సైన్యంలో స్త్రీలు ఉండ కూడదంటారు.మ్యాట్ గేట్జ్: ఈయనను అటార్నీ జనరల్‌గా ప్రకటించారు. ఈయన ఒక పదిహేడేళ్ల అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నారనీ, మాదక ద్రవ్యాలు వినియోగించారనీ కేసులు ఉన్నాయి. ఈయన రోజూ ట్రంప్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొంటారు. ఎఫ్‌బీఐ, న్యాయ శాఖలనే రద్దు చేయాలంటారు. కాపిటల్ దాడిని సమర్థిస్తూ దానికి గర్వపడతానంటారు.చదవండి: అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలుతులసి గబ్బార్ద్: ఈమెను డైరెక్టర్ అఫ్ నేషనల్ ఇంటలిజెన్స్గా నియమించనున్నారు. ఈమె గతంలో డెమోక్రాట్. 2020 అధ్యక్ష స్థానం కోసం పోటీ పడాలనుకుని ప్రైమరీల్లో ఓడిపోయారు. సుమారు ఇరవై ఏళ్ళు మిలిటరీలో పనిచేశారు. రష్యా సానుభూతిపరురాలు అని పేరు. సిరియా ప్రజలను ఊచకోత కోసిన అధ్యక్షుడు బషర్‌ను సమర్థిస్తారు. బషర్‌కు రష్యా మద్దతుంది. ఈమె పేరు చూసి కొందరు ఇండియన్ అనుకుంటున్నారు. కానీ ఈమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు.క్రిస్టీ నోయెమ్: ఈమెను హోమ్ ల్యాండ్ సెక్రటరీగా ఎంపిక చేశారు. అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత, వలసల నిరోధం లాంటివి పర్యవేక్షించాలి. ఈమె ట్రంప్ ప్రతిపాదించిన వలసవాదులను పంపించి వేయాలనే స్లోగన్‌ను బాగా సమర్థించారు. ఈమె రాసిన పుస్తకంలో– పెంపుడు కుక్క(పేరు క్రికెట్) తన ఆజ్ఞలను పాటించనందుకు చంపేయాల్సి వచ్చిందని రాస్తే పాఠకులు ఛీకొట్టారు. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటారామె.చదవండి: వాస్తవాలను నిరాకరిస్తున్నామా?రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్: ఆరోగ్య మంత్రిగా ఎంపిక చేశారు. ఈయనకు టీకాలంటే అస్సలు గిట్టదు. ఔషధాల కంపెనీలంటే దురభిప్రాయం. పచ్చి ఆవుపాలు వాడటమే ఆరోగ్యమంటారు. పచ్చి పాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందనీ, వేడి చేసి వాడాలనీ ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్య మంత్రిగా ఈయన పేరు ప్రకటించగానే ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈయన అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, మధ్యలో విరమించుకుని ట్రంప్‌కు మద్దతిచ్చారు. ట్రంప్ తన మంత్రులుగా ఎంపిక చేసుకున్నవారిలో వీరు కొందరు. మరి ట్రంప్ పాలన ఎలా ఉండబోతున్నదో చూడాలి!- డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ (అమెరికా నుంచి) -
అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలు
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, చాలా వివరాలతో చాలా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటి లోని ఎక్కువ విషయాలు మేధావు లకు మాత్రమే అర్థం అయ్యేటట్టు వున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువ ఓట్లు వేసి గెలిపించింది సాధారణ మనుషులే గానీ, మేధావులు కాదు. ఈ సాధారణ మనుషులు ఏ విషయాలతో ప్రభావితం అయి ఓట్లు వేశారు? ఈ సాధారణ మనుషులకు పట్టని విషయాలు కూడా ఉన్నాయా? (1) ట్రంపును స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడిగా ఒక సివిల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పును ఇచ్చింది. ట్రంపు దాని మీద అపీల్ చేసుకున్నాడు కూడా. అయినా సరే, స్త్రీలతో సహా ఎంతో మంది తమ ఓటును ట్రంపుకు వేశారంటే, వారికి న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్టా? (2) ఒక అశ్లీల చిత్రాల నటీమణితో తనకున్న సంబంధాన్ని దాచి వుంచడానికి, ట్రంపు ఆమెకి డబ్బు ఇచ్చి, ఆ డబ్బును దొంగ లెక్కలలో చూపించాడని ఒక క్రిమినల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పు ఇచ్చింది. జైలు శిక్షను ప్రకటించడం మాత్రం ఆలస్యం చేసింది రాజకీయ కారణాల వల్ల. శిక్షను ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ట్రంప్ దీన్ని ఇంకా అపీల్ చేసుకోలేదు. ఇది కూడా సాధారణ ప్రజలకు పట్టలేదు. (3) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, ఎన్నో గవర్నమెంటు రహస్య పత్రాలను చట్టవ్యతిరేకంగా సొంత ఇంటికి తీసుకుపోతే, అతని చేత నియామకమయిన జడ్జి ఒకావిడ, ఏదో కారణం చూపించి ఆ కేసును కొట్టివేసింది. (4) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, తన అనుచరులను రెచ్చగొట్టి ప్రభుత్వ భవనం మీదకి ఉసి గొలిపాడు. ఆ అనుచరులు చేసిన విధ్వంసకాండ అంతా అన్ని టీవీలలోనూ వచ్చింది. ట్రంప్ అనుచరులను ఎంతో మందిని జైల్లో పెట్టారు. వారందరినీ బయటకు తీసుకు వస్తానని ట్రంప్, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలు, మళ్ళీ ఓట్లు వేశారు. (5) కోవిడ్ సమయంలో, ట్రంప్ అసమర్థత వల్ల ఎంతో మంది మరణించడం అనేది 2020 ఎన్నికల్లో అతను ఓడిపోయాడనడానికి ఒక కారణమని అందరికీ తెలుసు.(6) డబ్బూ, ఖ్యాతీ వున్న మొగవాళ్ళు, ఆడవాళ్ల జననాంగాలని పట్టుకోవచ్చుననీ, ఆ ఆడవాళ్ళు ఏమీ అనరనీ, ట్రంప్ పబ్లిక్‌గా అన్నాడు. అయినా, ఎంతో మంది ఆడవాళ్ళు అతనికే ఓటు వేశారు!(7) స్త్రీలకి తమ శరీరం మీద తమకు హక్కు లేదనీ, అత్యాచారానికి గురయిన పదేళ్ళ బాలికయినా శిశువును కని తీరాల్సిందేననీ, తల్లి ప్రాణం మీదకి వచ్చినా సరే, ఆ తల్లికి అబార్షన్ చేయ కూడదనీ చెప్పే ఈ ట్రంపుకు, ఆ స్త్రీలే ఎలా ఓట్లు వేశారు? (8) రాజకీయ శత్రువులందరినీ, తను నెగ్గాక జైళ్ళలో పడేస్తానని ట్రంప్ అన్నా, ఈ సాధారణ జనాలకి ఆ మాటలు పట్టలేదు. చదవండి: డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?(9) ‘అందమైన తన కూతురు నిజంగా తన కూతురు కాకపోతే, ఆమెతో డేటింగ్ చేసేవాడి’నన్న ఆ తండ్రిని ఈ సాధారణ జనాలు క్షమించేశారు. (10) రాజ్యాంగంలోని ఒక సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించుకుని, చిన్న పిల్లలకి కూడా తుపాకీలు దొరికేలా వ్యాపార పరిస్థితు లను నెలకొల్పి, ఎన్నో స్కూళ్ళలో జరిగిన కాల్పులకి ఏ మాత్రం బాధ్యత వహించని ట్రంపుని ఈ సాధారణ ప్రజలు ఎలా సహించారు? (11) అనాదిగా వుండిన నేటివ్ అమెరికన్లని అణగగొట్టిన వలసదార్ల చేత ఏర్పడ్డది అమెరికా! ఇలాంటి దేశ ప్రతినిధిగా, పొట్టకూటి కోసం వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా వుండే ట్రంపుకి ఈ సాధారణ ప్రజలు ఎలా ఓట్లు వేశారు? (12) సాధారణ ప్రజల సోషల్ సెక్యూరిటీ వసతులకీ, వారి మెడికల్ వసతులకీ భంగం కలిగిస్తానంటున్న ఈ రాజకీయ వేత్త ట్రంపుని ఎలా నమ్మారు? (13) బిలియనీర్ అయినా సరే, గవర్నమెంటుకి ఏవో నష్టాలు చూపించి ఎన్నో యేళ్ళు పన్నులు కట్టని ఈ ట్రంపుని ఈ ప్రజలు క్షమించేశారు, వారు పన్నులు కడుతూ! ఈ విషయాల వల్ల మనకి ఏం అర్థమవుతుందీ? అమెరికాలో అత్యధిక సాధారణ ప్రజల చైతన్య స్థాయి ఇలా వుందీ – అని. ఈ అమెరికా సాధారణ ప్రజలు, ఇండియాలోని అత్యధిక సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు, పేదరికంలోనూ, విద్యాలేమి తోనూ లేరు. అయినా సరే, వీరి చైతన్య స్థాయి ఇలాగే వుంది. మోసపోయే వాళ్ళున్నంత వరకూ మోసగించే వాళ్ళు వుంటారు. చెయ్యాల్సినది ఆ మోసపోయే వాళ్ళకి చైతన్యం కలిగించడం. ఆ పని ఎవరు చెయ్యాలి? ఎంత వరకూ సాధ్యం అనేది వేరే విషయం! -జె.యు.బి.వి. ప్రసాద్ వ్యాసకర్త రచయిత (క్యూపెర్టినో, కాలిఫోర్నియా నుంచి) -
ప్రగతి పేరుతో భూసేకరణ.. పేద రైతులే టార్గెట్!
ఈమధ్య దక్షిణ కొరియాకు చెందిన షూ ఆల్స్ కంపెనీ తాము ఇక్కడ 300 కోట్లతో షూ కంపెనీ పెడతామనీ, అందుకు కావలసిన 750 ఎకరాల భూమి ఇస్తే 87 వేల మందికి ఉపాధి కల్పిస్తామనీ ప్రగల్బాలు పలికింది. తెలంగాణలో ఎకరం కోటి రూపాయలనుకున్నా 300 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల విలువైన భూమి అడిగారన్నమాట. అదే విధంగా ఒక స్మార్ట్ హెల్త్ సిటీ పెట్టడానికి 5,000 ఎకరాలు కావాలని అర్జీ పెట్టింది ఇదే కంపెనీ. దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ కేవలం 5–10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. ఇది ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్లు ఉంది. ఇక ఈ మధ్య ప్రగతి పేరుతో భూసేకరణ చేయడం పేద, మధ్య తరగతి రైతుల పట్ల ఉరితాడులా పరిణమించింది.భూమి ధరలు పెరగటంతో చిన్న, సన్న కారు రైతులు ధనవంతులు అయ్యే సమయానికి, ప్రభుత్వమే భూ దోపిడీకి పాల్పడి ప్రజలను దారిద్య్రంలోకి నెడుతోంది. ఉన్నోడికి రవ్వంత పోయినా కొండంత లాభం వస్తే, లేనోడు రోడ్డున పడుతున్నాడు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే పరిహారం, కనీసం గుంట ప్లాట్ కొనుక్కోవడానికి సరిపోవడం లేదు. ప్రగతి వలన భూముల విలువ పెరిగి వందల, వేల ఎకరాలు ఉన్న వారు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. ఒకసారి మార్కెట్ విలువ, ప్రభుత్వ పరిహారం విశ్లేషిస్తే... చౌటుప్పల్ దగ్గర ఎకరం 2 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 10 లక్షలు; జహీరాబాద్ దగ్గర 1.5 నుండి 2 కోట్లు ఎకరానికి ధర ఉంటే 7–10 లక్షలు మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వం భూస్వామిగా కాకుండా, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) సేకరించిన భూమి ఎంత, అందులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటి వలన ఎంతమందికి ఉపాధి కల్గుతుంది వంటి వివరాలతో ఒక శ్వేతపత్రం (వైట్ పేపర్) విడు దల చేయాలి. కొత్తగా సేకరించే భూమి... పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల కొరకా లేదా పూర్తిగా ప్రజా అవసరాల కొరకా అనేది స్పష్టం చేయాలి. గతంలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూమిలో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తేల్చాలి. ఇప్పటికే వివిధ సంస్థలు, వ్యక్తులు లేదా ట్రస్టులకు వివిధ ఉద్దేశాలతో కేటాయించిన భూమిలో వేరే వ్యాపారాలు, సంస్థలు నెలకొన్నా యేమో చూడాలి. భూములు సేకరించే ముందు, నిర్వాసితులు అవుతున్న ప్రజల, రైతుల ప్రయోజనాలనే ముఖ్యంగా ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. ఆ భూముల వలన వచ్చే ప్రయోజనాలలో నిర్వాసితులకు సింహభాగం దక్కాలి. ఒక ప్రాజెక్ట్ లేదా రోడ్డు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలలో భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి, నిర్వాసితులకు కూడా ఆ లాభం దక్కేలా చూడాలి.ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని మొదట ఉపయోగించిన తర్వాత, కొత్త భూ సేకరణకు శ్రీకారం చుట్టాలి. అలాగే ఒక ప్రాజెక్టులో కేవలం ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న రైతు సర్వం కోల్పోతే వారు రోడ్డున పడతారని గమనించాలి. అదే ఎక్కువ భూమి ఉన్నవారు కొంత పోయినా, మిగతా భూమి విలువ పెరగటం వలన వారికి లాభం కలుగుతుంది. అందువల్ల భూమిని కోల్పోయేవారు ఒక్కొక్కరు ఎంతెంత శాతం భూమిని కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రాతిపదికన పరిహార చెల్లింపు ఉండాలి.ప్రాజెక్టులలో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 6,690 కోట్లు. ఇందులో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి 5,500 ఎకరాలు. రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే. రోడ్డుకు అటు, ఇటు ఉన్న రైతుల భూముల విలువ లక్షల కోట్లకు పెరిగింది. కాంట్రాక్టర్ లాభపడ్డాడు. ప్రభుత్వం 7,300 కోట్లకు అంటే ఏడాదికి 240 కోట్లకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై సంవత్సరానికి రూ. 550 కోట్ల రాబడి ఉంది. మున్ముందు అది ఏడాదికి రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే రిజిస్ట్రేషన్ విలువ ఇచ్చి, మార్కెట్ విలువ ప్రకారం ఆ కంపెనీలో నిర్వాసితులకు షేర్ ఇచ్చి ఉంటే, వచ్చే 30 సంవత్సరాలు నిర్వాసిత రైతులకు నెలకు కొంత పరిహారం అందేది. అలానే పారిశ్రామిక వాడలు, కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు నిర్వాసిత రైతులకు భూమి మార్కెట్ విలువ ప్రకారం షేర్ ఇవ్వడం వలన వారు కూడా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు ఉన్న కంపెనీల దగ్గర నుండి భూమిని సేకరించి వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడం వలన ఎవ్వరికీ నష్టం లేకుండా ప్రగతి సాగుతుంది. అలానే వారికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ లే ఔట్లలో ప్లాట్ కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక వెసులుబాట్లు, స్వయం ఉపాధికి లోన్లు... అవీ వడ్డీ రహిత రుణాలు అందించడం; ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా కేటాయించడం... ఇలా పలు విధాలుగా భూ నిర్వాసితులకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. చదవండి: మంచి పనిని కించపరుస్తారా?బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టీడీఆర్) లాంటివి ఇవ్వడం వలన వారికి అధికంగా ఆర్థిక సుస్థిరత కలుగుతుంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు, టీడీఆర్ ఇవ్వడం తెలిసిందే. అదే విధంగా భూ నిర్వాసిత కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువను కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా టీడీఆర్ ఇవ్వడం వలన వారికి లబ్ధి జరుగుతుంది. ఉదారణకు ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కొరకు దాదాపు 9,000 ఎకరాలు కావాలి. ప్రస్తుతం ఏరియాను బట్టి మార్కెట్ విలువ ఎకరం రూ. 50 లక్షల నుండి రూ. 3 కోట్ల వరకు ఉంది. కానీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వేల్యూ మీదనే పరిహారం చెల్లిస్తుంది. దీని వలన రైతులు, ముఖ్యంగా సర్వం కోల్పోయే చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్ట పోతారు. వారికి పరిహారమే కాకుండా, టీడీఆర్ కూడా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది.చదవండి: కులరహిత వ్యవస్థకు తొలి అడుగుచాలా సందర్భాలలో చిన్న, సన్న కారు రైతులు, ముఖ్యంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నారు. వివిధ కంపెనీల పేరు మీద వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. కేవలం పేద రైతులే టార్గెట్ కావడం బాధకారం. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీ -
దిస్సనాయకే విజయం సంపూర్ణం
సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్‌లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి గెలుచుకున్నవి 159. ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు. సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్ఎల్ఎఫ్ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.తమిళ ఈలమ్‌కు వ్యతిరేకంవాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్‌గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది. ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్‌గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు. నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.సాహసించి పార్లమెంటు రద్దుఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్‌ను రద్దు చేశారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.ఇండియాతో సత్సంబంధాలు?దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన. కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్‌ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఘర్షణలకు ముగింపెప్పుడు?
నవంబరు 11 నుంచి కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లలవిగా భావిస్తున్న ఆరు మృతదేహాలు మణిపుర్ సరిహద్దులోని నది నుండి స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత రాజధాని ఇంఫాల్ లోయలో భయంకర వాతావరణం నెలకొంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వాహనాలను తగుల బెట్టి, పలువురు ఎమ్మెల్యేల నివాసాలపైనా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పైనా దాడి చేశారు. దీంతో గిరిజనేతర మెయితీల ఆధిపత్యంలో ఉన్న లోయలోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజన కుకీ– జోలు ఎక్కువగా ఉండే చుట్టుపక్కల కొండలు, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాలలో కూడా కర్ఫ్యూ విధించారు. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈ క్లిష్ట పరిస్థితు ల్లోనూ మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో హింస రాజుకుంటోంది. 2023 మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దగ్గరగా ఉన్న చురాచాంద్‌పూర్ పట్టణంలో మెయితీ కమ్యూనిటీ– కుకీ తెగ మధ్య హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని గిరిజనేతర మెయితీ ప్రజలు డిమాండ్ చేయడం ఘర్షణలకు తక్షణ అని అంటున్నారు. కుకీలను మెయితీలు బయటి వ్యక్తులుగా, మాదకద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు. తమకు ఎస్టీ హోదా లేనందువల్ల తాము కుకీ ప్రాంతాల్లో భూములు కొనలేక పోతున్నట్లు వారు భావిస్తారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయితీలే తమ అవకాశాలన్నింటినీ కొట్టేస్తున్నట్లు కుకీలు భావి స్తారు. కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.మణిపుర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఒక్కటే ప్రస్తుత హింసకు కారణం అని చెప్పలేం. అంతర్లీనంగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న కోపం, చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న వైరుధ్యం లాంటివి అన్నీ కలిసి నేటి దుఃస్థితికి దారితీశాయి. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలోని రక్షిత అడవులపై ప్రభుత్వ నిర్బంధం, తాము హింసకు గురవుతున్నామన్న భావన కుకీలలో అసంతృప్తిని కలిగిస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన కుకీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు ఆవల, మణిపూర్‌లో తాము నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక కుకీ ల్యాండ్ కావాలనే వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా మరో కారణం. అలాగే కుకీలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ కుకీ ప్రజలందరినీ ‘డ్రగ్ లార్డ్స్’ అని ప్రస్తావించడాన్ని వారు నిరసిస్తున్నారు. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇదీ కుకీల్లో ఆగ్రహానికి హేతువే.కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వానికి అసలు ఒక విధానం లేదు. అలాగే మణి పుర్లో పారదర్శకమైన అటవీ విధానం లేదు. దీంతో పాలక బీజేపీ కూటమిలోనూ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరింత విషమించకుండా కేంద్రం మరింత వివేకంతో వ్యవహరించాలి.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు ‘ 99899 88912 -
యుద్ధంలా ‘మహా’ రాజకీయం
నేడు జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇవి పాత కొత్త పార్టీలకు అస్తిత్వ పోరాటంగా మారాయి. ఎందుకంటే, శివసేన, ఎన్సీపీ రెండింటిలోనూ అతి పెద్ద చీలికలు జరిగాయి. పైగా ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నాలను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికితోడు, డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశవాదం ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తున్నాయి. 2024లో దేశంలో జరిగిన పంటనష్టంలో 60 శాతం మహారాష్ట్రలోనే సంభవించింది. అయినా స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై పార్టీలు ఆధారపడటం పెరిగింది. ఇది సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతోంది.అనేక రాజకీయ ఒడుదొడుకులు, నిట్టనిలువు చీలికలు, ప్రముఖ నాయకుల అడ్డగోలు దారులు, అధికారం కోసం నిరంతర పోరు వంటి వాటిని చూసిన తర్వాత, మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ప్రముఖ పార్టీలు నేడు (నవంబర్ 20) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేక విధాలుగా విశేషమైనవి. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల, రాజకీయ చర్చను రూపొందించే అవ కాశం ఉన్న కొన్ని కీలకమైన తప్పులను బహిర్గతం చేశాయి. ఈ కథనం అటువంటి ఐదు తప్పులను, అవి విసిరే సంక్లిష్ట సవాళ్లను అందిస్తుంది.1. ఉచితాలపై ఆధారపడటం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలన్నీ ‘మాఝీ లడ్కీ బహిన్ యోజన’, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్ లకు ఉచిత తీర్థయాత్రలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉచితాలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి ప్రకట నలపై ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ పథకాలు చాలావరకు రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై ఆధారపడటం అనేది విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో సంక్షేమ ఎజెండాకు సమర్థంగా ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే, గతంలో మహిళల భద్రత, శ్రేయస్సుపై ఆదుర్దా, ఆందోళనలు కనబడేవి.గత రెండు దశాబ్దాలుగా, కీలక అభివృద్ధి సూచికలలో మహారాష్ట్ర కిందికి జారిపోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, మహారాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి వృద్ధి గత 14 సంవత్సరాలలో రెండు శాతం పాయింట్లు పడిపోయింది. ‘వార్షిక విద్యా నివేదిక– 2022’ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంకగణితం, పఠన నైపు ణ్యాలలో మునుపటి కంటే చాలా పేలవంగా ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వెలు వడిన ‘భారతదేశ నిరుద్యోగ నివేదిక–2023’ మహా రాష్ట్రలో విద్యావంతులైన నిరుద్యోగిత నిష్పత్తి 2022లో 15 శాతంగా ఉందని పేర్కొంది. దశాబ్దం క్రితం కంటే ఇది 11 శాతం పెరుగుదల. ఈ ప్రాథ మిక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, పార్టీలు ఎన్నికల లాభాల కోసం ఉచితాల మీద దృష్టి పెడుతున్నాయి.2. కరిగిపోయే పొత్తులు, మారుతున్న విధేయతలు: 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ కూటమి (భారతీయ జనతా పార్టీ, శివసేన) విచ్ఛిన్నం కావడం ‘మహా వికాస్ ఆఘాడీ’ ఏర్పాటుకు దారితీసింది. ఇది చాలా భిన్నమైన సిద్ధాంతాలు గల పార్టీల (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్–ఎన్సీపీ, శివసేన) మధ్య అసహజ కూటమి. వారి ప్రభుత్వం స్వల్పకాలికంగా పనిచేసింది. పైగా మనం శివసేన, ఎన్సీపీ రెండు పార్టీలలో అతిపెద్ద చీలికలను చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలిపేందుకు రెండు పెద్ద భాగస్వామ్యాలు సిద్ధమైనాయి. భారత రాజకీయాల్లో ఇలాంటి ఫిరాయింపులు అసాధారణం ఏమీకాదు. కానీ ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నా లను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించింది. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే దీర్ఘకాలిక పొత్తులు, సైద్ధాంతిక ప్రాధాన్యతలు, కేడర్ విధేయతలు వంటి సాంప్రదాయ సమీకరణాలను పూర్తిగా బలహీనపరిచింది. ఇది మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బ తీసింది. డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశ వాదం గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తు న్నాయి.3. వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ– ప్రేరిత సవాళ్లను పట్టించుకోకపోవడం: 2024లో దేశంలో జరిగిన పంట నష్టంలో 60 శాతం మహా రాష్ట్రలోనే సంభవించిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ ప్రేరిత సవాళ్లను పరిష్క రించడానికి సమష్టి కృషి జరగలేదు. రుణమాఫీ వంటి తక్షణ చర్యలకు మించి దీన్ని పరిష్కరించ డానికి రాజకీయ పార్టీలకు కచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మూలాలు ప్రధానంగా వ్యవసాయా ధారిత మరాఠా సమాజం ఎదుర్కొంటున్న సామా జిక–ఆర్థిక సవాళ్లలో ఉన్నాయి. భారీగా ఉన్నసంఖ్యను బట్టి, ఎన్నికల వేడిలో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మూల కార ణాన్ని పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.4. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం: మహా రాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు గత రెండు నుంచి ఐదేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 29 మున్సిపల్ కార్పొరేషన్లు (రెండు కొత్తవి), 200 కంటే ఎక్కువ మున్సిపల్ కౌన్సిళ్లు, 27 జిల్లా సమి తులు ఉన్నాయి. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం వల్ల స్థానిక పరి పాలనా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక నియంత్రణను సాధించేలా చేసింది. ఇది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం క్షీణించడం గురించిన ఆందోళనలకు దారితీసింది. స్థానిక సంస్థల పరిధిలోని కొన్ని విధాన నిర్ణయాలు రాజకీయ పరిశీలనల ద్వారా ఎక్కువగా ప్రభావితమవు తాయి. ‘గట్టర్, మీటర్, నీరు’ (మురుగునీటి పారు దల, విద్యుత్, నీరు)కు సంబంధించిన సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎందుకంటే వాటిని పరిష్కరించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.5. అభివృద్ధి విధానం: ఇటీవలి సంవత్స రాలలో, మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ రైలు వంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహారాష్ట్ర గణనీయమైన ప్రాధాన్య మిస్తోంది. ఈ విధానం పెద్ద స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తుంది. స్థానిక రైల్వేలు, ప్రభుత్వ ఆధీ నంలో నడిచే రోడ్డు రవాణా, అందుబాటులో ఉండే పబ్లిక్ రోడ్లు వంటి విస్తృత జనాభాకు మరింత నేరుగా ప్రయోజనం చేకూర్చే అవసరమైన సేవ లను బలోపేతం చేయాల్సిన ఖర్చుతో ప్రైవేట్, ఉన్నత వర్గాల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతోంది.2024 మహారాష్ట్ర ఎన్నికలు పాత, కొత్త పార్టీలు, నాయకులు, పొత్తులకు అస్తిత్వయుద్ధంగా పరిణమించాయి. కానీ అంతకుమించి, ఇది ఓటర్లకు నిజమైన పరీక్ష అవుతుంది. ఎందుకంటే వారి ఎంపికలే రాబోయే దశాబ్దాల రాష్ట్ర రాజకీ యాల గమనాన్ని నిర్ణయిస్తాయి.– సంజయ్ పాటిల్ ‘ రాజకీయ పరిశోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ను ఊహిస్తోంది.ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్‌లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్‌ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్‌ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్‌ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్‌జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్‌కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్‌లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్‌లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్‌లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గల్ఫ్ వలసజీవిత సారం
‘ఆడు జీవితం’ అనే మలయాళ పదం గత కొన్ని నెలల నుండి ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. మలయాళీ భాషలో మొదటిసారి 2008లో ఈ పేరుతో వచ్చిన నవల ఎంతో ప్రజాదరణ పొంది రెండు వందల యాభైకి పైగానే ముద్ర ణలను పొందింది. ఇది భార తీయ సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విషయం. వలస వెళ్ళిన నజీబ్ అనే ఒక మలయాళీ దుర్భరమైన జీవితా నుభవాలను ఆధారంగా... ‘బెన్యా మిన్’ అనే మలయాళ రచయిత ‘ఆడు జీవితం’ నవల రాశారు. కేరళ సాహిత్య అకాడెమీ 2009లో ఈ పుస్తకానికి పురస్కారాన్నిచ్చి గౌరవించింది. అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఈ నవల కేరళ చలనచిత్ర రంగాన్నీ వదలలేదు. ఫలితంగా ‘ఆడు జీవితం (ది గోట్ లైఫ్)’ అనే సినిమా తయారై ఈ సంవత్సరం మార్చిలో విడుదలైంది. ప్రింట్ రూపంలో వచ్చిన పుస్తకానికి ఎంత మన్నన దొరికిందో అంతకి మించి సినిమాకీ పేరు వచ్చింది. అవార్డులతో పాటు, వందకోట్లు వసూళ్లని దాటేసి చరిత్రపై చరిత్రను లిఖిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముందు ముందు ఇంకా ఏయే రూపాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించు కొంటుదో కాలమే చెబుతుంది. ఆడు జీవితం పలు భారతీయ బాషల్లోకి అను వాదమైంది. కొన్ని ఇతర దేశాల బాష (థాయ్, నేపాలీ, అరబిక్)ల్లో కూడా వచ్చింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. నలభై యాభై ఏళ్లుగా వలస వెళుతున్నారు. తిరిగొస్తు న్నారు. మూడు తరాల నుండి వెళుతూ వస్తున్నారు. వీరిలో ఎందరో నజీబ్ మాదిరిగా ఎన్నో అవస్థలు పడ్డారు. హింసలకు గురయ్యారు. ఎడారుల్లో దుర్భర మైన జీవితాలను గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగు పరచడానికి నానా కష్టాలు పడి ఎంతో కొంత సంపాదించుకొని ప్రాణాల్ని చేతిలో పెట్టుకొని తిరిగొ స్తున్నారు. వెళ్ళినవారికి సంబంధించిన ఎన్నో వైవిధ్య మైన నేపథ్యాలు దొరుకుతాయి. నైపుణ్యం లేని వారు, చదువు కొన్నవారు, ఒంటరి మహిళలు, యువ సము దాయాలకు చెందిన వారు ఎన్నోరకాల పనులు చేసి జీవితా నుభవాలను జీర్ణించుకొన్నారు. ఇవి అక్షర రూపంలో తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టాలి. మా పక్క ఊళ్ళో ఉండే భీమన్న తన కష్టాల్ని చెబితే కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎక్కడో తనకు ఏమాత్రం తెలియని ఎడారిలో ఒంటెల్ని చూసుకొనే పని. ఒంటెల పాలు పితకడం కూడా రోజువారీ పనుల్లో ఒకటి. అయితే ఒంటెల ఎత్తు గేదెలు, ఆవుల కన్నా ఎంతో ఎక్కువ. కాబట్టి పాలు పితికే వారు కూర్చోలేరు, నిల్చోనూలేరు. మధ్యలో కాళ్లని కొంచెం వంచి పాలని పితకాలి. ఈ విషయాన్ని భీమన్న చెబుతుంటే ఆయన కళ్ళలో తడి, మాటల్లో వేదన! గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చిన వారి జీవితాల్లోకి రచయితలు, రచయిత్రులు తొంగిచూడాలి. ఓపిగ్గా కూర్చుని వారి జీవితానుభవాల్ని విని కథలు, నవలలు, కవితలుగా రాయాలి. ఒక విహంగ దృష్టితో చూస్తే ఇలాంటి కథా వస్తువులపై రావ లసినంతగా రచనలు రాలేదని పిస్తుంది.ఈ మధ్య పత్రికల ద్వారా చాలా కథలు, నవలల పోటీల నిర్వహణ జరుగుతోంది. గల్ఫ్ వలస ప్రజలపైనే ప్రత్యేక పోటీలు నిర్వహిస్తే ఎన్నో వైవిధ్య జీవన రేఖలు, చిత్రాలు అక్షరాల్లో రూపం పోసుకొని పాఠకులకు అందించవచ్చు. ఎంతో విలువైన జీవన పార్శా్వలు దొరుకుతాయి. పత్రికలు ఈ విషయాన్ని ఆలోచించి కొన్ని పోటీలు వీటినే అక్షరబద్ధం చేయడానికి పెడితే తెలుగు సాహిత్య సంపద వైవి«ధ్యాన్ని సంతరించుకుంటుంది. ఒక సముదాయపు జీవితానుభవాలను తెలుసుకొన్న వారమవుతాము. డా‘‘ టి. సంపత్ కుమార్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్‌లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
కులరహిత వ్యవస్థకు తొలి అడుగు
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?ఉండవలసిన ప్రశ్నలుఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరం?ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్‌ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు