
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది
నివేదికను గవర్నర్‌కే ఇవ్వాలన్న నిబంధన ఏదీలేదు
విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయలేం
ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ హైకోర్టు తీర్పు
సాక్షి, అమరావతి :వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో పాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలేవీ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, విచారణ కమిషన్ తన నివేదికను గవర్నర్‌కు మాత్రమే సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ నివేదికను గవర్నర్‌కు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఏదీ చట్టంలో లేదని గుర్తుచేసింది.
అంతేకాక.. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ చట్టం కింద కమిషన్‌ను ఏర్పాటుచేయడం, విచారణ గడువును నిర్ధేశించడం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని తేల్చిచెప్పింది. కమిషన్ విచారణకు సమయం పడుతుందని.. అందువల్ల విచారణ పూర్తికి గడువును నిర్ధేశించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో పాటు, ఘటనపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లా, పాండురంగాపురానికి చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై గత వారం వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం, బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు.. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వంగవీటి నరేంద్ర పిల్‌ను సైతం హైకోర్టు పరిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment