
రష్యా విపక్ష పార్టిల్లో నాయకత్వ లోపం, అనైక్యత
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్షనేతగా ఎదిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణించి ఏడాది అయింది. ఈ ఏడాదిలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి.
విపక్ష పార్టీల్లో ఐక్యత లోపించడం ప్రధాన సమస్యగా తయారైంది. 47 ఏళ్ల నవాల్నీ 2024 ఏడాది ఫిబ్రవరి 16న రష్యా మారుమూల ఆర్కిటిక్ ఖండ సమీపంలోని పీనల్ కాలనీ కారాగారంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మరణానికి కారణాలను రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా ప్రభుత్వమే ఆయనను చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నవాల్నీపై నరాల సంబంధ విషప్రయోగం జరిగిన అంశాన్ని విపక్షాలు గుర్తుచేశాయి. నవాల్నీ మృతితో ఇప్పుడు పుతిన్ ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని ఒలెగ్ ఇవనోవ్ వ్యాఖ్యానించారు.
2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం మొదలెట్టాక నవాల్నీ మద్దతుదారు అయిన ఇవనోవ్ రష్యాను వీడి అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడ్డారు. ‘‘ రష్యా విపక్షంలో ఇన్నాళ్లూ ఉన్న ఏకైక ఆశాదీపం నవాల్నీ. ఆ దీపాన్ని ఆర్పేశారు. ఇన్నాళ్లూ మా దేశంలో ఏదైనా మంచి మార్పు చోటుచేసుకుని, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. నవాల్నీ మరణంతో మా ఆశలు అడుగంటాయి. విపక్షాలు పుతిన్ను ఎదుర్కొంటాయన్న ఆశ దాదాపు పూర్తిగా చచ్చిపోయింది’’ అని ఇవనోవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే నవాల్నీ మరణం తర్వాత ఆయన తరఫున వాదించిన లాయర్లనూ ‘తీవ్రవాదులు’గా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం జైలుపాలుచేసింది. అరెస్టు భయంతో నవాల్నీ మద్దతుదారులు రష్యాను వీడారు. కొందరు స్వదేశంలో ఉన్నా మౌనంగా ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment