
కొవిడ్-19 మహమ్మారికి ముందు టాప్ ఐటీ సంస్థల్లో వేతన ఇంక్రిమెంట్లు రెండంకెలమేర వృద్ధి చెందేవి. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో వేతన పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతన పెంపును అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది.
నివేదికల ప్రకారం వేతన పెంపు 4% నుంచి 8% వరకు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల సవరించిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. ఈ మేరకు త్వరలో వారికి లేఖలు అందుతాయని కొందరు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులోగా ఉద్యోగులకు వేతన సవరణలకు సంబంధించిన లేఖలు జారీ చేయాలని మరో టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.
పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలు
టీసీఎస్ జీతాల పెంపు, వేరియబుల్ చెల్లింపులను 2024 ప్రారంభంలో ప్రకటించిన రిటర్న్-టు-ఆఫీస్ (ఆర్‌టీఓ) ఆదేశానికి ఉద్యోగులు కట్టుబడి ఉండటానికి ముడిపెట్టింది. దానిప్రకారం ఆర్టీఓ పాలసీని పాటించిన ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. టీసీఎస్ ఏకీకృత నికర లాభంలో 11.95% పెరుగుదలను నివేదించినప్పటికీ మొత్తంగా స్వల్ప వేతన పెంపు మాత్రమే ఉందనే వాదనలొస్తున్నాయి. కంపెనీ నికరలాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.12,380 కోట్లకు చేరుకుంది. నికర అమ్మకాలు రూ.60,583 కోట్ల నుంచి 5.59 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు పెరిగాయి.
ఇదీ చదవండి: లిక్విడిటీ అవసరాలకు ఆర్‌బీఐ రూ.43 లక్షల కోట్లు
ఉద్యోగులు ఏమంటున్నారంటే..
వేతన పెంపు సానుకూల పరిణామమే అయినప్పటికీ కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు క్రమంగా తగ్గుముఖం పట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతంగా ఉన్న సగటు వేతన పెరుగుదల 2024 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతంగా ఉంది. ఏదేమైనా ఆర్టీఓ పాలసీని పాటించేవారికి అధిక ప్రోత్సాహకాలు ఉంటాయనే వాదనలుండడంపట్ల ఉద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment