ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్‌ | 10 Poorest Countries in the World - Bangladesh, Pakistan Absent | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్‌

Published Tue, Feb 18 2025 11:34 AM | Last Updated on Tue, Feb 18 2025 11:42 AM

10 Poorest Countries in the World - Bangladesh, Pakistan Absent

ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది. ఫోర్బ్స్‌ అందించిన ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా గుర్తింపుపొందాయి. వీటిలో భారత్‌కు సన్నిహిత దేశమైన మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు.

1. దక్షిణ సూడాన్‌
దక్షిణ సూడాన్‌ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్‌ డాలర్లు. దక్షిణ సూడాన్‌ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత  అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైననే ఆధారపడింది.

2. బురుండీ
మధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్‌ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.

3. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం.  ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్‌ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం  మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.

4. మలావి
మలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్‌ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై  ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.

5. మొజాంబిక్
మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ  24.55 బిలియన్‌ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు.  ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.

6. సోమాలియా
సోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్‌ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.

7. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్‌ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.

8. లైబీరియా
లైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్‌ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో  లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.

9. యెమెన్
ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్‌ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.

10. మడగాస్కర్
మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్‌ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్,  పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

ఇది  కూడా చదవండి: ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement