సార్కోమాను ఎదుర్కోలేమా! | Soft Tissue Sarcoma: Symptoms Treatment Causes | Sakshi
Sakshi News home page

సార్కోమాను ఎదుర్కోలేమా!

Published Sun, Feb 16 2025 9:27 AM | Last Updated on Sun, Feb 16 2025 10:40 AM

Soft Tissue Sarcoma: Symptoms Treatment Causes

దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్‌లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. 

ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్‌కూ, టెండన్స్‌కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్‌ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్‌ కనెక్టివ్‌ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్‌ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంది. 

సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్‌టైప్స్‌ ఉంటాయి. ఈ కేన్సర్‌ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్‌టైప్స్‌గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్‌ సార్కోమా’. 

రిస్క్‌ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)...  
ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం...  హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. 

ఉదాహరణకు ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్‌ క్లోరైడ్‌ లేదా డయాక్సిన్స్‌ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. 

అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా  బాధితులు ఎక్కువ. 

ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. 

అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్‌’ వంటి సిండ్రోములు, జెనెటిక్‌ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. 

నిర్ధారణ..

  • సీటీ స్కాన్‌ వంటి ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్‌... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్‌ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్‌ ఉపకరణాలు సహాయపడతాయి. 

  • మృదు కణజాలంలో (సాఫ్ట్‌ టిష్యూల్లో) వచ్చే కేన్సర్‌ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, 

  • రేడియోషన్‌ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్‌ అయిన అలారా (ఏజ్‌ లో ఏజ్‌ రీజనబ్లీ అచీవబుల్‌) టెక్నిక్‌తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. 

  • ఇక పెట్‌–సీటీ, రేడియోమిక్స్‌ వంటి అధునాతన టెక్నిక్స్‌తో అవి హానికరం కాని బినైన్‌ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్‌ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. 

చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... 

  • అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్‌ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. 

  • బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్‌ స్పేరింగ్‌ సర్జరీస్‌), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్‌ స్పెసిఫిక్‌ ఇం΄్లాంట్స్‌)తో... ఆ  తొలగించిన చోట ఇంప్లాంట్స్‌ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్‌లిప్పుడు అందుబాటులో 

  • అత్యంత ఆధునికమైన ప్రోటాన్‌ థెరపీ, ఐఎమ్‌ఆర్‌టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్‌ రేడియేషన్‌ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్‌ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా  చేసే రేడియోథెరపీ. 

  • రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. 

  • ఇవేకాకుండా టార్గెటెడ్‌ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్‌ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. 

  • కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్‌–టీ సెల్‌ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. 
     

--డాక్టర్‌ (ప్రొఫెసర్‌) బి. రాజేష్‌, మస్క్యులో స్కెలిటల్‌ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్‌ ఆర్థోపెడిక్‌ హాస్పిటల్‌ బర్మింగ్‌హమ్‌ (యూకే)  

(చదవండి: కోళ్ల అందాల పోటీలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement