Editorial
-
ఈసీకి జ్ఞానోదయం ఎప్పుడు?
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది. నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు! అటు బెంగాల్లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు. పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు. సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్‌లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు భద్రపరచాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్‌లు ధ్వంసం చేశారు. ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు. పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి. దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు. -
ట్రంప్ శాంతిమంత్రం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎవరి అంచనాలకూ అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్‌పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతే కాదు... తనను చంపటానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావా లని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్ వివరణనిచ్చారు. తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా ట్రంప్ 2018లో ఏకపక్షంగా రద్దుచేశారు. అది కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటుఇరాన్ సంతకాలు చేశాయి. ఆంక్షలు సడలించటానికి అంగీకరించాయి. ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు.ట్రంప్ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నా నిజానికది మరిన్ని డిమాండ్లు తమముందుంచి లొంగదీసుకోవటానికేనని ఇరాన్ మత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరాన్లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమద్ రెజా పహ్లావీ (ఇరాన్ షా) 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో పదవీచ్యుతుడైనప్పటినుంచీ అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఆనాటినుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించటం కూడా పరిపాటైంది. 1988లో 290 మందితో వెళ్తున్న ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది. తాను విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయటానికి 2006లో భద్రతామండలిలో తీర్మానం చేయించింది. 2012లో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పర్యవసానంగా పసిపిల్లలకు పాలడబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవటంతో... అమె రికా బ్యాంకుల్లోవున్న వేలాదికోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించటంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైనది. అణు కార్య క్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటినుంచీ కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది. గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా, ఇరాన్‌లమధ్య పర స్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేమిటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నదని ట్రంప్ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ నిరుడు జూన్‌లో ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చు కోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే వున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు. ట్రంప్ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి. సౌదీ అరేబి యాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇరాన్‌తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నిటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యాన్ని ఛిద్రం చేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లతో ఇరాన్‌కు సాన్నిహిత్యముంది. అందువల్ల ఇరాన్‌తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అయితే ఇరాన్నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్‌కు కూడా వర్తింపజే సినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాని పక్షంలో ఈ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది. -
రాజా... రాజాధిరాజా...
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా (Ilayaraja ) ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం (Silence) ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు (music maestro) గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్‌తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్‌కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్పటికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రావడం రావడమే కొత్త సౌండ్‌ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. చదవండి: వాక్కాలుష్యం.. మాటల గురించి కాస్త మాట్లాడుకుందాంప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! చదవండి: ఆ రెండూ ఉంటే.. కావాల్సినవన్నీ ఉన్నట్టేరాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనర్లైనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా! -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సుపరిపాలనకు దోవ
‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు. సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు. ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్ఎస్లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు. అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు. -
ఈ అనిశ్చితి పోయేదెలా?
జనవరి 20న గద్దెనెక్కినప్పటినుంచీ అధిక టారిఫ్‌లపై హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చివరికి అందుకు తుది గడువు ఖరారు చేశారు. తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాలన్నీ వచ్చే నెల 2 నుంచి తమ దెబ్బ కాచుకోవాలని హెచ్చరిక జారీచేశారు. దాదాపు వంద నిమిషాలపాటు అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా ఇలాంటి హెచ్చరికలున్నాయి. ఇప్పటికే చాలా సాధించినట్టు స్వోత్కర్షలున్నాయి. అమెరికా ప్రజల పాలిట తాను ఆపద్బాంధవుడినన్న భ్రమ కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ‘నేను విధించబోయే సుంకాలు కేవలం ప్రజానీకం ఉద్యోగాలు కాపాడటానికి మాత్రమే కాదు... ఈ చర్య మన దేశ ఆత్మను కాపాడటానికి కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగానే ప్రపంచమంతా ఏప్రిల్ గురించి బెంగపడుతోంది. ముంచుకొచ్చే ద్రవ్యపరమైన అసమతౌల్యతను అధిగమించడమెలాగో తెలియక అయోమయంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ట్రంప్ చైనాపై అదనంగా 10 శాతం, మెక్సికో, కెనడాలపై మరో 25 శాతం సుంకాలు ప్రకటించటం వల్ల ఈ ఉపద్రవం ఖాయమని అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. సుంకాలను ట్రంప్ ‘సర్వరోగ నివారిణి’గా భావిస్తున్నారు. మెక్సికో మాదకద్రవ్య ముఠాల నుంచి పెద్ద యెత్తున వచ్చిపడే ఫెంటానిల్ అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. అక్రమ వలసలు దీనికి అదనం. వలసలను అరికట్టి, మాదకద్రవ్య ముఠా నాయకుల్ని పట్టి అప్పగించకపోతే 25 శాతం సుంకాలు తప్పవని గత నెల 4న ట్రంప్ హెచ్చరించటంతో కెనడా, మెక్సికోలు ఒక నెల వ్యవధి కోరాయి. మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ వెనువెంటనే అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి అదనంగా 10,000 మంది సైనికులను తరలించి తనిఖీలు పెంచి వలసలను నియంత్రించారు. దేశంలో ఫెంటానిల్ నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయటంతోపాటు భారీయెత్తున అరెస్టులు చేయించారు. 29 మంది డ్రగ్స్ ముఠా నాయకుల్ని అమెరికాకు అప్పగించారు. కెనడా అధ్యక్షుడు ట్రూడో ఫెంటానిల్ సరిహద్దులు దాటకుండా తనిఖీ వ్యవస్థను ముమ్మరం చేశారు. అయినా ట్రంప్ మనసు మారలేదు. ఆ రెండు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలుంటాయని తన ప్రసంగంలో ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్ని కల్లో పార్టీ ఓటమి ఖాయమన్న అంచనాలుండటంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవ టానికి ట్రూడో సిద్ధపడ్డారు. అందుకే ‘సై అంటే సై’ అంటున్నారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించ బోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే 2,100 కోట్ల డాలర్ల విలువైన సరుకుపై సుంకాలు వడ్డించారు. వివాదం సద్దుమణగకపోతే మరో 8,700 కోట్ల డాలర్ల సరుకుపై ఇది తప్పదని హెచ్చరించారు. షీన్బామ్ ఈమధ్యే అధికారంలోకొచ్చారు గనుక ఆమెకు కావలసినంత వ్యవధి వుంది. అందుకే ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్‌మెయిలింగ్ కొత్తగా ట్రంప్‌కు పుట్టిన బుద్ధికాదు. అమెరికాలో ఎవరున్నా ఇలాంటి బెదిరింపులతోనే ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకున్నారు. 1986–89 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక (గాట్)కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్ చర్చల్లోనైనా, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పై జరిగిన దోహా రౌండ్ చర్చల్లోనైనా అమెరికా వ్యూహం ఇదే. బ్రెజిల్ నుంచి వచ్చిన 4 కోట్ల డాలర్ల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించింది. మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపైనా ఇలాంటి చర్యే తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల(ఐపీఆర్)పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. ఆఫ్రికా దేశాలనూ ఇలాగే దారికి తెచ్చుకుంది. అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి వుంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18 శాతమైతే థాయ్‌లాండ్ నుంచి 17 శాతం, దక్షిణ కొరియానుంచి 16 శాతం ఎగుమతులుంటాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78 శాతం. తమ సంపద పెంచుకోవటానికి సంపన్న రాజ్యాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. భారత్‌తో సహా అనేక దేశాలు సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిపోవటానికి ఏకైక కారణం ఇదే. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యతకూ, తయారైన సరుకు అమ్ముకోవటానికీ సరిహద్దులు దాటి వెళ్తూ సమయానుకూలంగా విధానాలు మార్చుకోవడం సంపన్న రాజ్యాల నైజం. గతంలో తన మార్కెట్‌ను విస్తరించుకోవటానికి డబ్ల్యూటీవో తీసుకొచ్చిన అమెరికాయే ఇప్పుడు వేరే మార్గానికి మళ్లింది. అయితే ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. సగటు పౌరుల జీవన వ్యయం పెరిగి పోతుంది. వ్యాపారం దెబ్బతిని నిరుద్యోగం ప్రబలుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. తరతమ స్థాయిల్లో అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. 80 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లను శాసిస్తూ అతిగా సంపద పోగేసిన దేశమే ‘నన్ను అందరూ దోచుకుతింటున్నార’ంటూ పెడబొబ్బలు పెట్టడం ఒక వైచిత్రి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క దేశం అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతోంది. మున్ముందు కొత్త మార్కెట్ల వెదుకులాట కూడా మొదలవుతుంది. ఇలాకాక దేశాలన్నీ సమష్టిగా వ్యవహరిస్తేనే ఏదో మేర ప్రయోజనం ఉంటుంది. అమెరికాపై ఒత్తిడి పెరిగి సహేతుకమైన పరిష్కారం వీలవుతుంది. -
నిద్రలేచిన ‘బోఫోర్స్ స్కాం’
నలభైయ్యేళ్ల క్రితం పుట్టుకొచ్చి, పుష్కరకాలం క్రితం శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ ఆవులిస్తోంది. దాన్ని సమాధి చేసేవరకూ ఇంచుమించు ప్రతియేటా ఏదో ఒక కొత్త సంగతితో బయటికొస్తూ, వచ్చినప్పుడల్లా పెను సంచలనానికీ, దుమారానికీ కారణమైన బోఫోర్స్ ఆ రకంగా ‘ఎవర్ గ్రీన్’. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన అభ్యర్థన పత్రంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, అమెరికా న్యాయ విభాగాన్ని సంప్రదించటంతో అది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కబోతున్నదని భావించవచ్చు. అప్పట్లో బోఫోర్స్ స్కాంపై దర్యాప్తు చేశామని చెప్పిన అమెరికన్ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ ‘ఫెయిర్ ఫాక్స్’ నుంచి సమాచారం సేకరించాలన్నది సీబీఐ ప్రధాన ధ్యేయం. వాస్తవానికి ఈ అభ్యర్థన పత్రాన్ని జారీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్‌లోనే ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరూ అధిగమించలేని స్థాయిలో 1984 లోక్‌సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 404 స్థానాలు సాధించిపెట్టిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని... ఆ తర్వాత మరో మూడేళ్లకు బయట పడిన ఈ కుంభకోణం ఊపిరాడనీయకుండా చేసింది. ఇందులో తనకు లేదా తన కుటుంబ సభ్యు లకు ఎలాంటి ప్రమేయమూ లేదని రాజీవ్ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికిపైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకూ నిందితులపై కేసు ల్లేవు. దర్యాప్తు లేదు. అంతవరకూ మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్ రేడియో 1987లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్‌లోనూ పెను సంచలనం కలిగించాయి. ఈ స్కాంలో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతోపాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి నాలుగు వందల 155 ఎంఎం శతఘ్నులు కొనుగోలు చేయటానికి రూ. 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా,అందులో రూ. 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్‌కు ఏజెంట్‌గా వ్యవహరించిన విన్‌చద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ‘ది హిందూ’ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభ కోణంపై వరసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డ్బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.దాదాపు పదిహేనేళ్లపాటు దర్యాప్తు పేరుతో సీబీఐ సాగించిందంతా ఒక ప్రహసనం. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. అతని బ్యాంకు ఖాతాల విషయమై సమాచారం కావాలంటూ భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రికి అంతకు ఏడాదిముందు... అంటే 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాధవ్‌సిన్హ్ సోలంకీ ఉత్తరం అందజేశారు. ఇక 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకొస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచి పైన అయినా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సీబీఐ ముందుకు కదలనే లేదు. వాస్తవానికి అంతకుముందు 2003లో మలేసియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనా లోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు. సరిగదా... లండన్‌లోని కత్రోచి ఖాతాలకూ, ముడుపులకూ సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి, 2009లో ‘వాంటెడ్’ జాబితా నుంచి అతని పేరు తొలగింపజేయటంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. నిందితులుగా ఉన్న కత్రోచి, విన్ చద్దాలకు రూ. 41 కోట్లు అందాయని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. వీరిద్దరికీ ఏఈ సర్వీసెస్ నుంచీ, స్వెన్స్కా అనే సంస్థ నుంచీ సొమ్ములు బదిలీ అయ్యా యని తెలిపింది. ఆ తర్వాతైనా సీబీఐ చేయాల్సింది చేయలేదు. ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మావల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. నిందితులందరిపై కేసుల ఉపసంహరణకు అనుమతించమని అది దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటుచేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.రాజీవ్ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్ బ్యాంక్‌లో ‘మాంట్ బ్లాంక్’ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్ ముడుపులున్నాయని తాము కనుగొన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆగ్రహోదగ్రు డయ్యారని ‘ఫెయిర్ ఫాక్స్’ సారథి మైకేల్ హెర్ష్మాన్ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికితీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవు తుంది. ఈసారైనా ఆ పని జరుగుతుందా అనేది వేచిచూడాలి. -
ఇది చట్టబద్ధ హత్య!
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికుల విషాద గాథలు మనకు కొత్తగాదు. జీవితాలు సవ్యంగా వెళ్తే సరేగానీ... ఒకసారంటూ సమస్యల్లో చిక్కుకుంటే అక్కడ నరకం చవి చూడక తప్పదని తరచు వెల్లడయ్యే ఘోర ఉదంతాలు చెబుతాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబూధాబీలో చేయని నేరానికి ఉరికంబం ఎక్కిన ఉత్తరప్రదేశ్ యువతి షెహజాదీ ఉదంతం మరింత దారుణమైనది. నాలుగు నెలల శిశువును హత్య చేసిందని ఆరోపిస్తూ మోపిన కేసులో ఆమె వాదనలన్నీ అరణ్య రోదనలు కాగా చివరకు గత నెల 15న అక్కడి ప్రభుత్వం ఆ యువతి ఉసురు తీసింది. జవాబుదారీతనం ఏమాత్రం లేని వ్యవస్థలతో నిండిన యూఏఈలో వలస కార్మికులకు వీసమెత్తు విలువుండదు. వారి ప్రాణాలకు పూచీ ఉండదు. కానీ మన దేశం నుంచి వలసపోయే వారిలో అత్యధికులు ఎంచుకునేది యూఏఈనే. ఒక లెక్క ప్రకారం అక్కడ 35 లక్షలకు పైగా భారతీయ వలస కార్మికులున్నారు. ఆ దేశ జనాభాలో వీరి వాటా దాదాపు 33 శాతం. ఈ కార్మికుల్లో అత్యధికులు నివసించేది అబూధాబీలోనే. వలస కార్మికుల రక్షణ కోసం మన దేశం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అవి చాలినంతగా లేవు. మనకు యూఏఈతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలున్నాయి. ప్రవాసీ బీమా యోజన కింద తప్పనిసరి ఇన్సూరెన్స్ పథకం ఉంది. కార్మికుల హక్కులు కాపాడటానికీ, వలసల క్రమబద్ధీకరణకూ ఈ–మైగ్రేట్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ షెహజాదీని కాపాడలేకపోయాయి. చిన్ననాడు ముఖంపై కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించుకోవాలని ఆరాటపడి ఆమె ఒక మాయగాడి వలలో చిక్కుకుంది. యూఏఈలో ఉన్న తన బంధువుల ద్వారా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని అతగాడు నమ్మించి షెహజాదీ నుంచి రూ. 3 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను 2021 చివరిలో అబూధాబీకి పంపాడు. శస్త్రచికిత్స మాట వదిలి ఒక ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. ఆ ఇంటి యజమాని భార్య ఒక శిశువుకు జన్మనిచ్చాక అదనంగా శిశు సంరక్షణ భారం కూడా పడింది. నాలుగు నెలలున్న శిశువు వ్యాక్సిన్ వికటించి మరణిస్తే షెహజాదీపై హత్యా నేరం మోపారు. 2022 డిసెంబర్లో ఈ ఘటన జరిగిన నాటి నుంచీ దర్యాప్తు పేరుతో ఆమెను జైలు పాలు చేసిన పోలీసులు 2023 ఫిబ్రవరిలో లాంఛనంగా అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తంతు నడిపించి ఆమెను దోషిగా తేల్చారు. ఈ క్రమమంతా మన ప్రభుత్వ యంత్రాంగం, యూఏఈలోని మన రాయబార కార్యాలయం ఏం చేశాయన్నదే ప్రశ్న. శిశు మరణానికి కారణం స్పష్టంగా కనబడు తోంది. ఒక్కోసారి వ్యాక్సిన్లు శిశువులకు ప్రాణాంతకం కావటం అసాధారణమేమీ కాదు. ఆ మరణం వ్యాక్సిన్ వల్ల జరిగిందా లేక షెహజాదీయే శిశువుకు హాని తలపెట్టిందా అన్నది పోస్టు మార్టం జరిపితే వెల్లడయ్యేది. కానీ ఆ శిశువు తండ్రి అందుకు ఒప్పుకోలేదట. కనుక షెహజాదీని కోర్టులు దోషిగా నిర్ధారించాయి! సరైన ప్రయత్నాలు జరిపివుంటే న్యాయం జరిగేదేమో! రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని అన్ని స్థాయుల్లోనూ మొరపెట్టుకుంటూనే ఉన్నామని, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని కానీ సరైన స్పందన లేదని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్ అంటున్నారు. ఆఖరికి తమ కుమార్తె బతికుందో లేదో చెప్పమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప నిజమేమిటో వెల్లడి కాలేదు. శస్త్ర చికిత్స కోసం వెళ్లిన యువతిని బలవంతంగా పనికి కుదుర్చుకోవటమేగాక ఆమెపై హత్యా నేరం మోపటం, కింది కోర్టు విధించిన శిక్షను ఉన్నత న్యాయస్థానం కనీస ఆలోచన లేకుండా ఖరారు చేయటం అమానవీయం. ప్రభుత్వం అంతకన్నా బాధ్యతారహితంగా వ్యవహరించింది. గత నెల 15న మరణశిక్ష అమలు చేయగా, 17న రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు సైతం కేసును పరిశీ లిస్తున్నామన్న జవాబే ఇచ్చింది. మరణశిక్ష అమలైనట్టు 28నగానీ మన రాయబార కార్యాలయానికి చెప్పలేదు. కేసు విషయంలో చేయగలిగిందంతా చేశామని మన విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఆమె తరఫున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయించామని, చట్టాలు కఠినంగా ఉండటంతో కాపాడలేక పోయామని అంటున్నది. కానీ రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, ఇతరత్రా హక్కుల సంఘాల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. ఉసురు తీసేముందు చివరి కోరికగా తల్లిదండ్రులతో మాట్లాడించినా అది రెండు నిమిషాల ముచ్చటే అయింది. సంపన్నవంతమైన దేశంలో కాయకష్టం చేస్తే మంచి సంపాదన ఉంటుందని భావించి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. కానీ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అత్యంత దారుణమైన పరి స్థితుల్లో పనిచేయాలని, అక్కడ అమల్లోవున్న కఫాలా వ్యవస్థ ప్రకారం వారి వీసాలు యజమానులకు అనుసంధానించి వస్తాయని, దిగినవెంటనే వారు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటారని, అందువల్ల మరోచోట పని వెదుక్కోవటం అసాధ్యమని చాలామందికి తెలియదు. అధిక గంటలు పనిచేయించుకోవటం, వేతనాలు ఎగ్గొట్టడం, సామాజిక భద్రత పథకాలు లేకపోవటం వలస కార్మి కుల బతుకును దుర్భరం చేస్తోంది. ఈ విషయంలో యూఏఈతో మాట్లాడి తగిన చట్టాలు అమలయ్యేలా చూడటం, అక్కడ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న మన కార్మికుల వివరాలు ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావటం అవసరమని చెప్పాలి. వలసపోయే కార్మికులకు అక్కడ పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. షెహజాదీని కాపాడుకోలేక పోయినా, ఆ స్థితి మరెవరికీ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
వైట్‌హౌస్ రియాలిటీ షో!
రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ పరమ సత్యం వైట్‌హౌస్ వేదికగా, ప్రపంచ మాధ్యమాల సాక్షిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సంపూర్ణంగా అర్థమైవుంటుంది. హోంవర్క్ ఎగ్గొట్టిన కుర్రాడిని మందలించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విరుచుకుపడుతుంటే జెలెన్స్కీ సంజాయిషీ ఇస్తూనే, అవకాశం చిక్కినప్పుడల్లా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆయన దయనీయ స్థితిని ప్రత్యక్షంగా తిలకించిన సాధారణ ప్రజానీకం సరే... అంతర్జాతీయంగా చిన్నా పెద్దా దేశాధినేతలందరూ విస్మయపడ్డారు. కాస్త వెనక్కు వెళ్తే జరిగిందంతా వేరు. గత మూడేళ్లుగా ఆయనకు ఎక్కడికెళ్లినా రాజలాంఛనాలు! అమెరికన్ కాంగ్రెస్‌లోనూ, పాశ్చాత్య దేశాల పార్లమెంట్లలోనూ, అవార్డు ప్రదానోత్సవాల్లోనూ, న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేజ్లోనూ ఆయనకు సాదర స్వాగతాలు!! ఆయన కోరకుండానే మారణాయుధాలూ, యుద్ధ విమానాలూ, డాలర్లూ పెద్దయెత్తున వచ్చిపడ్డాయి. వాటి విలువ ట్రంప్ అంటున్నట్టు 35,000 కోట్ల డాలర్లా, జెలెన్స్కీ సవరించినట్టు 11,200 కోట్ల డాలర్లా అన్నది మున్ముందు తేలుతుంది. చిత్ర మేమంటే... ఆయనతో అమర్యాదకరంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ను పల్లెత్తు మాట అనని మీడియా, సూట్‌కు బదులు టీ షర్ట్ వేసుకురావటం అగ్రరాజ్యాధినేతను అవమానించినట్టేనని జెలెన్స్కీకి హితబోధ చేసింది! ట్రంప్ తీరు దౌత్యమర్యాదలకు విఘాతమనీ, వర్ధమాన దేశాధినేతను కించపరుస్తూ, ఆధిపత్యం చలాయిస్తూ మాట్లాడటం సరికాదనీ వస్తున్న వాదనలు ముమ్మాటికీ సమర్థించదగినవే. కానీ అమెరికా వ్యవహార శైలి గతంలో కూడా భిన్నంగా లేదు. మర్యాదలివ్వటం మాట అటుంచి గిట్టని పాలకులను పదవీచ్యుతుల్ని చేయటం, తిరుగుబాట్లకు ప్రోత్సహించటం రివాజు. కాకపోతే ట్రంప్ బహిరంగంగా ఆ పని చేశారు. అమెరికా చరిత్రనూ, పాశ్చాత్య దేశాల తీరుతెన్నులనూ చూస్తే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. 1946–49 మధ్య గ్రీస్‌లో రాచరిక నియంతృత్వంపై చెలరేగిన తిరుగుబాటును అణచటానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ సైన్యాన్ని తరలించారు. క్యూబా, చిలీ, వియత్నాం, ఇరాన్ వగైరాల్లో ప్రభుత్వాలను కూలదోసి తనకు అనుకూలమైనవారిని ప్రతిష్ఠించేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనల్ని చీకాకు పరిచేందుకు పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్లకు ఉసి గొల్పింది అమెరికాయే. ప్రభుత్వాల కూల్చివేతకు క్యూబాలోనూ, ఇతరచోట్లా పన్నిన పథకాలను రిటైర్డ్ సీఐఏ అధికారులు ఏకరువు పెట్టారు. ఈ పరంపరలో పాశ్చాత్య దేశాలు అమెరికాతో కలిసి కొన్నీ, సొంతంగా కొన్నీ చేశాయి. మన దేశంలో దాదాపు 200 ఏళ్లు అధికారం చలాయించి ఇక్కడి సంపదను బ్రిటన్ కొల్లగొట్టింది. ఆ దేశమే 1982లో ఫాక్‌ల్యాండ్ ద్వీపసముదాయం కోసం అర్జెంటీ నాపై యుద్ధం చేసి ఆక్రమించింది. ఇంకా 1990–91 నాటి గల్ఫ్ యుద్ధం, 1992–95 మధ్య కొన సాగిన బోస్నియా యుద్ధం, 1999లో కొసావో యుద్ధం, 2001లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో మొదలెట్టి 2021 వరకూ సాగించిన అఫ్గాన్ యుద్ధం, 2003–2011 మధ్య సాగిన ఇరాక్ యుద్ధం, 2011లో జరిగిన లిబియా దురాక్రమణ... ఇవన్నీ అమెరికా–పాశ్చాత్య దేశాలు ‘నాటో’ ఛత్ర ఛాయలో సాగించిన యుద్ధాల్లో కొన్ని. ఈ దేశాల్లో మానవ హక్కుల హననం జరుగుతున్నదనీ, ప్రభుత్వాలు నియంత పోకడలు పోతున్నాయనీ సంజాయిషీ ఇచ్చారు. కానీ అక్కడ పౌరులు లేరా... వారు తిరగబడలేరా?వాదోపవాదాల మధ్యన జెలెన్స్కీని ఉద్దేశించి ‘మీ దగ్గర పేకముక్కలు అయిపోయాయి’ అన్నారు ట్రంప్. అది వాస్తవం. ఒక వ్యంగ్యచిత్రకారుడు ఆ ఉదంతంపై వేసిన కార్టూన్ మాదిరే ఆయన్ను ఇన్నాళ్లూ అమెరికా, పాశ్చాత్య దేశాలు పేకమేడ ఎక్కించాయి. మారిన పరిస్థితులను జెలెన్స్కీ గ్రహించలేకపోతున్నారు. ఒక సార్వభౌమాధికార దేశంపై మరో దేశం విరుచుకుపడటం, దురాక్రమించటం, జనావాసాలను ధ్వంసం చేయటం ముమ్మాటికీ నేరం. ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేశారు. కానీ అందుకు తన చర్యల ద్వారా దోహదపడింది జెలెన్ స్కీయే. ఈ పోకడలు నివారించాలనీ, ఆయనకు మద్దతునీయటంకాక, చర్చల ద్వారా పరిష్కరించు కొమ్మని నచ్చజెప్పాలనీ పుతిన్ కోరినప్పుడు అమెరికా, పాశ్చాత్య దేశాలు ముఖం చాటేశాయి. ట్రంప్ తన పూర్వాశ్రమంలో రియాలిటీ షోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఇప్పుడు వైట్ హౌస్ ఉదంతం ఆ మాదిరి ప్రదర్శనే. తాను పుతిన్‌తో చేతులు కలపటం సరైందేనని అమెరికా ప్రజా నీకం అనుకునేలా చేయటమే ట్రంప్ లక్ష్యం. అది నెరవేరిందో లేదోగానీ ఉక్రెయిన్ కోసం పాశ్చాత్య దేశాలు ఏకమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. సైన్యాన్ని కూడా తరలిస్తామంటున్నాయి. కానీ జెలెన్స్కీ ఒక సంగతి గ్రహించాలి. ఎవరి మద్దతూ ఉత్తపుణ్యానికి రాదు. ఉక్రెయిన్ నేల ఒడిలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదపైనే ఎవరి దృష్టి అయినా. ఇవాళ మద్దతు నిస్తామంటున్న పాశ్చాత్య దేశాలు రేపన్నరోజు అమెరికాతో రాజీపడితే ఉక్రెయిన్‌కు మళ్లీ సమస్యలే. నిన్నటివరకూ మద్దతిచ్చిన అమెరికా స్వరం మార్చడాన్ని చూసైనా యూరప్ దేశాలను నమ్ముకుంటే ఏమవుతుందో జెలెన్స్కీ గ్రహించాలి. రష్యాతో శాంతి చర్చలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇకపై స్వతంత్రంగా వ్యవహరించగలమన్న అభిప్రాయం కలగజేస్తే, దురాక్రమించిన భూభాగాన్ని వెనక్కివ్వాలని రష్యాను డిమాండ్ చేస్తే జెలెన్స్కీకి అన్నివైపులా మద్దతు లభిస్తుంది. -
వ్యక్తిగత ప్రపంచం
‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో అక్షతామూర్తి (బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్ భార్య) సంభాషిస్తూ తల్లికీ, తండ్రి (నారాయణ మూర్తి)కీ విడి పర్సనల్ లైబ్రరీలు (Personal Library) ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్ మూర్తి (Rohan Murty) పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్’ కుటుంబం పర్సనల్ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికీ, సౌకర్యానికీ అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పిన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్ సోంటాగ్ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా– కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే! అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటక మీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు గత పాతికేళ్లుగా చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేశాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతు న్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్ రచయితల పేర్లు బయటికి చదువు కోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో తెలుస్తుంది.ఇటాలియన్ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పె వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్–అమెరికన్ వ్యాసకర్త నసీమ్ నికోలస్ తలాబ్. ఒక్క క్లిక్ దూరంలో వందల ఈ–బుక్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం. -
మాయలేళ్లూ... మరీచికలు!
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చట్టసభలకూ పరిమితులు!
నిబద్ధత, సచ్ఛీలత, నిబంధనలపట్ల సంపూర్ణ అవగాహన కలిగినవారి సారథ్యంలో చట్టసభలుంటే అలాంటిచోట ఆరోగ్యవంతమైన చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఆ సభ తలమానికమవు తుంది. కానీ అధికార పక్షానికి వంతపాడేవారు, వారి ఇష్టారాజ్యానికి పక్కతాళం వేసేవారు అధ్యక్ష స్థానాల్లో కూర్చుంటున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి బాపతు నేతలకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. తనను బిహార్ శాసనమండలి నుంచి బహిష్కరించటాన్ని సవాలుచేస్తూ ఆర్జేడీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఆయన్ను తక్షణం సభలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలితప్ప మితిమీరకూడదని తేల్చిచెప్పింది. నిరుడు మార్చిలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సునీల్ కుమార్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. పాము కుబుసం విడిచినట్టు తరచు రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవటం నితీశ్‌కు అలవాటని, ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ప్రజలనుంచి ఎన్నిక కాలేదని సునీల్‌కుమార్ సింగ్ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ, మరోసారి ఎన్డీయే కూటములతో చెలిమి చేయటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన్ను ‘పాల్తూరామ్’ అని హేళన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి నివేదించారు. సునీల్ తప్పు చేశారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించి సభా బహిష్కారానికి సిఫార్సుచేసింది. శాసనమండలి దీన్ని ఆమోదించి ఆయన్ను బహిష్కరిస్తూ తీర్మానించింది. మన రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన చేసింది. చట్టసభలకు ప్రత్యేక హక్కులుంటాయని, వాటి కార్యకలాపాల్లో లేదా నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని సభాధ్యక్షులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదుల్ని ఎటూ తేల్చకుండా వదిలేస్తూ తమను ప్రశ్నించరాదంటున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం, బహిష్కరణ వేటు వేయటం వంటివి రివాజయ్యాయి. కేవలం పాలకపక్ష ప్రయోజనాలను నెరవేర్చటం కోసమే స్పీకర్లు ఇలా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. నిజమే... రాజ్యాంగంలోని 212(1) అధికరణ ప్రకారం చట్టసభల కార్యకలా పాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణతో ఆ కార్యకలాపాల చెల్లుబాటును న్యాయ స్థానాల్లో సవాలు చేయటానికి వీల్లేదు. నిర్వహణ సంబంధమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంనుంచి చట్టసభలకు ఇది రక్షణనిస్తుంది. అయితే ఆ కార్యకలాపాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విరుద్ధత కనబడినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నది నిపుణుల వాదన. తాజా కేసులో జరిగింది ఇదే. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌కు అసలు విచార ణార్హత లేదని, 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యాన్నుంచి తమకు రక్షణనిస్తున్నదని శాసన మండలి తరఫు న్యాయవాది వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అంగీకరించలేదు. చట్ట సభల కార్యకలాపాలు వేరు, అందులో తీసుకునే నిర్ణయాలు వేరు అని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు... సునీల్‌కుమార్ సింగ్‌ను బహిష్కరిస్తూ తీసు కున్న ఎథిక్స్ కమిటీ నిర్ణయం పాలనాపరమైన చర్యే తప్ప శాసనవ్యవస్థ కార్యకలాపంగా పరిగణించలేమని తేల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభ నియంత పోకడలు పోకూడదు. మెజారిటీ ఉందన్న సాకుతో విపక్ష సభ్యుల గొంతు నొక్కడానికీ, వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించటానికీ ప్రయత్నించకూడదు. ఆ పరిస్థితులు తలెత్తితే న్యాయస్థానాలుమౌనంగా ఊరుకోబోవని తాజా తీర్పు తేటతెల్లం చేసింది. చట్టసభ కార్యకలాపాలు సాఫీగా సాగటానికి అనువైన నిబంధనలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగంలోని 208వ అధికరణ అధికారమిస్తోంది. సభ క్రమశిక్షణగా నడవటానికి ఎలాంటి నిబంధనలుండాలో, వాటిని ఉల్లంఘించినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో ఈ నిబంధనలు నిర్దే శిస్తాయి. అయితే నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏర్పడిన కమిటీలు తీసుకునే నిర్ణయాలు పాలనాసంబంధ పరిధిలోకి వస్తాయని గుర్తించటం తప్పనిసరని తాజా తీర్పు చెబుతోంది. ఆ నిర్ణయాలకు మెజారిటీ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో దీనికి సంబంధం లేదు. ఒక చర్యకు ప్రతిగా తీసుకునే ఏ నిర్ణయమైనా హేతుబద్ధతకూ, తార్కికతకూ లోబడివుండటం అవసరం. పిచ్చు కపై బ్రహ్మాస్త్రం తరహాలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. చట్టసభలు ఇష్టానుసారం వ్యవహరించే రోజులు పోయాయి. సభానిర్వహణ సవ్యంగా జర గటం, క్రమశిక్షణ కట్టుతప్పకుండా చూడటం అవసరమే. కానీ అందుకోసం అమలుచేసే చర్యలు అతిగా ఉండకూడదు. సభ్యులు పరిధి మీరారని భావించినప్పుడు అభిశంసించడం, మందలించడం, నిర్దిష్ట కాలానికి సభనుంచి సస్పెండ్ చేయడంవంటి అవకాశాలున్నాయి. కానీ విచక్షణ మరిచి నేరుగా బహిష్కరణ వేటు వేయటం అతిగా వ్యవహరించటమే అవుతుంది. ఎథిక్స్ కమిటీల నిర్ణ యాలు పాలనానిర్వహణ కిందికే వస్తాయని, వాటిపై న్యాయసమీక్ష తప్పదని సుప్రీంకోర్టు నిర్ణయించటం హర్షించదగ్గది. నియంతృత్వ పోకడలు పోయే పాలకపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు. -
పునర్విభజన పేచీ తేల్చేదెలా?
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు. అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది. బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్‌కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది. ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది. ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి. వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.అందులో సజ్జన్‌కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్‌గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి. పంజాబ్‌ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు. అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది. -
కష్టాల జర్మనీకి కొత్త సారథ్యం
బహుముఖ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న జర్మనీ ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మితవాదపక్షాల వైపు మొగ్గింది. 1990లో జర్మనీ ఏకీకరణ తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో 83.5 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యేవాద మితవాదులైన క్రిస్టియన్ డెమాక్రాటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) పార్టీలు రెండింటికీ కలిపి 208 స్థానాలు వచ్చాయి. పోలైన వోట్లలో ఆ రెండు పార్టీలూ 28.6 శాతం గెల్చుకోగా, తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నే టివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) 20.8 శాతంతో రెండో స్థానానికి చేరుకోవటం అందరినీ కలవర పరుస్తోంది. ఆ పార్టీకి 132 స్థానాలు లభించాయి. 2021తో పోలిస్తే దాని వోటింగ్ శాతం రెట్టింప యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుచరగణం అత్యుత్సాహం ప్రదర్శించి జర్మనీ ఎన్నికల్లో జోక్యం చేసుకోనట్టయితే ఏఎఫ్‌డీ వైపు మరింత శాతం మంది మొగ్గుచూపేవారన్నది ఎన్నికల నిపుణుల అంచనా. ఇంతవరకూ పాలించిన కూటమికి నేతృత్వం వహించిన సోషల్ డెమాక్రాటిక్ పార్టీ (ఎస్పీడీ) 16.4 శాతం వోట్లతో, 120 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కానీ పార్లమెంటులోని 630 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పర్చటానికి కావాల్సిన 316 స్థానాలు సీడీయూ, సీఎస్ యూలకు లేవు గనుక అనివార్యంగా ఎస్పీడీతో చేతులు కలపాల్సి వుంటుంది. తమకు ప్రభుత్వంలో కొనసాగే ఉద్దేశం లేదని ఎస్పీడీ చెబుతున్నా అంతకుమించి దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ ప్రధాన స్రవంతి పక్షాల వైపే వోటర్లు మొగ్గుచూపుతున్నట్టు తేలినా వాటి బలం గణనీ యంగా పడిపోయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యువత, మహిళలు ప్రధానంగా ఎస్పీడీ, గ్రీన్ పార్టీ, వామపక్షాల వైపు మొగ్గటం గమనించదగ్గ అంశం. యువతలో ఏఎఫ్‌డీ ప్రభావం కూడా పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంవున్న తూర్పు జర్మనీ ప్రాంత రాష్ట్రాల్లో ఏఎఫ్‌డీ బలమైన శక్తిగా ఎదిగినట్టు కనబడుతోంది. పశ్చిమ ప్రాంతంలో సీడీయూ, సీఎస్ యూలు ఆధిక్యత సాధించాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మిశ్రమంగావున్న బెర్లిన్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. అక్కడ వామపక్ష పార్టీకి అత్యధిక వోట్లు వచ్చాయి. ఈ ఫలితాలు వెల్లడిస్తున్న మరో కీలకాంశం దేశం ప్రాంతాలవారీగా విడిపోయిందన్నదే. తమను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరు లుగా చూస్తున్నారని, వలసలను ప్రోత్సహిస్తూ తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని చాన్నాళ్లుగా పూర్వపు తూర్పు జర్మనీ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. ఏఎఫ్‌డీ ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మల్చుకున్నదని ఫలితాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం చకచకా కోలుకుని సుస్థిర ఆర్థిక వ్యవస్థతో యూరప్ ఖండా నికే చుక్కానిగా నిలిచిన జర్మనీని గత కొన్నేళ్లుగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇవి చాల్లేదన్నట్టు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం మైనారిటీలో పడటంతో గడువుకు ముందే ఎన్నికలకు పోవాలని చాన్స్‌లర్ ఓలోఫ్ షోల్జ్ గత ఏడాది నిర్ణయించారు.ట్రంప్‌నూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌నూ ఎదిరించే సామర్థ్యం షోల్జ్‌కు లేదని 65 శాతంమంది వోటర్లు అభిప్రాయపడ్డారు. తన మాట వినని దేశాలపై భారీగా సుంకాలు విధించటం, నాటో కూటమికి చరమగీతం పాడటం తప్పదని బెదిరిస్తున్న ట్రంప్ వ్యవహారశైలితో వోటర్లు అసహనంతో ఉన్నారు. దానికి తోడు మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర మితవాద పక్షాలను దూరం పెడుతున్న యూరప్ దేశాలపై విరుచుకుపడటంతో అంతవరకూ మందకొడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఒక్కసారిగా జవసత్వాలొచ్చాయి. ఒకప్పుడు తమ దేశం సర్వనాశనం కావటానికి కారణమైన తీవ్ర మితవాద పక్షాలను వెనకేసుకురావటం ఎటూ మొగ్గని వోటర్లను ప్రభావితం చేసింది. పూర్వాశ్రమంలో సీడీయూ నాయకుడే అయినా సైద్ధాంతికంగా విభేదించి పార్టీకి దూరమైన ఫ్రెడరిక్ మెర్జ్ రెండేళ్లక్రితం అదే పార్టీ సారథ్యం స్వీకరించి సీడీయూని విజయతీరాలకు చేర్చారు. ఆయన ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. రష్యా నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని జర్మనీ భావిస్తోంది. ట్రంప్ వైఖరి చూస్తుంటే నాటో కూటమి అంతరించటం ఖాయమన్న సంకే తాలు కనబడుతున్నాయి. కనుకనే ‘సాధ్యమైనంత త్వరగా’ యూరప్ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవా లని షుల్జ్ పిలుపునిచ్చారు. అందుకు దండిగా నిధులు కావాల్సివుంటుంది. ప్రస్తుతం నాటోకు యూరప్ దేశాలు చెల్లిస్తున్న మొత్తం 29వేలకోట్ల డాలర్లు. కానీ భారీయెత్తున బలగాలు, ఆయుధాలు సమీకరించాలంటే అదనంగా మరో 26 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే తప్ప రష్యాను యూరప్ దేశాలు సొంతంగా ఎదుర్కొనటం సాధ్యంకాదని నిపుణులు అంచనా వేశారు. యూరప్‌లో ఆర్థికంగా అగ్రస్థానంలోవున్న జర్మనీ ఇందులో అధిక మొత్తాన్ని భరించాల్సి వుంటుంది. ఇప్పుడున్న పరిస్థి తుల్లో అది సాధ్యమేనా? ఎందుకంటే ఎగుమతులపై ఆధారపడిన జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బహిరంగ మార్కెట్ వ్యవస్థలు ఇన్నాళ్లూ దన్నుగా నిలిచాయి. అమెరికా వైఖరితో ఆ శకం అంత రిస్తున్న సూచనలు కనబడుతున్నాయి. కనుక మారిన పరిస్థి తుల్లో రష్యాతో తాత్కాలి కంగానైనా అవగాహనకు రావటం ఎంతో ఉత్తమం. ఇన్నాళ్లూ అమెరికా అభీష్టానికి అనుగుణంగా ఉక్రెయిన్‌లో నైనా, మరోచోటైనా యూరప్ దేశాలు పావులు కదిపినందు వల్లే రష్యాతో శత్రుత్వం వచ్చింది. ఇకపై ఆ దేశాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్న అభిప్రాయం రష్యాలో కలిగించగలిగితే చాలా వరకూ సమస్యలు సమసిపోతాయి. ఈ విషయంలో యూరప్ దేశాలు వివేకంతో ఆలోచించాలి. -
జెలెన్స్కీ విషాదయోగం!
‘కర్ర గలవాడిదే బర్రె’ నానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్టుంది. మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేనలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తన దేనన్న భ్రమల్లో బతికిన ఆయన, శాంతి కోసం పదవీత్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు. అంతేకాదు... ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కావాలట! జో బైడెన్ హయాంలో ఆయనకు అటు డాలర్లూ, ఇటు మారణాయుధాలూ పుష్కలంగా వచ్చిపడ్డాయి. ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్కలేకుండా పోయింది. నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో చర్చించారు. మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన్ను హేళన చేస్తూ మాట్లాడారు. నియంతతో చేతులు కలిపి నీతులు బోధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. దౌత్య మర్యాదల్ని అతిక్రమించారు. ఏడాది తిరగకుండా అంతా తలకిందులైంది. అణకువ ఒంటబట్టినట్టుంది. దురుసుగా, కఠినంగా, అవమానకరంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి నానా పాట్లూ పడుతున్నారు. అందులో భాగంగానే తాజా ప్రతిపాదనలు చేశారు. వీటిని ట్రంప్ అంగీకరిస్తారని జెలెన్స్కీ ఎలా అనుకున్నారో అర్థంకాదు. ‘ఎన్నికల్లేకుండా అధికారం చలాయిస్తున్న నియంత’గా తనను నిందించిన ట్రంప్ పదవీ పరిత్యాగ ప్రకటనల్ని ఖాతరు చేస్తారనుకోవటం, మెచ్చుకోలు మాటలు మాట్లాడుతారనుకోవటం తెలివితక్కువతనం. నాటోకు తిలోదాకాలిచ్చేందుకు సిద్ధపడుతున్న ట్రంప్‌ను ఆ సంస్థ సభ్యత్వం ఇప్పించమనటం మూర్ఖత్వం.ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెట్టిన మాట వాస్తవం. అమెరికా, పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణులతో, డ్రోన్లతో రష్యా నగరాలపై దాడులు చేసి నష్టపరిచిన ఉదంతాలూ కోకొల్లలు. పర్యవసానంగా నేడో రేపో విజయం ఖాయమని భావించి దురాక్రమణకు దిగిన పుతిన్ అయోమయంలో పడిన సంగతి కూడా నిజం. ఒకపక్క అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలూ, మరోపక్క నేల రాలుతున్న సైనికుల ఉదంతాలూ, ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలూ ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఉత్తర కొరియా నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి రణరంగంలో ముందుకు నడిపించినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇక దీన్నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్నా అన్ని దారులూ మూసుకు పోయాయి. చివరకు అణ్వాయుధాలనే నమ్ముకోక తప్పదన్న నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఆ ఒక్క భయమే అమెరికా, పాశ్చాత్య దేశాలను ముందుకు అడుగేయ నీయలేదు. మాటలకేం... కోటలు దాటేలా చెప్పారు. ఆచరణలో మాత్రం ఎంతసేపూ ఉక్రెయిన్ను ముందుకు తోసి లబ్ధి పొందుదామన్న ధ్యాస తప్ప అమెరికాకు మరేం పట్టలేదు. ఉక్రెయిన్ తీవ్ర నష్టాలు చవిచూసింది. గణనీయంగా భూభాగాన్ని కోల్పోయింది. తిరిగి స్వాధీనం చేసుకున్నవి సైతం అనంతర కాలంలో రష్యా సేనలకు చిక్కాయి. పట్టణాలు, నగరాలు శిథిలమయ్యాయి. ఒక దశలో సైన్యం చాలటం లేదని యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి ఉరికించారు. అయితే అదే మంత ఫలితం ఇవ్వలేదు. మొత్తంగా 3,80,000 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు గాయాల పాలయ్యారు. కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న సైనికులు లక్షల్లోనే ఉంటారు. 46,000 మంది సైనికులు మరణించగా, వేలాదిమంది ఆచూకీ లేకుండా పోయారు. అనేకులు బందీలుగా చిక్కారు. ట్రంప్ దృష్టంతా ఉక్రెయిన్ నేలలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర సహజ వన రులపై ఉంది. మూడేళ్లుగా తాము 50,000 కోట్ల డాలర్లు ఖర్చుచేశామని అమెరికా లెక్కలు చెబు తోంది. కానీ అది 12,000 కోట్ల డాలర్లు మించదని ఉక్రెయిన్ మొత్తుకుంటున్నది. పది తరాల ఉక్రె యిన్ పౌరుల్ని పీల్చిపిప్పిచేసే అమెరికా ఒప్పందం ససేమిరా సమ్మతం కాదన్న జెలెన్స్కీ మొర వినే నాథుడే లేడు. ఇన్నాళ్లూ అమెరికా సలహాతో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండదండలందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్‌ను ధిక్కరించదల్చుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఒకపక్క అమెరికా రూపొందిస్తున్న ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనల్ని పదిరోజులుగా ఉక్రెయిన్ వరసబెట్టి తిరస్కరిస్తుండగానే దాదాపు అంతా పూర్తయిందని, తుది దశ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అనటం జెలెన్స్కీని ఊపిరాడనివ్వటం లేదు. అమెరికా ప్రతిపాదన ఒప్పుకుంటే చమురు, సహజవాయువు, ఖనిజాలతోపాటు పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం సమర్పించుకోవాలి. తామిచ్చిన ప్రతి ఒక్క డాలర్‌కూ రెండు డాలర్లు చెల్లించాలన్నది అమెరికా డిమాండ్. ఇంత చేసినా ఉక్రెయిన్ రక్షణకు గ్యారెంటీ ఇవ్వటానికి తిరస్కరించటం, ముసాయిదా ఒప్పందంలో తొలుత ఉన్న ఆ మాటను తొలగించటం జెలెన్స్కీకి మింగుడుపడని అంశాలు.ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్ఠించటం, ఎవరికోసమో పొరుగు దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్యా సదృశమో వర్తమాన ఉక్రెయిన్ను చూసి అన్ని దేశాలూ గుణపాఠం నేర్చుకోవాలి. స్వీయప్రయోజనాలే సర్వస్వం అయిన యుగంలో బతుకుతూ అపరిపక్వతతో, అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తననే కాటేస్తాయని జెలెన్స్కీ గ్రహించలేక పోయారు. ఒకనాడు అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ యోధుడిగా నీరాజనాలందుకున్న మనిషే ఇవాళ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడేళ్లలో ఎంత మార్పు! -
వాక్కాలుష్యం
మాటల గురించి చెప్పడమంటే, మాటలు కాదుగాని, మాటల గురించి కాస్త మాట్లాడుకుందాం. మాటలు రకరకాలు. ఇతరుల మనసులను గాయపరచే ఈటెల్లాంటి మాటలు; గాయపడ్డ మనసులకు ఊరటనిచ్చే ఊరడింపు మాటలు; ఎదుటివారిని మునగ చెట్టెక్కించే మెరమెచ్చు మాటలు; జనాలను ఇట్టే బోల్తా కొట్టించే బురిడీ మాటలు; సొంత డప్పు మోగించుకోవడంలో కోటలు దాటే మాటలు; కపటబుద్ధులాడే కల్లబొల్లి మాటలు; బుద్ధిహీనుల పొల్లు మాటలు; ఈర్శ్యాళువుల ద్వేషపు మాటలు; ఉబుసుపోవడానికి చెప్పుకొనే ఊకదంపుడు మాటలు– మాటల గురించి చెప్పుకోవాలంటే, ఇలా ఎన్ని మాటలైనా ఉంటాయి. మాటలాడే తీరును బట్టి మనిషిని అంచనా వేయవచ్చు. ఎంతటి స్ఫురద్రూపులైనా కావచ్చు; మరెంతటి నానాలంకారభూషితులైనా కావచ్చు; భాషణ నైపుణ్యం కొరవడితే మాత్రం ఎన్ని ఆభరణాలను దిగేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, ఎవరూ పట్టించుకోరు. ‘కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః/ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః/ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే/ క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం’ అన్నాడు భర్తృహరి. ఇదే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి ‘భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్/ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్/ భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా/గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’ అని తెలుగులోకి అనువదించాడు. మనకు ‘వేషభాషలు’ అనే పదబంధం ఉంది. వేషం ఒక్కటే చాలదు, అందుకు తగిన భాష కూడా ఉన్నప్పుడే రాణిస్తుంది. దర్పానికి చిహ్నమైన భుజకీర్తులు, మెడలో ధగధగలాడే సువర్ణహారాలు, కేశపాశాలకు సొగసైన అలంకారాలు, శరీరాన్ని ఘుమఘుమలాడించే పన్నీటి స్నానాలు, ఒంటికి పూసుకునే మైపూతలు – ఇవేవీ మనిషికి అలంకారాలు కాలేవు. సంస్కారభరితమైన, సందర్భోచితమైన మృదువాక్కులే మనిషికి అసలైన ఆభరణాలు. భర్తృహరి సారాంశం ఇదే! అసమాన పదసంపద, అనర్గళ వక్తృత్వ ప్రాభవం, అన్నింటికీ మించి బహిరంగ వేదికలపై వాక్కుకు తగిన అభినయ చాతుర్యం వంటి ప్రతిభా పాటవాలెన్ని ఉన్నా, కించిత్ సందర్భశుద్ధి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వాగ్భూషణం మిలమిలలాడుతుంది. సమయ సందర్భాలను పట్టించుకోకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సభలలో రసాభాస తప్పదు. పద్మభూషణ పద్మవిభూష«ణాది సగౌరవ భూషణాలు ఎన్ని ఉన్నా, సందర్భశుద్ధి లేని వాచాలత ప్రదర్శించినట్లయితే, సదరు మనుషుల వాగ్భూషణం వెలవెలబోతుంది.అనవసర ప్రసంగాలు, అసందర్భ ప్రలాపాలు, పరుష పదప్రయోగాలు వాగ్భూషణానికి కిలుములా పట్టి, దానిని వెలవెలబోయేలా చేస్తాయి. వాగ్భూషణం వన్నె తరగకుండా ఉండాలంటే, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకోగల ఇంగితం కలిగి ఉండాలి. సూక్ష్మంగా ఈ లక్షణాన్ని వాగ్వివేకం అనవచ్చు. వాగ్వివేకం కలిగినవాళ్లు లోకంలో ఉత్తములుగా, ఉన్నతులుగా సముచిత గౌరవం పొందుతారు. ‘మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే సురక్షితం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టీటస్. మనోభావాల శకంలో ఆయన సలహా పాటించదగినదే! ‘మౌనేన కలహం నాస్తి’ అని మన పూర్వ సుభాషితం కూడా చెబుతోంది. అయినా, మాట్లాడక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే వాగ్వివేకం. ఇదే సంగతిని ‘అనర్గళ వాగ్ధార కన్నా మాట్లాడటంలో విచక్షణ ముఖ్యం’ అని ఇంగ్లిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ ఏనాడో చెప్పాడు. ‘సకాలంలో పాటించే మౌనం వాగ్ధాటి కంటే గొప్పది’ అని ఇంగ్లిష్ కవి మార్టిన్ టప్పర్ అన్నాడు. విచక్షణ లోపించిన మాటలు మాట్లాడేవారు ఎంతటి ఘనసంపన్నులైనా సమాజం నుంచి గౌరవ మర్యాదలను సంపాదించుకోలేరు.వాగ్ధాటికి, వాచాలతకు ఉన్న విభజనరేఖను తెలుసుకుంటే చాలు– మాటలాడే కళలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంత చిన్న సంగతి తెలుసుకోలేకపోవడం వల్లనే ప్రజాజీవితంలో ఉన్న నానా రంగాల ప్రముఖులు అనవసర ప్రసంగాలతో, అసందర్భ ప్రలాపాలతో అభాసుపాలవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచుగా తారసిల్లుతున్నాయి. ఇదొక పరిస్థితి అయితే, వాగ్దూషణా దురితచరితుల సంఖ్య కూడా సమాజంలో పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా రాజకీయ, వినోదరంగాల్లో వాక్కాలుష్యం దుర్భరంగా మారి, సామాన్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వాక్కాలుష్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇటీవల వస్తున్న సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఓటీటీ ప్రదర్శనలు చూస్తే, ఇట్టే అర్థమైపోతుంది.‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు/ ఇన్ని మాటలు’ అన్నారు వేటూరి. నడమంత్రపు సిరివర్గం, మిథ్యామేధావి వర్గంలోని మనుషుల వల్లనే సమాజంలో వాక్కాలుష్యం ప్రబలుతోంది. పర్యావరణంలోని నానా రకాల కాలుష్యాల నివారణ కోసం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయితే, వాక్కాలుష్య నివారణ చర్యలు తీసుకునే నాథులే కరవయ్యారు. వాక్కాలుష్య నివారణతోనే వాగ్భూషణానికి పునర్వైభవం సాధ్యం. -
ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్‌గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్మోహన్రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్‌బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్‌పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్మోహన్రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్‌బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్‌బుక్ స్థానాన్ని రెడ్‌బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్మోహన్రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్మోహన్రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్‌రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్మోహన్రెడ్డి మరో బలమైన మాస్ లీడర్‌గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్‌ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
ఉదారతకు ట్రంప్ వీడ్కోలు!
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్‌లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్‌కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు. దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్‌కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యా లయం వెబ్సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే. అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం. 2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది. అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది. అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు. సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా? -
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్‌కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్‌లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్‌లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్‌ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్‌ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్‌పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్‌లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్‌కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్‌లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
జనం ప్రాణాలంటే విలువేది?
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి? తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్‌ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్‌కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు. ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్‌ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు. మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు. -
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్‌ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్‌లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్‌తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్‌లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్‌లోని బ్లెచ్లీ పార్క్‌లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్‌ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్‌షిప్‌గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్‌షిప్‌గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్‌కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్‌లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్‌లో బీరేన్‌సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్‌భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్‌ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్‌ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్‌లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం. -
చెదిరిన డాలర్ డ్రీమ్స్
అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో శాన్ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. గడచిన బైడెన్ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్ ముందున్న మార్గం. పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్‌కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్‌తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం. నిజానికి, మెక్సికో, ఎల్సాల్వడార్ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్ (30 మంది), హరియాణా (33), గుజరాత్ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్‌లోనూ వంద మంది పంజాబ్‌కు తిరిగొచ్చారు. 2023 అక్టోబర్ నుంచి నిరుడు సెప్టెంబర్ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్డ్రీవ్స్ు కథలు కంచికి చేరవు! -
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే. అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది. ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ. సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే! -
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్‌కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్‌లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్‌తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్‌పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్‌ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్‌ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్‌లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్‌తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్‌యాన్‌లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్‌లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ప్రయోగాత్మక పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్‌లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్‌ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్‌లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్ ఉలేమా ఇ–హింద్ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్‌లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. ఇలా ఉత్తరాఖండ్ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం. -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్‌లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్‌తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్‌లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్‌లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్‌లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్‌లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్‌సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్‌కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్‌లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది! -
అప్పారావు చిటికెల పందిరి!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్ పీరియడ్’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్ సిక్స్’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్ సిక్స్’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్‌ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్ సిక్స్’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.ఎకనామిక్స్ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్ తీసుకున్నారు. పవర్ పాయింట్ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 2047 నాటికి డాలర్ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్‌ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్ జ్యోతిషం తెలుసు.ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్‌గా మారింది. ‘‘ఇన్ ద లాంగ్ రన్ వి ఆర్ ఆల్ డెడ్’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్ మార్కెట్ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్ వేసిన సెటైర్‌గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్‌కు బాగా నప్పుతుంది.చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్‌లో లిక్కర్ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్ జగన్ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్‌లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్’లనూ బాబు సర్కార్ ఆశ్రయిస్తున్నది.ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్మోహన్రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఉద్యోగులకు తీపి కబురు
ఏడాదిగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం సాకారం కాబోతోంది. ఆ సంఘం రూపురేఖలూ, దాని గడువు, మార్గదర్శకాలు వగైరా వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా తమ జీతభత్యాలు పెరగబోతున్నాయన్న కబురు సహజంగానే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు కొంచెం అటూ ఇటూగా రాష్ట్రాల్లో వేతన సవరణ సంఘాలు కూడా సిఫార్సులు చేస్తాయి గనుక రాష్ట్రప్రభుత్వాల సిబ్బందికి సైతం ఇది సంతోషించే సందర్భమే. పదేళ్లకోసారి నియమించే వేతన సంఘాల గురించిన ప్రకటన లెప్పుడూ లోక్‌సభ ఎన్నికల ముందు వెలువడటం రివాజు. అందుకే నిరుడంతా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ప్రకటన వెలువడింది. మరో మూడు వారాల్లోఅసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీలో గణనీయంగావున్న కేంద్ర సిబ్బంది ఓటుబ్యాంకునుదృష్టిలో ఉంచుకునే తాజా ప్రకటన వెలువడిందన్న విమర్శలు లేకపోలేదు. మన దేశంలో ప్రభుత్వో ద్యోగులు సంఘటిత శక్తి, పటిష్ఠమైన ఓటుబ్యాంకు కూడా! కనుక వారిని నిరాశపరచాలని ఏ ప్రభు త్వమూ చూడదు. ఇందుకు ఒకే మినహాయింపు వుంది. 2003లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీయే సర్కారు వేతన సంఘం డిమాండ్‌ను తిరస్కరించింది. అటు తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం 2005లో వేతన సంఘం ఏర్పాటు చేసి, ఆ మరుసటి ఏడాది జనవరి 1 నుంచి దాని సిఫార్సులు అమలుచేయటం మొదలుపెట్టింది. అంతేకాదు... 2013లో ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. దేశంలో రక్షణ, రైల్వే విభాగాల సిబ్బందిని కూడా కలుపుకొంటే 49 లక్షల మందికి పైగా కేంద్రప్రభుత్వోద్యోగులున్నారు. వీరుగాక పింఛన్ అందుకునే 65 లక్షల మంది రిటైర్డ్ సిబ్బంది ఉన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలనూ, ప్రభుత్వరంగ సిబ్బందికి ఇచ్చే బోనస్‌నూ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది. అలాగే పింఛన్‌దార్లకు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం, కరువుభత్యం కూడా నిర్ణయిస్తుంది. అది చేసే సిఫార్సులను యథాతథంగా ఆమోదించటం లేదా ఉద్యోగుల కోర్కె మేరకు దాన్ని మరింత పెంచటం, తనకున్న వనరులను దృష్టిలో ఉంచుకుని ఆ సిఫార్సులకు కోతపెట్టడం కేంద్రం చేసే పని.కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది.కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవటంగతంతో పోలిస్తే పెరిగింది. ఏతావాతా, రిటైరవుతున్న సిబ్బంది స్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు బాగా తగ్గాయి. ఆరో వేతన సంఘం ఏర్పాటు సమయానికి దేశంలో 55 లక్షలమంది కేంద్రసిబ్బంది ఉన్నారని అంచనా వేశారు. ఇప్పుడు నిండా 50 లక్షల మంది కూడా లేరు. మరో మాటలో – సర్వీసులో ఉన్న సిబ్బంది కన్నా పింఛన్దార్లే ఎక్కువున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో సంపూర్ణంగా కంప్యూటరీకరణ జరగటంతోపాటు ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చింది కనుక మును పటితో పోలిస్తే ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండకపోవచ్చన్న వాదనలో నిజముంది. కానీ మనతో పోలిస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ప్రతి లక్షమంది పౌరులకూ దాదాపు ఏడువేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో అది 1,500 మించదు. అమెరికాలో తమ ఏలుబడి మొదలయ్యాక ప్రభుత్వ సిబ్బంది సంఖ్యలో భారీగా కోత పెడతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ బాహాటంగానే చెప్పారు. ఫలితాలొచ్చిన వారం రోజు ల్లోపునే ప్రభుత్వ సామర్థ్య విభాగం పేరిట వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌లతో ఆయన ఒక కమిటీని కూడా నియమించారు. తాము విడివిడిగా ఉరిశిక్షలు వేయబోమని, ఒకేసారి ఊచకోతఉంటుందని వివేక్ రామస్వామి చమత్కరించారు కూడా! కనుక అక్కడ కూడా ప్రభుత్వ సిబ్బంది తగ్గుతారు. చాలా యూరప్ దేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోతపెట్టే ప్రయత్నాలు చేయటం, దాన్ని ఉద్యోగులు ప్రతిఘటించటం కనబడుతూనే ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి చేర్చటంలో ప్రభుత్వ సిబ్బంది పాత్ర కీలకమైనది. గతంతో పోలిస్తే కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చి ఉండొచ్చుగానీ అందుకు తగ్గట్టే సూక్ష్మస్థాయివివరాల సేకరణ పెరిగింది గనుకా, రిటైరవుతున్నవారి స్థానంలో కొత్త నియామకాలు లేవు గనుకా వారి పని భారం పెరిగింది. పని మీద శ్రద్ధలేనివారూ, అవినీతికి పాల్పడేవారూ అన్నిచోట్లాఉంటారు. వారి వల్ల సహజంగానే అందరికీ చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వోద్యోగులపైనా అలాంటి నింద ఉంది. ఉద్యోగ భద్రత వరకూ చూస్తే ప్రైవేటు రంగంలో కన్నా ప్రభుత్వరంగంలో అది ఎక్కువ. ఒకసారంటూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చీకూచింతా ఉండబోదని అనుకుంటారు గనుకేఅందుకోసం చాలామంది అర్రులు చాస్తారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నందున వేతనాలు పెంచాలన్న ప్రభుత్వ సిబ్బంది డిమాండ్‌కు ప్రభుత్వాలు తలొగ్గక తప్పడం లేదు. కొన్ని లోటుపాట్లున్నా ప్రభుత్వోద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడుతున్నాయి. నిర్ణీత కాలంలో జీతభత్యాలు పెంచుతున్నాయి. కానీ వారితో పోలిస్తే ఎంతో ఎక్కువున్న ప్రైవేటురంగ సిబ్బందినీ, రెక్కాడితే గానీ డొక్కాడని అసంఘటిత రంగ కార్మికులనూ, వారి సంక్షేమాన్నీ విస్మరిస్తున్నాయి. పాశ్చాత్యదేశాల్లో ఇంత చేటు అసమానతలుండవు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్నిఆశించే పాలకులు ఈ రంగాల పట్ల తాము ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ అసమానతల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. -
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్‌లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్‌లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్‌బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్‌ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్‌కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్‌టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
క్షమార్హం కాని నేరం!
కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్‌గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్లైన్లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్‌లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్‌తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్‌తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
గౌరవం నిలపాలి!
తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది. -
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్‌ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్‌లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
సురక్షిత డిజిటల్ ప్రపంచం కోసం!
కాలం మారుతున్నకొద్దీ, సాంకేతికతలు విస్తరిస్తున్నకొద్దీ కొత్త భయాలు పుట్టుకొస్తాయి. తమ పిల్లలు సోషల్ మీడియా వ్యామోహంవల్ల చెడిపోతున్నారని కొన్నాళ్లుగా తల్లిదండ్రుల్లో బెంగ పట్టు కుంది. అక్కడ తారసపడే విశృంఖల పోకడలు, తప్పుడు భావాలు పిల్లల మెదళ్లపై దుష్ప్రభావం కలగ జేస్తున్నాయి. వారి బాల్య, కౌమార దశలను కొల్లగొడుతున్నాయి. పిల్లలకు మాదకద్రవ్యాలు అల వాటు చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కాదనలేనిది. నిజానికి సోషల్ మీడియా దుర్వ్యసనంగా మారిన వైనమూ, దాని పర్యవసానాలూ చెదురుమదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త తలనొప్పులు సహజమే. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవటానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్రం రూపొందించింది. అభ్యంతరాలు, సూచనలు వచ్చే నెల 18లోగా తెలియజేయాలని కోరింది.డేటా పరిరక్షణ కోసం, వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఒక చట్టం అవసరమన్న సంగతిని మన పాలకులు గ్రహించటంలో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంది. పౌరుల వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలతో సహా సమస్త వివరాలనూ సేకరించే ఆధార్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏడెనిమిదేళ్ల వరకూ ఆ డేటా పరిరక్షణకు ఎలాంటి కట్టుదిట్టాలు అవసరమన్నది ఎవరికీ తట్టలేదు. 2017లో జస్టిస్ పుట్టస్వామి పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను తొలిసారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మరో ఆరేళ్ల తర్వాత 2023 ఆగస్టులో డీపీడీపీ చట్టం వచ్చింది. దాని అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మళ్లీ ఇన్ని నెలలు పట్టింది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వర్త మానంలో ఈ అంశంపై ఇప్పటికైనా ముసాయిదా నిబంధనలు రావటం హర్షించదగ్గది. ప్రస్తుతం ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని వాతావరణంలో ప్రపంచం మనుగడ సాగిస్తోంది. గోడలకు చెవులుంటాయన్నది పాత సామెత. స్మార్ట్ ఫోన్లకు చెవులే కాదు... కళ్లు కూడా ఉంటున్నాయి. మనం పక్కవారితో సాగించే పిచ్చాపాటీని సైతం వినే సదుపాయం ఆ ఫోన్లలో ఉంటున్నదని, మన ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వాటి ఆధారంగా డేటా రూపొంది క్షణాల్లో ఎవరెవరికో చేరిపోవటం రివాజైందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు వినియోగించనప్పుడు సైతం వాటి కెమెరాలు కళ్లు తెరిచే సాంకేతికత ఉన్నదంటున్నారు. ఇలాంటి ఫోన్లు తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఎంత చేటు తీసుకురాగలవో ఊహించటానికి కూడా భయం వేస్తుంది. అందువల్లే ఎప్పుడెప్పుడు తగిన నిబంధనలు వస్తాయా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమ డేటా, బ్యాంకు ఖాతాల సమాచారం బయటకెలా పోతున్నదో తెలియక పెద్దలు కంగారు పడుతుంటే సామాజిక మాధ్యమాల్లో దుండగుల బారినపడి పిల్లలు తల్లడిల్లు తున్నారు. వినియోగదారుల డేటా సేకరణలో పారదర్శకతనూ, ఎందుకోసం సేకరిస్తున్నారో వెల్ల డించటాన్నీ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒకవేళ సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్యవల్ల డేటా లీకైతే ఫిర్యాదు చేయటానికి కూడా ఏర్పాట్లున్నాయి. అలాగే సంస్థల్లో డేటా సేకర ణకు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేయటానికి, వివరణ కోరటానికి అవకాశం ఉంది. నిబంధనల అమలును పర్యవేక్షించటానికి ప్రభుత్వం డేటా పరిరక్షణ బోర్డు (డీపీబీ) ఏర్పాటు చేస్తుంది. ఇదిగాక ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు, వినియోగదారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించు కోవటం, నిఘా పెట్టడం తప్పనిసరవుతుంది. డేటా లీక్‌ను అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. మొత్తంగా మనం పౌరుల డేటా పరిరక్షణలో వెనకబడినట్టే, సామాజిక మాధ్యమాల దుష్ప్ర భావాల నుంచి పిల్లల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న విషయంలోనూ వెనకబడ్డాం. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 137 దేశాలు చాన్నాళ్ల క్రితమే డేటా పరిరక్షణ చట్టాలు తెచ్చాయి. అమెరికాలో పదమూడేళ్లలోపు పిల్లలు ఆన్లైన్ వీక్షణపై కఠిన నిబంధనలున్నాయి. యూరప్‌లో పదహారేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాల్లో పదహారేళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఇటీవలే పూర్తి నిషేధం విధించింది. మన దేశంలో లేదుగానీ... టిక్‌టాక్ వల్ల విదేశాల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. టీనేజ్ పిల్లల్లో 58 శాతంమంది దాన్ని చూస్తు న్నారని ఒక సర్వే చెబుతోంది. పసిహృదయాలకు ఉండాల్సిన అమాయకత్వం మాయమై అవాంఛ నీయ పోకడలు ప్రవేశించి వారిలో విషబీజాలు నాటుతున్నాయి. తప్పుడు భావాలూ, అభిప్రా యాలూ వ్యాపిస్తున్నాయి. పిల్లల సంగతలావుంచి... పెద్దలే వాటి మాయలో పడి తప్పుడు నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా కలిగే నష్టం నేరుగా కనబడుతుంది. కానీ మానసికంగా అది కలగజేసే ప్రభావం లెక్కకు అందనిది. ఇప్పుడు ఏఐ సైతం వచ్చి ప్రమాద తీవ్రతను పెంచింది. పిల్లల ముచ్చట కాదనకూడదని కార్లు, టూ వీలర్లు అందించి కొందరు తల్లిదండ్రులు పరోక్షంగా వారి చావుకు కారణమవుతున్నారు. ప్రజలకు ముప్పు కలిగిస్తున్నారు. అందువల్ల సామాజిక మాధ్య మాల్లో పొంచి వుండే ప్రమాదాలపై ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లల సంరక్షణకు ఇది తప్పనిసరి. -
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
ట్రంప్ శిబిరంలో వీసా చిచ్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్‌కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే. తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు. వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ మిల్లర్‌తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు. ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు. వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు. దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు. అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్‌కు సహకరిస్తాయన్నది ప్రశ్న. సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్‌తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్‌ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్‌ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు. -
మణిపూర్ చల్లారుతుందా?
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్‌లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం. 2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్‌లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు. మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్‌లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి. భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు. బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. -
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్‌లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్‌లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్‌గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్‌ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్‌లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్‌డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్‌డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్‌డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్‌డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్‌లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్‌కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్‌లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్‌పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్‌పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్‌ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్‌పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్‌పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్‌పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్‌సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్‌పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్‌ను కూడా తీసుకెళ్లి వాజ్‌పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దేశం మరువలేని దార్శనికుడు
చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్‌కు సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. యూజీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది. మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్‌తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు. అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్‌నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి. మన రహస్యాలను ఐఎంఎఫ్‌కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్‌ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు. ఆ సుగుణాలే మన్మోహన్‌ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది. ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్‌ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్‌లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్‌లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
హసీనా అప్పగింత సాధ్యమేనా?
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు. చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు. మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు. కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు. బ్రిటన్‌తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి. అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్‌తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు. 30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి. -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్‌ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్‌కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్‌కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్‌ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్‌లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్‌ను వెంటబెట్టుకుని దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్‌కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్‌ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్‌చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్‌లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
మైత్రీబంధంలో శుభ పరిణామం
ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్‌ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్‌ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్‌తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్‌కు శ్రీలంక కీలకం. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే! -
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ!
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే... ఎవరి నామ స్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు. కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు! పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదిరించే శక్తి ప్రజలకే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా జనం మీద వరసగా పిడుగుల్ని కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే, ఏపీలో ఉన్న బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్‌కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో! జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రయిక్గానే చాలామంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.కార్పెట్ బాంబింగ్పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన ‘విజన్–2020’కి కొనసాగింపే ‘స్వర్ణాంధ్ర–2047’. అంతేకాకుండా గతేడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్– 2047’ పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం! ఆర్థికవృద్ధి లెక్కల్లో కనిపించింది. బహుళ అంతస్థుల భవంతుల్లో కనిపించింది. పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సంద ర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులూ, చేతివృత్తిదారుల బలవన్మరణాలకు సాక్షి సంత కాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది.భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతివృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిష్ హయాంతో పోల్చినా కూడా ‘విజన్–2020’ తొలి ఐదారు సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయా లను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు, సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్ఢిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ – ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్నే ‘సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్’ అంటారు. దీని కారణంగా గడచిన మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోయాయి. ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వ యిజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్టయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత పదిహేనేళ్లుగా పెరుగుతూనే ఉన్నది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపైన చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతున్నది. ఈ ధోరణి వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి పోతుందనీ, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందనీ ఆయన చెప్పారు. ఈ ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలి తాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్‌ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం.చంద్రబాబు కొత్తగా ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర–2047’ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. రెండు మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరేసరి! రైతుల ఆదాయాలు పెంచుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామని కూడా చెప్పారు. ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి, 2047 నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యు మెంట్లోని గొప్పలు సాధ్యం కావు.పేదవర్గాల ప్రజలు నూటికి నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించగల విద్యావిధానానికి తాను వ్యతిరేకం కనుకనే అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని, మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలుచేసిన ‘రైతు భరోసా’ను ఎగరగొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసే లేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నా లజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్ధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు.‘నేను ’95 మోడల్ చంద్రబాబున’ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్! పారిశ్రామికవేత్తలకూ, పెట్టుబడిదారులకూ వనరులన్నీ కట్టబెట్టాలి. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) అనే మూడు సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగు తున్నకొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి ఒకటి రెండు విషయాల్లో కొద్దిగా మినహాయింపులు ఇచ్చారు. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలుచేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు. ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంత ర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చుపెట్టరు. ‘స్వర్ణాంధ్ర–2047’ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇకముందు అన్ని రంగాలకూ విస్తరించ నున్నది.రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్!ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో మూడింట రెండొంతుల మేరకు పూర్తి చేయగలిగారు. ఇంకా ఒక వంతు మిగిలే ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారెంటీలన్నీ గ్యారెంటీగా అటకెక్కినట్టే! పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లయితేనేమీ, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లయితేనేమి 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్లపై చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్. ఇది కాకతాళీయమో, వ్యూహాత్మకమో తెలియదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది.నిన్నటి అల్లు అర్జున్ అరెస్ట్ సంగతే చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారుండరు. ఖండించని వారుండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాయెకిన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, అదీ బెయిల్ దొరక్కుండా వారాంతంలో చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పుచేసి దొరికి పోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకెళ్లిన సంద ర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నద నేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్నా నిర్ధారణ కాలేదు. ఎందుకని అంతగా టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్‌కు సానుభూతి మాత్రం పెరిగింది.చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే! సెలబ్రిటీలు అయినంతమాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పనిని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకొనిపోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావలసి వచ్చింది. అందుకు బయ టకు కనబడే కారణాలైతే ఏవీ కనిపించడం లేదు. ఉంటేగింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు గానీ, ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండ వచ్చు.ఆ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో ‘హైడ్రా’ను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది. ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వది లేయడం ప్రశ్నార్థకంగా మారింది. ‘హైడ్రా’ భయంతో హైద రాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చలామణీ మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూము లమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాధుడు కనిపించక అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే! ఇకముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే! కానీ, ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకూ, ప్రభుత్వంపై నెగెటివ్ ఇమేజ్‌కూ కారణమైంది. ఇటు వంటి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఏడాది కాలంలో ఒక డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని, చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ప్రభుత్వానికీ, ప్రజలకూ క్షేమకరం!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాతికి గర్వకారణం
పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్‌కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్. కానీ, సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం. నిజానికి, ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్‌ల ఈ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు. మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్‌తో ప్రతి గేమ్‌లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు. 14 గేమ్‌ల మ్యాచ్‌లో 13 గేమ్‌లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు. 2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్‌కూ, మ్యాగ్నస్ కార్ల్సెన్కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన కార్ల్సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్‌గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్‌ప్రూఫ్ గ్లాస్ బూత్‌లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్సెన్లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు. గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్‌ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్‌లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్‌కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
అసమ్మతి... అనైక్యత...
ఆరు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్‌దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్‌ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.నిజానికి, ఈ ఏటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.కాంగ్రెస్‌కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే! -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్‌టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
లెక్కలు, చిక్కులు
లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు. ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు. మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం. ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం. పెరిగిన జనాభాను బట్టి లోక్ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది. మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే, అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం. పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు. యూరప్ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది. అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు. విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్ అనుభవాన్ని గమనించిన థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి! -
సీజ్ ద పోర్ట్
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్ వారు ఏం చేస్తున్నారో తెలుసా?ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్‌చేసి ఉన్నాయట! అందులో మన రేషన్ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్ ద షిప్’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ సినిమా అవసరం లేదు. ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్ ద షిప్’ ఓ డైలాగ్ మాత్రమే! సినిమా టైటిల్ ‘సీజ్ ద పోర్ట్’ కావచ్చు!!నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ యాంకరేజి పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్ ద షిప్’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్ వాటర్ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్’ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారు. డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్సెన్స్ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా! ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్సెన్స్ ప్రశ్న! భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న. ఒక సాధారణ రైస్ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్సీఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్ ద పోర్ట్’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్‌లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్‌లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్‌తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్‌లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్‌కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్‌ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్‌ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్‌కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్‌ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
సుంకాల బెదిరింపు
పదవీ బాధ్యతలు పూర్తిగా చేపట్టక ముందే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచారు. ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ (అమెరికా ఫస్ట్) మంత్రాన్ని పదే పదే వల్లె వేస్తున్న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూనే చైనా పైనే కాక ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలూ ఆంక్షల పాలయ్యే జాబితాలో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానంలో రానున్న పెనుమార్పుకు ఇది ఓ సూచన అనీ, రానున్న ట్రంప్ పదవీకాలంలో ఈ జాబితా మరింత పెరగడం ఖాయమనీ విశ్లేషణ. దానిపై చర్చోపచర్చలతో వారమైనా గడవక ముందే కాబోయే అగ్రరాజ్యాధినేత మరో బాంబు పేల్చారు. ‘బ్రిక్స్’ దేశాలు గనక అమెరికా డాలర్‌కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’పై చేసిన ఈ తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకూ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకూ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు... ఈ హెచ్చరికే గనక అమలు అయితే, ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన కూటమిగా ముందు బ్రిక్స్ ఏర్పాటైంది. ఆపైన ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్‌లు సైతం ఆ బృందంలో చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ సాగిస్తున్న గుత్తాధిపత్యానికి ముకుతాడు వేయాలనేది కొంతకాలంగా బ్రిక్స్ దేశాల్లో కొన్నిటి అభిప్రాయం. డాలర్‌ను రాజకీయ అస్త్రంగా వాడకుండా నిరోధించగల ప్రత్యామ్నాయ అంతర్జాతీయ చెల్లింపుల విధానం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్‌లో ప్రస్తావించడం గమనార్హం. బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే, డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసానాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100 శాతం సుంకం వేస్తే, సరుకుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి. నిజానికి, విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి, అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ తాజా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునఃప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడీ సుంకాల పర్వం మొదలైతే, అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించవచ్చు కానీ, వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యావసాయిక ఉత్పత్తులు సహా రోజు వారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందు వల్ల అమెరికా వ్యాపార సంస్థలు చేసుకొనే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీపడలేకపోతాయి. అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్రదేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక, ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌతాఫ్రికా ఆర్థిక వ్యవస్థలూ మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో ఈ తరహా వాణిజ్య వివాదాలు తెలిసినవే. వాటిని నివారించడానికే అమెరికా సైతం అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడీ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలూ తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీమ్ చెబుతున్నా, ఆశించిన ఫలితాలు దేవుడెరుగు... ఉద్రిక్తతలు పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది. ఈ ప్రతిపాదిత సుంకాలను బూచిగా చూపి, బ్రిక్స్ సహా ఇతర దేశాలనూ చర్చలకు రప్పించడమే అమెరికా ధ్యేయమైతే ఫరవా లేదు. అలా కాని పక్షంలో అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ అన్వేషణను ముమ్మరం చేయవచ్చు. ట్రంప్ కఠిన వైఖరితో వర్ధమాన దేశాలు, అలాగే బ్రిక్ సభ్యదేశాలు మరింత దగ్గరవుతాయి. అది చివరకు అగ్రరాజ్యానికే నష్టం. అయితే, ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే తాను అనుకున్నదే చేయడం ట్రంప్ నైజం. పర్యావరణం, వాణిజ్యం, సైనిక దండయాత్రలపై గతంలో ఆయన చేసిందదే. తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగుంటుంది. వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు దీర్ఘకాలిక పర్యవసానాల్ని ఆలోచించకపోతే కష్టమే. అమెరికా కొత్త ప్రెసిడెంట్ అది గ్రహించి, ఆచితూచి వ్యవహరించాలి. కానీ, ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకే పేరుబడ్డ ట్రంప్ నుంచి అంతటి ఆలోచన ఆశించగలమా అన్నది ప్రశ్న. అనాలోచితంగా వ్యవహరిస్తే, అది అమెరికాకే కాదు... యావత్ ప్రపంచానికీ తంటా! -
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్‌ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్‌పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్‌ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్‌కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్‌రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్‌ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్‌లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్‌ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్‌కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్‌కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్‌కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్‌కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్‌ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్‌పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
సాధించినదేమిటి?
పర్యావరణ మార్పుల రీత్యా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ జరిగిన సమావేశం అది. తీరా పన్నెండు రోజుల పైగా చర్చోపచర్చల తర్వాత సాధించినది మాత్రం అతి స్వల్పం. అజర్‌బైజాన్‌లోని బైకూలో తాజాగా ముగిసిన ఐరాస 29వ పర్యావరణ సదస్సు (కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్– కాప్29), అక్కడ చేసిన తూతూమంత్రపు తీర్మానం పట్ల బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశాల మధ్య అభిప్రాయ భేదాలను పోగొట్టి, మధ్యేమార్గ సాధన కోసం నిర్ణీత షెడ్యూల్‌కు మించి అదనంగా మరో రెండు రాత్రుల పాటు బాకూలో సంప్రతింపులను పొడిగించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. చివరకు ఓ ‘దిశానిర్దేశ ప్రణాళిక’ రూపకల్పనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్ళుగా కాలుష్యానికి కారణమవుతూ పురోగమించిన అభివృద్ధి చెందిన దేశాలు అలా చేతులు దులిపేసుకొని హమ్మయ్య అనుకున్నాయి. కాలుష్య బాధిత వర్ధమాన దేశాల్లో సహజంగానే ఇది నిరాశ నింపింది. పర్యావరణ మార్పులతో సతమతమవుతున్న పుడమి యథాపూర్వస్థితిలో ప్రమాదం అంచునే మిగిలిపోయింది. భారత్, నైజీరియా, బొలీవియా వగైరా బృందంతో కూడిన వర్ధమాన దేశాలు తాజా ‘కాప్–29’ సదస్సు పట్ల పెదవి విరుస్తున్నది అందుకే! ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా భూతాపోన్నతిని నియంత్రిస్తూ, పర్యావరణ అనుకూల విధానాలకు మారిపోవాలంటే వర్ధమాన ప్రపంచానికి 2035 నాటికి ఏటా 1.3 లక్షల కోట్ల డాలర్లు అవసరమని స్వతంత్ర నిపుణుల అంచనా. కానీ, విచ్చలవిడి పారిశ్రామికీకరణతో అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తూ, 2035 నాటికి ఏటా కేవలం 300 బిలియన్ డాలర్లు మాత్రం ఇస్తామంటూ ఒప్పందం చేశాయి. అడిగిన మొత్తంలో కేవలం 20 శాతమే అది. ఆ అరకొర నిధులతో, అదీ అపరిమితమైన ఆలస్యంతో ఉపయోగం ఉండదు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న సముద్రమట్టాలు, దరిమిలా ముంచెత్తిన ఆర్థిక భారంతో మునిగిపోతున్న పేద దేశాలు తాజా బాకూ సదస్సులో తీర్మానించిన ఈ రకమైన అరకొర పర్యావరణ నిధి తమ పాలిట మరణ శాసనంగా అభివర్ణిస్తున్నాయి. పైగా, నిధి విషయంలో ధనిక ప్రపంచ ప్రభుత్వాలు బాధ్యతను తమ భుజం మీద వేసుకోకుండా ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ ఋణదాతల మీద ఆధారపడడం మరీ ఘోరం. ఈ అంశాలే ఇప్పుడు రచ్చకు దారి తీస్తున్నాయి. పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన ధనిక దేశాలు బెదిరింపులు, అధికార ప్రదర్శనలతో బాధిత దేశాల మెడలు వంచుతున్నాయి. పస లేని ఒప్పందాలకు తలలూపేలా చేస్తున్నాయి. ఇది చేదు నిజం. బైకూ సదస్సులోనూ అదే జరిగింది. శిలాజ ఇంధన దేశాల ప్రయోజనాల్ని కాపాడేందుకు తెర వెనుక సాగిన లాబీయింగ్, తీర్మానాల్లో ఆఖరి నిమిషంలో సాగిన మార్పులు చేర్పులే అందుకు నిదర్శనం. అభివృద్ధి చెందిన దేశాలు ఇలా తమ నైతిక, చారిత్రక కర్తవ్యాల విషయంలో వెనక ముందులాడుతూ, చివరకు విసురుతున్న చాలీచాలని రొట్టె ముక్కలకే బీద దేశాలు తలలూపాల్సి వస్తోంది. అలాగని కాప్ సదస్సులు వట్టి వృథా అని కొట్టిపారేయలేం. ఎందుకంటే, పర్యావరణ ప్రమాదంపై పేద దేశాలు కనీసం తమ వాణిని అయినా వినిపించడానికి మిగిలింది ఇదొకటే వేదిక. కాదూ... కూడదంటే అసలుకే మోసం వస్తుందనీ, మొత్తం ‘కాప్’ ప్రక్రియే కుప్పకూలుతుందనీ ఈ బీద ప్రపంచపు భయం. మరోపక్క పర్యావరణ సంక్షోభమనేది వట్టి బూటకమని వాదించే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బైకూ ‘కాప్’ సదస్సులో ఇచ్చిన హామీలకు అగ్ర రాజ్యం భవిష్యత్తులో ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మాటకొస్తే అధ్యక్షుడు బైడెన్ హయాంలోనూ పర్యావరణ నిధులకై ప్రభుత్వ అభ్యర్థనల్ని అమెరికన్ కాంగ్రెస్ నెరవేర్చనేలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో, అధ్యక్ష స్థానంలోని అజర్బైజాన్ సహా అనేక ప్రధాన దేశాల అంతంత మాత్రపు ముందస్తు కసరత్తు నడుమ కాప్29 అడుగులు వేసింది. అయినా ఈ సదస్సులో అసలేమీ జరగలేదని అనుకోలేం. ఏటా 100 బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూరు స్తామని సంపన్న దేశాలు గతంలో వాగ్దానం చేశాయి. 2020 నుంచి నిలబెట్టుకోవాల్సిన మాటను ఆలస్యంగా 2022 నుంచి అమలు చేస్తున్నాయి. అదీ 2025తో ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మొత్తాన్ని 2035 నాటికి 300 బిలియన్లకు పెంచడం ఒకింత విజయమే. కాకపోతే, పారదర్శకత లేమి, అందరినీ కలుపుకొనిపోలేకపోవడం తాజా ఒప్పందపు చట్టబద్ధతను తక్కువ చేస్తున్నాయి.అధిక పారిశ్రామికీకరణతో లాభపడ్డ సంపన్న దేశాలు ఏళ్ళ తరబడి మీనమేషాలు లెక్కపెడు తుండడమే పెనుశాపమవుతోంది. అందువల్లే భూతాపోన్నతిని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించ రానివ్వరాదన్న ప్యారిస్ ఒప్పంద లక్ష్యం వట్టి కలగానే మిగిలింది. అసలు ఇదే పద్ధతిలో ముందుకు వెళితే కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కొత్త మాట దేవుడెరుగు... వర్తమాన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నప్పటికీ భూతాపం 2.7 డిగ్రీల మేర పెరుగుతుందట. అది పర్యావరణ సంక్షోభానికి దారి తీస్తుందని ఐరాస హెచ్చరిక. అది చెవికెక్కించుకొని, వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే కాప్30 నాటికైనా సంపన్న దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు సాగించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని, పర్యావరణ న్యాయం వాస్తవమయ్యేలా చూస్తేనే మానవాళికి మేలు జరుగుతుంది. అదే సమయంలో భారత్ సహా వర్ధమాన ప్రపంచం ఈ పర్యావరణ మార్పు సవాలును సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమవైన వ్యూహాలపై దృష్టి పెట్టడం మంచిది. థర్మల్ విద్యుత్‌పై అతిగా ఆధారపడడం లాంటివి మానుకోవడమూ మంచిది. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అవుతుంది. -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి. మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్‌లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం. కేవలం అయిదు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం. కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్‌ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.2023 నవంబర్ – డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది. పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్‌లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే. ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్‌కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు. బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది. -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్‌సెన్స్‌లో అనేక సందేహాలు తలెత్తుతాయి.సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్‌ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్ పొదుపు తప్పు ఎట్లయింది?సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?‘సెకీ’తో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్‌కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!జగన్ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్‌గఢ్ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్కేను బయ టకు పంపించాలనీ డిమాండ్ చేయగలరా?అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్దాన్లోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్‌బీఐ నేరారోపణ చేసింది. ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్‌లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. భారత్‌లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబ్బల్ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్కో ముక్కలను, ట్రాన్స్‌కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.కేజీ బేసిన్లో గ్యాస్ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్‌ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.ఒక్క విద్యుత్రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!
వారి మాటల్లో మారీచ తంత్రం ఉంటుంది... ఓట్ల కోసం బంగారు జింకలమని చెప్పుకున్నారు కదా! చేతలు మరీచికా సదృశాలు... అమలుకాని హామీలు ఎండమావుల్ని తలపించడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్న కూటమి సర్కార్ అనాటమీ ఓ కుతంత్రాన్ని తలపిస్తున్నది. గుండెల్లో గోబెల్స్‌ను పూజిస్తూ జెండాపై ఊసరవెల్లిని ఎగరేసినట్టుగా వారి చర్యల తాత్పర్యం తేటతెల్లం చేస్తున్నది. ఎన్నికల ముందు చేసిన బాసలకూ, ఇప్పుడు మాట్లాడుతున్న భాషకూ పొంతన కుదరడం లేదు. దగా, మోసం, వంచన... మూడు పార్టీల కూటమికి ముచ్చటైన స్ఫూర్తి వాచకాలేమో!గద్దెనెక్కడం వరకే ఈ దగా పర్వం పూర్తి కాలేదు. ప్రజల ప్రశ్నించే హక్కును హైజాక్ చేయడానికి డైవర్షన్ కమెండోలను రంగంలోకి దించుతున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు. రణనీతిని రాక్షసరీతి కమ్మేసింది. అసత్యాలను కూడిక చేసి, హెచ్చ వేసి, ఆపైన అచ్చేసి మెదళ్లను కలుషితం చేస్తున్నారు. వారి పరిపాలనా వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎవరూ మాట్లాడకూడదు. తాము ఎత్తిపోసిన బురదను కడుక్కునే పనికి మాత్రమే ప్రతిపక్షం పరిమితమై ఉండాలి. ఇదీ ఎత్తుగడ!కూటమి సర్కార్ వంచనా శిల్పం ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబడుతున్నది. ప్రజల ప్రాథమిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నది. అసభ్య పోస్టింగ్‌లనే ముద్రవేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ ఝళిపిస్తున్నది. నోళ్లు నొక్కేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తున్నది. సమాచార విప్లవ ఫలితంగా ప్రభవించిన సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. భావప్రకటనా స్వేచ్ఛను సకల జనులకూ అందుబాటులోకి తెచ్చిన యుగమిది. తప్పుడు హామీలిచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా ఇప్పుడు జనం మిన్నకుండిపోవడం లేదు. ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నవి.ఏ నాయకుడు ఎప్పుడేమి మాట్లాడిందీ సాక్ష్యాధారాలతో జనం చేతిలో ఉంటున్నది కనుక ఇప్పుడు పబ్లిక్ ఆడిట్‌ను ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. అబద్ధాల పునాదులపై మొలకెత్తిన రాజకీయ నాయకులను ఈ పబ్లిక్ ఆడిట్ భయ పెడుతున్నది. ఈ భయపెడుతున్న మీడియానే భయపెట్టడానికీ, గొంతునొక్కడానికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. రాజకీయ పోస్టులు పెడుతున్న దాదాపు 700 మందికి గత కొద్దిరోజులుగా పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 176 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 55 మందిని చెప్పాపెట్టకుండా అరెస్ట్‌లు చేసి, స్టేషన్ మార్చి స్టేషన్‌కు తిప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైతే తప్ప చాలా అరెస్టులను చూపనే లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు.అరెస్టయిన, కేసులను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల పోస్టుల్లో అత్యధికం రాజకీయపరమైనవే. నిజమే, అసభ్య పోస్టులు అనే జాడ్యం సోషల్‌మీడియాలో ప్రమాదకరంగా మారింది. ఈ జాడ్యానికి మందు వేయాల్సిందే! కానీ ఈ పేరుతో సర్కార్ తనకు గిట్టని పోస్టులు పెడుతున్నవారిని వేటాడుతున్నది. తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తూ బూతు పోస్టులు పెట్టే వారిపై ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే వేటాడటం దేన్ని సూచిస్తున్నది? రాజకీయ కక్షనే కదా! ఈ కక్ష ఎంత దూరం వెళ్లిందంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్‌పై పెట్టే సెక్షన్లను ఈ యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. టెర్రరిస్టులు, స్మగ్లింగ్, డ్రగ్స్ ముఠాలు వగైరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. పైగా రెండు మూడేళ్ల కిందటి పోస్టులకు కూడా ఈ యేడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ సెక్షన్లను ఆపాదిస్తున్నారు. అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాల తీర్పులున్నప్పటికీ మనవాళ్లు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన శిక్షాస్మృతి ప్రకారం సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగిరీలోకి వస్తాయి. సోషల్‌మీడియాను కూడా సైబర్ నేరాల పరిధిలోకి తీసుకొనిరావడమనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ. రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించే గ్రూపుల్లో అత్యంత ఆర్గనైజ్డ్ గ్రూప్ ‘ఐటీడీపీ’ అనే సంగతి జగమెరిగిన సత్యం. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నదనే సంగతి కూడా తెలిసిందే. అసభ్య పోస్టులు, బెదిరింపు పోస్టులు పెట్టడంలో కూడా ‘ఐటీడీపీ’దే అగ్రస్థానమని విశ్లేషకులు ఎవరైనా చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వెల్లడించారు. తనకు తెలిసినంత వరకూ ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులకూ, బెది రింపులకూ తెగబడలేదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు తన లాంటి తటస్థ రాజకీయ విశ్లేషకులను కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆయన వాపోయారు. తెలుగు దేశం అభిమానులు అర్ధరాత్రి, అపరాత్రి కూడా ఫోన్లు చేసి తిడుతున్నారని ఆరోపించారు. తమకు గిట్టనివారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించకపోతే... ఈ–మెయిళ్ల ద్వారా బూతు పంచాంగాలు పంపించడం ఆ పార్టీ అభిమానులకు రివాజుగా మారింది. ఈ పత్రిక సంపాదకుడు కూడా ఇటువంటి బూతు మెయిళ్ల బాధితుడే!‘ఐటీడీపీ’ వంటి నెంబర్ వన్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గ్రూప్ సభ్యులపై కేసు కూడా పెట్టలేదంటేనే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమవుతున్నది. తమ రాజకీయ ప్రత్యర్థుల పైనా, వారి కుటుంబ సభ్యుల పైనా ఏ తరహా పోస్టులను ఈ గ్రూప్ సభ్యులు పెట్టారో తెలియదా? ఎంతగా వేధించారో తెలియదా? ఈ ఉద్యమకారుల సృజనాత్మకత కూడా చాలా పదునైనది. పేర్లను మార్చుకొని పరకాయ ప్రవేశం చేసి పెట్టిన కామెంట్లతో కల్లోలం సృష్టించడం వారికో హాబీ. వర్రా రవీందర్ రెడ్డి అనే వైసీపీ అభిమాని పేరుతో జగన్ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఓ తెలుగుదేశం అభిమాని పెట్టిన పోస్టులు కూడా అటువంటి కల్లోలాన్నే సృష్టించాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు కాదనీ, మరొకరు పెట్టిన ఫేక్ పోస్ట్ అనీ తేల్చారు. ఆ రంగులు మార్చిన మారీచు డిని కూడా గుర్తించారు.జరిగింది ఇదైతే... తెలుగుదేశం పార్టీ విభాగాలన్నీ కలిసి చేసిన నీచప్రచారం మరొకటి! నిన్న అసెంబ్లీలో కూడా ఈ దుష్ప్రచారపు బాణీనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చు కున్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం మరొకటి కనిపించదు. ‘ఐటీడీపీ’ చేయించిన తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే తందానా అన్నారు. తల్లి మీద, చెల్లి మీద జగన్ నీచమైన ప్రచారం చేయించారని దారుణమైన నిందను మోపారు. ఇది హీనమైన ప్రచార మనీ, మీ పార్టీ వాళ్లే సృష్టించిన పన్నాగమనీ నిజంగానే మీకు తెలియదా బాబు గారూ! మీ సతీమణి భువనేశ్వరమ్మను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడ్చారే! మరి అసెంబ్లీలో ఒక దుష్ప్రచారాన్ని ఉటంకిస్తూ జగన్ తల్లి, చెల్లెలి ప్రస్తావన స్వయంగా మీరే తేవడం సమంజసమేనా?ఎన్నికల్లో గెలవడం కోసమే అలవిగాని హామీలిచ్చామనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. హామీల అమలుకు డబ్బుల్లేవు గానీ ఆలోచనలున్నాయని, ఆలోచనల్లోంచే సంపద సృష్టి జరుగుతుందనీ, అప్పుడు గానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోవనేది ఆయన ప్రసంగంలోని సారాంశం. ఆయన మేధలో ఏయే విత్తనాలను నాటుకున్నారో మనకు తెలియదు. అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేము. ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఆ ఫలాలను పేద వర్గాలకు అందజేయడం జరుగుతుందనే భరోసాతో ఎదురుచూడక తప్పదు. అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని జనం తిరగబడ వచ్చు. అందుకు విరుగుడు మంత్రమే... ఈ గోబెల్స్ నాజీల తరహా విషప్రచారం! ఫాసిస్టు పాలనను తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు!జగన్ ఐదేళ్లపాటు విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని ఐదేళ్లపాటు తెలుగుదేశం నేతలు, యెల్లో మీడియా, ‘ఐటీడీపీ’ బృందాలు నిర్వహించాయి. నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తున్నది. పల్లెపల్లెకూ, గడప గడపకూ ప్రజావైద్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది. ఐదేళ్లలో రెండు లక్షల డెబ్భయ్ మూడువేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలనైందని అనుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటి తలుపు తట్టి, పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడం అరాచక పాలనగానే కనిపించింది. గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసి, పదిహేను వేల మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలేగానీ, పదిహేను వేల పల్లె రాజధానులెందుకని వారికి చిరాకు కలిగి ఉంటుంది.ఏకబిగిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించడం విధ్వంసం కాక మరేమిటి? నాలుగు భారీ ఓడరేవులకు పనులు ప్రారంభించడమేమిటి? పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఎందుకోసం? రైతుల కోసం ఊరూరా ‘ఆర్బీకే’ కేంద్రాలు అవసరమా? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా పునర్విభజించి పాలనా సంస్కరణలకు తెగబడటమేమిటి? అంతకు ముందు పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుగారు ఒక్క జిల్లానైనా కొత్తగా చేర్చారా? అది కదా పొదుపంటే! ...ఇటువంటి అనేకా నేక కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారనే ప్రచారాన్ని కూటమి ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ముఖ్యమంత్రి నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కూడా దానిని కొనసాగించారు. అప్పుల గురించి, అభివృద్ధి గురించి తెలుగు దేశం... యెల్లో మీడియా కూటమి చేసిన అరోపణలకు ఇప్పటికి కొన్ని డజన్ల పర్యాయాలు అధికారిక గణాంకాల ఉటంకింపులతో వైసీపీ వాళ్లు ధీటైన సమాధానాలు చెప్పారు. మొన్నటి బడ్జెట్ తర్వాత రెండు గంటల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి జగన్ మోహన్‌రెడ్డి కూటమి వాదనను పూర్వపక్షం చేశారు. అయినా సరే చంద్రబాబు నిన్న అదే పాటను మళ్లీ పాడారు. పాడిన పాటే పాడటంపై తెలుగులో మనకు చాలా సామెతలున్నాయి!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్‌ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్‌లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్‌కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్‌గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్‌పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్‌లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్‌తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
సాహిత్య సందడి
సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్ మీట్ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్ ఫెస్టివల్స్ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్ ఫోకస్ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్ పురస్కార ప్రకటన. అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్ ఏసియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ‘ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్’ జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్ కోసం ఐదు నవలల షార్ట్ లిస్ట్ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.పురస్కార ప్రకటన నవంబర్ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ ప్రకటించింది. విజేతలను డిసెంబర్ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆరవ ఎడిషన్ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్ కపూర్, సల్మాన్ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.ఇక, ‘ముంబయి లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్’ను ఫోకస్ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.‘ద మెటమార్ఫసిస్’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్ అమెరికా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్ రిక్రియేషన్ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్ ఝా, సుజయ్ ఘోష్, హుస్సేన్ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్ ఫెయిర్’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
ఆగని ఆగడాలు
ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నిసార్లు నిరసన తెలిపినా భారత్‌కూ, భారతీయులకూ వ్యతిరేకంగా కెనడాలో ఆగడాలు ఆగడం లేదు. ఈ ఉత్తర అమెరికా దేశంలో ఆదివారం జరిగిన సంఘటనలు అందుకు తాజా నిదర్శనం. టొరంటోకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయం వద్ద పసుపుపచ్చ ఖలిస్తానీ జెండాలు ధరించిన మూకలు హిందూ భక్తులతో, భారతదేశ జెండాలు ధరించినవారితో ఘర్షణకు దిగి, దాడి చేసిన ఘటన ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. భారత దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. మన ప్రధాని, విదేశాంగ మంత్రి తమ నిరసనను కటువుగానే తెలిపారు. ఖలిస్తానీ మద్దతుదారులైన 25 మంది ఎంపీల అండతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఘటన ఖండించాల్సి వచ్చింది. అయితే, సాక్షాత్తూ ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఇదంతా ఖలిస్తానీ తీవ్రవాదుల పని అనీ, వారు లక్ష్మణ రేఖ దాటారనీ పేర్కొనడంతో సమస్యకు మూలకారణం సర్కారు వారి సొంత వైఖరిలోనే ఉందని కుండబద్దలు కొట్టినట్టయింది. సీనియర్ సిటిజన్లయిన భారతీయ, కెనడియన్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్థానిక హిందూ సభ మందిరంతో కలసి భారత అధికారులు దౌత్య శిబిరం నిర్వహించిన సందర్భంలో తాజా ఘటనలు జరిగాయి. ఇది మరీ దుస్సహం. అటు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం, ఇటు సర్రీ లోని లక్ష్మీనారాయణ ఆలయం వద్ద జరిగిన ఘర్షణల్ని చెదురుమదురు ఘటనలు అనుకోలేం. భారత, హిందూ ధర్మ వ్యతిరేక ధోరణితో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు కొన్నేళ్ళుగా దౌర్జన్యాలకు దిగుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. భారత్‌కు వ్యతి రేకంగా, ఖలిస్తాన్‌కు అనుకూలంగా మందిరాల వద్ద గోడలపై రాతలు రాస్తున్న వైనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెనడాతో భారత్ తన నిరసన తెలిపి, అక్కడి భారతీయులు, ఖలిస్తానీ అనుకూలే తరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం కనిపించట్లేదు. ట్రూడో సర్కార్ చిత్తశుద్ధి లేమికి ఇది అద్దం పడుతోంది. కెనడాలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతధర్మాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కుందని ఆ దేశ ప్రధాని పైకి అంటున్నారు. కానీ లోలోపల సర్కారీఅండ చూసుకొనే ఆ దేశంలో మందిరాలపై ఖలిస్తానీ దాడులు పెరుగుతున్నాయనేది చేదు నిజం. కెనడాలోని పరిణామాలు ఇతరులకేమో కానీ, భారత్‌కు మాత్రం ఆశ్చర్యకరమేమీ కాదు. నిజం చెప్పాలంటే కొంతకాలంగా, మరీ ముఖ్యంగా గడచిన నాలుగేళ్ళుగా వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఒక కేంద్రంగా తయారైంది. భారత వ్యతిరేకులైన ఈ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడమే కాక, వారికి రక్షణగా నిలుస్తోంది. భారత్‌లో హింస, భయాందోళనల్ని వ్యాపింపజేస్తూ, ఆయుధాలు అందిస్తున్నట్టుగా వీరిలో చాలామందిపై భారత అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు. అయినా సరే, డిజిటల్ మీడియా సహా వివిధ వేదికలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ, భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నవారిని కెనడా ప్రభుత్వం ఇంటి అల్లుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. నిజానికి, భారత ప్రభుత్వం కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు ఏడుగురి పేర్లను గత ఏడాదే కెనడాకు అందజేసింది. జస్టిన్ ట్రూడో సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. వీటన్నిటి పర్యవసానమే... ఇప్పుడు కెనడాలో హిందువులపై జరుగుతున్న దాడులు. అల్లరి మూకలకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే ఇలాంటి హింసాత్మక ఘటనలకు కెనడా నెలవుగా మారిందని ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లమైంది. హిందువులందరూ భారత్‌కు తిరిగి వెళ్ళిపోవాలని ఖలిస్తానీ గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ గత ఏడాది బాహాటంగానే హెచ్చరించారు. మొన్నటికి మొన్న దీపావళి జరుపుకోరాదనీ బెదిరించారు. బ్రాంప్టన్, వాంకూవర్లలో ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యో దంతాన్ని ఉత్సవంలా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ట్రూడో సర్కార్ మాటలకే తప్ప చేతలకు దిగలేదు. ఆగడాలను ఆపే ప్రయత్నం చేయనే లేదు. తాజా ఘటనల్లో ఖలిస్తానీ అల్లరి మూకలను ఆపే బదులు కెనడా స్థానిక పోలీసులు మౌనంగా చూస్తూ నిల్చొని, బాధిత హిందూ భక్తులపైనే విరుచుకుపడడం విడ్డూరం. కొందరు పోలీసు ఉద్యోగులు సాధారణ దుస్తుల్లో ఖలిస్తానీ జెండాలతో తిరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రక్షకభటులు ఓ వర్గానికి కొమ్ముకాయడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఇది భారతీయ కెనడియన్ల భద్రతపై ఆందోళన రేపే అంశం. ట్రూడో అధికారంలోకి వచ్చాక భారత, కెనడా సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నా యనేది బహిరంగ రహస్యం. గత ఏడాది కాలంగా సాక్ష్యాధారాలు చూపకుండా భారత్‌పై కెనడా ఆరోపణలు, మన దేశ ప్రతి విమర్శలు, మొన్న అక్టోబర్‌లో దౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ దాకా అనేక పరిణామాలు సంభవించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపడం చివరకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంతగా దెబ్బతినడానికి కారణమవుతోంది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దాని మాటున తీవ్రవాదుల ఇష్టారాజ్యం సాగనిద్దామనే ధోరణి సరైనది కాదు. ఈ వైఖరి పోనుపోనూ భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలకే కాదు... చివరకు భవిష్యత్తులో కెనడా సొంత మనుగడకే ముప్పు తేవచ్చు. పాలు పోసి పెంచిన పాము మన ప్రత్యర్థిని మాత్రమే కాటు వేస్తుందనుకోవడం పిచ్చి భ్రమ. ట్రూడో సర్కార్ ఆ సంగతి ఇప్పటికైనా తెలుసుకొంటే మంచిది. -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్‌కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్‌ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్‌లలో విజయం మనదే. కివీస్‌పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్‌లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్‌తో బెంగుళూరు టెస్ట్‌లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్‌లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్‌లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్‌లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్‌లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్‌పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్‌గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్‌లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్‌కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్‌లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్‌తో సిరీస్‌లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్‌లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్‌మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్‌ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
ఒక ముందడుగు!
నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.2020 జూన్‌లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం. నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, దెమ్ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం. అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్‌ల మధ్య సిక్కిమ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎల్ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి. భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్‌వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్‌కు అందించే అతి పెద్ద వనరు చైనాయే. గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్‌లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే. ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్‌లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం. -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్‌లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్‌తేరస్‌కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
గురి తప్పిన బాణం వెనుక..!
గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.ఈ సంకల్పానికి కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. ‘ఫోర్బ్స్’ మేగజైన్ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్ టెన్‌లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టి జగన్ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్‌కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్ టీడీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్‌ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్ మోహన్‌రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్ మోహన్‌రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్ పవర్‌ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్ వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్ మోహన్‌రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్‌లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్‌కు మారింది. జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. మార్కెట్‌ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్ వైఎస్సార్ పంపకం చేశారు. భారతి సిమెంట్స్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ జగన్ మోహన్‌రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్‌కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్ రాశారు. అప్పుడు వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్ ఔన్నత్యం మరింత పెరిగింది.క్విడ్ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్ఓయూ (అన్‌రిజిస్టర్డ్)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్ మోహన్‌రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్ జగన్‌కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లో వాటాలతో పాటు సరస్వతి పవర్ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్ డీడ్‌ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన ఎన్సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. జగన్ ముందు గానే ఎన్సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మరీ ఇంత బరితెగింపా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు. రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి. ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది. పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్‌కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్‌కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్‌లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు. పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్‌కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది. కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా? -
కాంగ్రెస్‌కు ‘హరియాణా’ దరువు!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్‌లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్‌కే. కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం. హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్‌వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది. ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్‌కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్‌కు లేదన్నది వాస్తవం.బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు. పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్‌కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు. 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్‌కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత! -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
మన పాలిట మరో పాకిస్తాన్!
ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్‌కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్‌కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్‌కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్‌కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్‌ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.ఈవీఎమ్‌లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్‌కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్‌గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్‌లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్‌ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్‌ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్‌ను మార్కెట్ లీడర్‌గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్‌కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్‌ను, ట్రాఫిక్‌ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్‌లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్‌కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్‌ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్‌గా, లాజికల్‌గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్‌గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్‌గా సాక్షి డాట్ కామ్‌లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్‌లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్‌లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు.