
1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూశారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫొటో ఇస్తే.. పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫొటో ఇచ్చి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు.. అయితే, హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ (Cinema Story) ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. అంతకంటే ఎక్కువ పనులే చేస్తోంది. దైనందిన జీవితంలోనే కాదు.. నేర పరిశోధనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. పోలీసులకు సవాల్‌గా నిలిచిన కేసుల చిక్కుముళ్లను సునాయాసంగా విప్పి.. నేరస్తులను కటకటాల వెనక్కి నెడు తోంది. కేరళలో 19 ఏళ్లుగా మూలనపడి ఉన్న కేసును ఈ అభివన బ్రహ్మ సునాయాసంగా ఛేదించింది.
- సాక్షి సెంట్రల్ డెస్క్
19 ఏళ్ల క్రితం..
అది కేరళ (Kerala) కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం (Anchal Town) 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం ఆరు గంటలు.. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలకు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపించింది. తన ఒక్కగానొక్క కుమార్తె, రంజని, ఆమె 17 రోజుల కవలు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారు ముగ్గురినీ అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్కడ లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్, రాజేశ్ ఈ హత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 2010లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు.
ఏఐ రాకతో..
ప్రస్తుతం నేరపరిశోధనలోనూ ఏఐ (AI) కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేశ్ ఫొటో ఒక్కటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫొటో సాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేశ్ పాత ఫొటోను ఉపయోగించి.. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫొటో సృష్టించారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫొటోలను ఏఐను ఉపయోగించి జల్లెడ పట్టగా.. ఓ పెళ్లి ఫొటోలో ఉన్న వ్యక్తి 90 శాతం మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేశ్‌ను, అతడి ద్వారా దివిల్‌ను గుర్తించి అరెస్టు చేశారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్ పై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న దివిల్.. రంజని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేశ్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేశ్ అంచల్ వచ్చి.. తనను అనిల్ కుమార్‌గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్‌పై పోరులో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని.. అతడికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన రంజని.. ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేశ్ నిర్ణయానికి వచ్చారు.
చదవండి: విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేశ్.. పిల్లల పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీసుకు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజనిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల ఇద్దరు పసికందులను కూడా అలాగే చంపి, అక్కడ నుంచి జారుకున్నాడు. తర్వాత ఇరువురూ ఏమీ తెలియనట్టుగా పఠాన్ కోట్‌లోని ఆర్మీ బేస్ క్యాంపునకు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ బేస్‌కు వెళ్లారు. అయితే, అప్పటికే ఇరువురూ అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారమెత్తారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫొటోలో ఉన్న రాజేశ్‌ను ఏఐ గుర్తించడంతో ఇరువురూ కటకటాల వెనక్కి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment