గుంటూరులో వై.ఎస్ విజయమ్మ రేపు సమరదీక్ష | YS Vijayamma's Samara Deeksha starts from tomorrow at Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో వై.ఎస్ విజయమ్మ రేపు సమరదీక్ష

Published Sun, Aug 18 2013 10:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గుంటూరులో వై.ఎస్ విజయమ్మ రేపు సమరదీక్ష - Sakshi

గుంటూరులో వై.ఎస్ విజయమ్మ రేపు సమరదీక్ష

సాక్షి, గుంటూరు: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిరంకుశంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈ నెల 19 నుంచి గుంటూరులో నిరవధిక దీక్షను ప్రారంభించనున్నారని ఆ పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, గుంటూరు జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. శనివారం సాయంత్రం దీక్ష వే దిక వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ... సోమవారం ఉదయం 10 గంటల తరువాత బస్టాండ్ ఎదుట ఒక ప్రైవేట్ స్థలంలో దీక్ష ప్రారంభం అవుతుందని చెప్పారు. విజయమ్మ దీక్షను తొలుత విజయవాడలో నిర్వహించాలనుకున్నామని, అయితే అవనిగడ్డ ఉప ఎన్నికలను కారణంగా చూపి పోలీస్ కమిషనర్ దీక్ష నిర్వహణకు అనుమతించలేదని తెలిపారు. దీంతో చట్టంపై ఉన్న గౌరవంతో విజయమ్మ, పార్టీ ముఖ్యనేతల సూచనల మేరకు దీక్షా వేదికను గుంటూరుకు మార్చామని చెప్పారు.
 
 అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న పార్టీ వైఖరిని అన్ని వర్గాల వారికి తెలియజేయడమే  విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష ద్వారా లక్ష్యమని మర్రి రాజశేఖర్ తెలిపారు. విభజన ప్రకటన కంటే ముందుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, పార్టీ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు కూడా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ నిర్ణయాన్ని ఎండగట్టారని గుర్తుచేశారు. విజయమ్మ దీక్ష ప్రకటన అనంతరం చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, టీడీపీ నాయకులు కూడా రాజకీయం కోసం హడావుడిగా నిరాహార దీక్షలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అసలు టీడీపీ విధానమేమిటో చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయమ్మ దీక్ష ఆగదని పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. సమావేశంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
 
 విజయవాడలో అనుమతి నిరాకరణ
 శాంతిభద్రతలు, ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో విజయవాడలో వైఎస్ విజయమ్మ దీక్షకు అనుమతి ఇవ్వడంలేదని నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలో ఆమరణ దీక్ష చేపడతామని వైఎస్ విజయమ్మ, ఆ తర్వాత టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్షల కోసం సమర్పించిన దరఖాస్తులను ఎన్నికల కమిషన్ కోసం పంపించామని, అక్కడి నుంచి అనుమతి వచ్చేవరకూ దీక్ష చేపట్టవద్దంటూ దేవినేని ఉమకు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం దీక్షకు బయలుదేరిన ఉమ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే శనివారం సాయంత్రానికి ఎన్నికల సంఘం నుంచి వివరణ వచ్చింది. దీక్షలను ఎన్నికల సంఘం నిషేధించదని, శాంతి భద్రతల వ్యవహారాన్ని స్థానిక యంత్రాంగమే చూసుకోవాలని ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ స్పష్టం చేశారు. కానీ దీక్షలకు అనుమతినిచ్చేందుకు కమిషనర్ అంగీకరించలేదు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు జలీల్‌ఖాన్, గౌతంరెడ్డి తదితరులు శనివారం సాయంత్రం ఆయన చాంబర్‌లో కలిసి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో దీక్ష వేదికను గుంటూరుకు మార్చాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement