
వాషింగ్టన్: వందల కోట్ల రూపాయల సొంత డబ్బును ఎన్నికల్లో ట్రంప్ కోసం ఖర్చు చేసి, ఆయనను గెలిపించి చివరకు ఆయన చేతుల్లోంచి అమెరికా పాలనాపగ్గాలను తీసుకుని సమాంతర పాలనను సాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొలిసారిగా ట్రంప్ సమక్షంలో స్పందించారు. డోజ్‌కు అదనపు అధికారాలు కట్టబెడుతూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై మంగళవారం ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంగా డోజ్ చీఫ్ హోదాలో మస్క్ సైతం అక్కడే ఉన్నారు.
వెంట ఆయన కుమారుడు అ– గీజీజీ ను సైతం తీసుకొచ్చారు. అమెరికా అధ్యక్షభవనంలోని ప్రఖ్యాత ఓవెల్ రూమ్‌లో రెజల్యూట్ డెస్క్ వద్ద ఆసీనులైన ట్రంప్ పక్కనే నిల్చుని మస్క్ కొద్దిసేపు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ప్రభుత్వ వ్యయాలు, సిబ్బందిని కుదించే లక్ష్యంతో ఏర్పాటైన డోజ్ విభాగ సారథిగా మాత్రమే పనిచేస్తున్నానని, అధ్యక్ష అధికారాల్లోకి వేలు పెట్టలేదని తొలిసారిగా అధికారికంగా సమాధానమిచ్చారు.
‘‘ ప్రభుత్వ విభాగాల రోజువారీ పనుల్లో నేను, నా డోజ్ బృంద సభ్యులు జోక్యం చేసుకుంటున్నారనేది పచ్చి అబద్ధం. నాపై ఆరోపణలు పైల్స్, అర్షమొలల రోగిపై చేసే పరీక్షలా ఉన్నాయి. నేను ఒక తెరచిన పుస్తకం. అంతా పారదర్శకం. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే విషయంలో మేం క్రూరమైన, విప్లవకారుల మనస్తత్వంతో పనిచేయట్లేము. ఇంగితజ్ఞానంతో పనిచేస్తున్నాం.
ఓటర్లు ప్రజాపాలనలో భారీ సంస్కరణలను కోరుకుంటూ ట్రంప్ బృందానికి ఓటేశారు. మేం ఇప్పుడు అదే సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఇదేకదా. మేం చేస్తున్న పని మొత్తం డోజ్ వెబ్సైట్లో అందరికీ కనిపిస్తుంది’’ అని అన్నారు. అయితే డోజ్ వెబ్సైట్లో అలాంటి వివరాలేవీ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పథకాలు, వాటికయ్యే ఖర్చులను డోజ్ తప్పుగా ప్రచురిస్తోందన్న ప్రశ్నకు మస్క్ బదులిచ్చారు.
‘‘ కొన్ని సార్లు తప్పులు దొర్లుతుంటాయి. వాటిని సరిచేయాల్సి ఉంది. ఇచి్చన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయాలన్న తొందరలో మేం చాలా వేగంగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఎవరూ 1,000 శాతం సరిగా ఉండరుగా’’ అని మస్క్ అన్నారు. ‘‘ ప్రజల ద్వారా ఎన్నికైన వ్యవస్థల కంటే ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అత్యంత శక్తివంతమైంది. ప్రభుత్వ అధికారుల్లో కొందరు చాలా మంచి వ్యక్తులున్నారు. అయితే చేసే పనికి వారిని జవాబుదారీగా మార్చాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment